IPL 2022: పంజాబ్‌ బల్లే బల్లే...

14 May, 2022 05:29 IST|Sakshi
ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ బెయిర్‌స్టో

కీలక విజయం సాధించిన కింగ్స్‌

54 పరుగులతో బెంగళూరు ఓటమి

ముంబై: ‘ప్లే ఆఫ్స్‌’ చేరే అవకాశాలు దాదాపు అసాధ్యంగా కనిపిస్తున్న దశలో పంజాబ్‌ కింగ్స్‌ కీలక విజయంతో మళ్లీ రేసులోకి వచ్చింది. ఏకపక్ష పోరులో బెంగళూరును చిత్తు చేసి ఆశలు నిలబెట్టుకుంది. మరోవైపు ముందంజ వేసేందుకు చేరువైన స్థితిలో ఈ భారీ పరాజయం ఆర్‌సీబీకి నష్టం కలిగించనుంది. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌ 54 పరుగుల తేడాతో బెంగళూరును ఓడించింది.

ముందుగా పంజాబ్‌ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. లివింగ్‌స్టోన్‌ (42 బంతుల్లో 70; 5 ఫోర్లు, 4 సిక్స్‌లు), బెయిర్‌స్టో (29 బంతుల్లో 66; 4 ఫోర్లు, 7 సిక్స్‌లు) అర్ధ సెంచరీలు సాధించగా, హర్షల్‌ పటేల్‌ (4/34) రాణించాడు. అనంతరం బెంగళూరు 20 ఓవర్లలో 9 వికెట్లకు 155 పరుగులు చేసింది. మ్యాక్స్‌వెల్‌ (22 బంతుల్లో 35; 3 ఫోర్లు, 1 సిక్స్‌) టాప్‌ స్కోరర్‌గా నిలవగా... రబడ (3/21) రాణించాడు.

మెరుపు బ్యాటింగ్‌...
71 బంతుల్లో 136 పరుగులు... పంజాబ్‌ ఇన్నింగ్స్‌లో బెయిర్‌స్టో, లివింగ్‌స్టోన్‌ పాత్ర ఇది! మిగతా బ్యాటర్లంతా విఫలమైనా... ఈ ఇద్దరి దూకుడైన బ్యాటింగ్‌ కారణంగానే కింగ్స్‌ భారీ స్కోరు నమోదు చేయగలిగింది. ఆరంభంలో బెయిర్‌స్టో చెలరేగగా, ఆ తర్వాత లివింగ్‌స్టోన్‌ బాధ్యత తీసుకున్నాడు. హాజల్‌వుడ్‌ ఓవర్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు కొట్టిన బెయిర్‌స్టో, సిరాజ్‌ ఓవర్లో 3 భారీ సిక్స్‌లు, ఒక ఫోర్‌తో దూసుకుపోయాడు.

21 బంతుల్లోనే అతని అర్ధసెంచరీ పూర్తి కాగా, 8.5 ఓవర్లలోనే స్కోరు 100 పరుగులకు చేరింది. శిఖర్‌ ధావన్‌ (21), రాజపక్స (1), మయాంక్‌ (19), జితేశ్‌ (9) విఫలమైనా లివింగ్‌స్టోన్‌ జోరు కొనసాగించాడు. షహబాజ్‌ ఓవర్లో వరుస బంతుల్లో 4, 6 కొట్టిన అతను హాజల్‌వుడ్‌ వేసిన 19వ ఓవర్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో పండగ చేసుకున్నాడు. 35 బంతుల్లో అతను హాఫ్‌ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. హాజల్‌వుడ్‌ ఈ మ్యాచ్‌తో ఐపీఎల్‌ చరిత్రలో బెంగళూరు తరఫున అత్యంత చెత్త బౌలింగ్‌ గణాంకాలు (0/64) నమోదు చేశాడు.  

సమష్టి వైఫల్యం...
ఛేదనలో బెంగళూరు పూర్తిగా తడబడింది. ఆరంభంలో కొన్ని చక్కటి షాట్లు ఆడిన కోహ్లి (14 బంతుల్లో 20; 2 ఫోర్లు, 1 సిక్స్‌), డుప్లెసిస్‌ (10) ఒక పరుగు తేడాతో వెనుదిరగడంతో జట్టు పతనం మొదలైంది. లోమ్రోర్‌ (6) విఫలం కాగా, పటిదార్‌ (21 బంతుల్లో 26; 1 ఫోర్, 2 సిక్స్‌లు) కొద్దిసేపు పట్టుదల కనబర్చాడు. ఆ తర్వాత మ్యాక్స్‌వెల్‌ ఉన్నంత వరకు ఆర్‌సీబీ గెలుపుపై కాస్త ఆశలు పెట్టుకుంది. అయితే అతనితో పాటు దినేశ్‌ కార్తీక్‌ (11) కూడా తక్కువ వ్యవధిలో అవుట్‌ కావడంతో జట్టు వేగంగా ఓటమి దిశగా పయనించింది.

ఐపీఎల్‌లో నేడు
సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ X కోల్‌కతా నైట్‌రైడర్స్‌
వేదిక: పుణే, రాత్రి గం. 7:30 నుంచి స్టార్‌ స్పోర్ట్స్‌–1లో ప్రత్యక్ష ప్రసారం.

మరిన్ని వార్తలు