Qualifier 2 RR Vs RCB: తీవ్ర నిరాశ.. అయినా గర్వంగానే ఉంది.. మాకిది గొప్ప సీజన్‌.. థాంక్స్‌: డుప్లెసిస్‌

28 May, 2022 10:58 IST|Sakshi
ఆర్సీబీ కెప్టెన్‌ ఫాఫ్‌ డుప్లెసిస్‌(PC: IPL/BCCI)

‘‘ఆర్సీబీకి ఇది గ్రేట్‌ సీజన్‌. నాకు చాలా గర్వంగా ఉంది. మొదటి సీజన్‌లోనే ఇక్కడిదాకా తీసుకువచ్చినందుకు! ఎక్కడికెళ్లినా మా అభిమానులు మా వెంటే ఉన్నారు. మాకు మద్దతు తెలపడానికి ఇక్కడిదాకా వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఈ సీజన్‌లో మాకంటూ కొన్ని గుర్తుండిపోయే ప్రదర్శనలు ఉన్నాయి.

ముఖ్యంగా హర్షల్‌ అద్భుతం. ఇక డీకే గురించి చెప్పాల్సిన పనిలేదు. జాతీయ జట్టులో మళ్లీ చోటు దక్కించుకున్నాడు. రజత​ పాటిదార్‌ కూడా ఆకట్టుకున్నాడు. ఇక ఈరోజు మ్యాచ్‌ మమ్మల్ని తీవ్ర నిరాశకు గురిచేసింది. రాజస్తాన్‌ రాయల్స్‌ బలమైన జట్టు. నిజానికి మాకంటే ఎక్కువ వారే విజయానికి అర్హులు. మా మొదటి ఆరు ఓవర్లు టెస్టు క్రికెట్‌లా సాగాయి. ఈ వికెట్‌ పాతబడ్డ కొద్దీ బ్యాటర్లకు అనుకూలించింది’’ అని రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు కెప్టెన్‌ ఫాఫ్‌ డుప్లెసిస్‌ అన్నాడు.

కాగా ఐపీఎల్‌-2022తో వరుసగా మూడోసారి ప్లే ఆఫ్స్‌ చేరిన ఆర్సీబీ.. లక్నోను ఓడించి క్వాలిఫైయర్‌-2కు అర్హత సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఫైనల్‌ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ చేతిలో ఓటమి పాలైంది. రాజస్తాన్‌ బ్యాటర్‌ జోస్‌ బట్లర్‌ చెలరేగడంతో ఏడు వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. ఇక సంజూ సేన సగర్వంగా ఫైనల్లో అడుగుపెట్టింది.

ఈ నేపథ్యంలో మ్యాచ్‌ అనంతరం ఆర్సీబీ సారథి డుప్లెసిస్ మాట్లాడుతూ.. కీలక పోరులో ఓటమి నిరాశపరిచిందని.. ఏదేమైనా తమకు ఈ సీజన్‌ గొప్పగా సాగిందని పేర్కొన్నాడు. అదే విధంగా భారత సంస్కృతి గొప్పదని, ఇక్కడి ప్రజలు ఎంతో ప్రేమాభిమానాలు చూపిస్తారన్నాడు.

ఇక ఆర్సీబీ ఫ్యాన్స్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదని, వారు ఎక్కడున్నా ఆర్సీబీ నామస్మరణతో ఆ ప్రాంతం మారుమోగాల్సిందేనని.. వ్యక్తిగతంగా, జట్టుగా ఇంతమంది అభిమానం పొందడం గర్వకారణమని భావోద్వేగానికి లోనయ్యాడు. ప్రతి ఒక్కరికి పేరు పేరునా ధన్యవాదాలు చెప్పాడు.

ఐపీఎల్ క్వాలిఫైయర్‌-2: రాజస్తాన్‌ రాయల్స్‌ వర్సెస్‌ రాయల్‌ చాలెంజర్స్‌
టాస్‌: రాజస్తాన్‌ రాయల్స్‌
బెంగళూరు స్కోరు: 157/8 (20)
రాజస్తాన్‌ స్కోరు: 161/3 (18.1)
విజేత: ఏడు వికెట్ల తేడాతో రాజస్తాన్‌ విజయం.. ఫైనల్లో అడుగు
ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌: జోస్‌ బట్లర్‌(60 బంతుల్లో 10 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 106 పరుగులు- నాటౌట్‌)

చదవండి: IPL 2022: ఐపీఎల్‌లో మహ్మద్‌ సిరాజ్‌ చెత్త రికార్డు.. తొలి బౌలర్‌గా..!

Poll
Loading...
మరిన్ని వార్తలు