RCB Beat GT: ఆర్సీబీ విజయంతో ఆ 2 జట్లు అవుట్‌.. ఇక ఢిల్లీ గెలిచిందో అంతే సంగతులు!

20 May, 2022 12:21 IST|Sakshi
రాజస్తాన్‌ రాయల్స్‌, ఆర్సీబీ, ఢిల్లీ క్యాపిటల్స్‌(PC: IP/BCCI)

IPL 2022 Playoffs Qualification Scenarios In Telugu: ఐపీఎల్‌-2022 సీజన్‌ ముగింపు దశకు చేరుకుంటోంది. ఐదుసార్లు చాంపియన్‌ అయిన ముంబై ఇండియన్స్‌ కేవలం మూడు విజయాలతో పాయింట్ల పట్టికలో అట్టడున ఉండగా.. డిఫెండింగ్‌ చాంపియన్‌ చెన్నై సూపర్‌కింగ్స్‌ తొమ్మిదో స్థానానికి పరిమితమైంది. ఈ రెండింటితో పాటు కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ప్రస్థానం కూడా ముగిసింది. ఈ మూడు జట్లు ఇప్పటికే టోర్నీ నుంచి నిష్క్రమించాయి.

అదరగొట్టిన కొత్త జట్లు
ఇదిలా ఉంటే.. తాజా ఎడిషన్‌తో క్యాష్‌ రిచ్‌ లీగ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన గుజరాత్‌ టైటాన్స్‌ ఏకంగా 20 పాయింట్లతో ప్లే ఆఫ్స్‌ చేరుకున్న తొలి జట్టుగా నిలిచింది. మరో కొత్త ఫ్రాంఛైజీ లక్నో సూపర్‌జెయింట్స్‌ 18 పాయింట్లతో ప్లే ఆఫ్స్‌ రేసులో గెలిచి నిలిచింది.

రాజస్తాన్‌ ఎలాగైనా!
ఇక ఆది నుంచి మంచి విజయాలు నమోదు చేసిన రాజస్తాన్‌ రాయల్స్‌ పదమూడింట 8 విజయాలతో 16 పాయింట్లు సాధించి పట్టికలో మూడో స్థానంలో నిలిచింది. తద్వారా ప్లే ఆఫ్స్‌ బెర్తును దాదాపుగా ఖరారు చేసుకుంది. రన్‌రేటు పరంగానూ మెరుగ్గా ఉన్న రాజస్తాన్‌.. చెన్నై సూపర్‌కింగ్స్‌తో శుక్రవారం(మే 20) నాటి మ్యాచ్‌లో గెలిస్తే టాప్‌-4లో అడుగుపెట్టడం ఖాయమే!

ఇదిలా ఉండగా.. రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు(ఆర్సీబీ) జట్టు.. గుజరాత్‌తో గురువారం(మే 19) జరిగిన మ్యాచ్‌లో గెలుపొంది.. 16 పాయింట్లు సాధించింది. తద్వారా పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి చేరుకుని.. ప్లే ఆఫ్స్‌ ఆశలు సజీవంగా ఉంచుకుంది. 

సన్‌రైజర్స్‌, పంజాబ్‌ అవుట్‌!
ఇక ఆర్సీబీ విజయంతో ప్లే ఆఫ్స్‌ రేసులో నిలవాలని ఆశపడిన పంజాబ్‌ కింగ్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఆశలు దాదాపు గల్లంతయినట్లే. ఇప్పటికే పదమూడేసి మ్యాచ్‌లు ఆడిన పంజాబ్‌, హైదరాబాద్‌ ఆరేసి విజయాలతో 12 పాయింట్లు సాధించి వరుసగా ఏడు, ఎనిమిది స్థానాల్లో ఉన్నాయి.

నెట్‌ రన్‌రేటు పరంగానూ ఇరు జట్లు(పంజాబ్‌: -0.043)(హైదరాబాద్‌:-0.230) వెనుకబడే ఉన్నాయి. కాబట్టి తమకు మిగిలిన మ్యాచ్‌(హైదరాబాద్‌ వర్సెస్‌ పంజాబ్‌)లో ఏ ఒక్క జట్టు భారీ తేడాతో గెలిచినా.. ఇప్పటికే మిగిలిన జట్లు పటిష్ట స్థితిలో నిలిచిన నేపథ్యంలో ఈ రెండు జట్లకు ప్లే ఆఫ్స్‌ దారులు దాదాపు మూసుకుపోయినట్లే!

అలా అయితే ఆర్సీబీ కూడా అవుట్‌!
ఇక ఆర్సీబీ విషయానికొస్తే... ఆఖరి లీగ్‌ మ్యాచ్‌లో గుజరాత్‌తో జరిగిన పోరులో 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. తద్వారా ఎనిమిదో విజయంతో 16 పాయింట్లు సాధించగలిగినా నెట్‌ రన్‌రేటు మైనస్‌(-0.253)లలో ఉండటం డుప్లెసిస్‌ బృందాన్ని కలవరపరుస్తోంది.

ఒకవేళ ముంబైతో జరిగే మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ గనుక గెలిస్తే ఆర్సీబీని వెనక్కి నెట్టి టాప్‌-4లో అడుగుపెట్టడం ఖాయం. ఎందుకంటే నెట్‌ రన్‌రేటు పరంగా రిషభ్‌ పంత్‌ సేన.. ఆర్సీబీ కంటే ఎంతో మెరుగ్గా(0.255)ఉంది.

మరోవైపు రాజస్తాన్‌ సీఎస్‌కే చేతిలో ఓడినా రన్‌ రేటు పరంగా పటిష్ట స్థితిలో ఉన్నందున టాప్‌-4లో చోటు మాత్రం ఖాయం. కాబట్టి ఢిల్లీ.. ముంబై చేతిలో ఓడితేనే ఆర్సీబీ ప్లే ఆఫ్స్‌లో అడుగుపెడుతుంది. అలా కాకుండా రాజస్తాన్‌.. చెన్నై చేతిలో ఓడినా.. ఢిల్లీ గెలిచినా(16 పాయింట్లు వస్తే) నెట్‌ రన్‌రేటు పరంగా వెనుకబడి ఉన్న ఆర్సీబీ కథ ముగుస్తుంది. 

చదవండి👉🏾IPL 2022 RR Vs CSK: సీఎస్‌కే తుదిజట్టులో అతడిని చూడాలని ఉంది.. ధోని ఒక్క ఛాన్స్‌ ఇస్తే!

Poll
Loading...
మరిన్ని వార్తలు