Qualifier 2 RR Vs RCB: సమఉజ్జీలు.. పంతం నీదా- నాదా సై.. అహ్మదాబాద్‌లో టాస్‌ గెలిస్తే!

27 May, 2022 12:29 IST|Sakshi

IPL 2022 Qualifier 2 RR Vs RCB: మరోసారి విజేతగా నిలవాలనే కసితో రాజస్తాన్‌ రాయల్స్‌... కనీసం ఈసారైనా టైటిల్‌ గెలవాలనే పట్టుదలతో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు.. ఫైనల్లో అడుగుపెట్టాలని ఉవ్విళ్లూరుతున్నాయి. తుది పోరుకు అర్హత సాధించి ఐపీఎల్‌-2022 ట్రోఫీ గెలవాలని తహతహలాడుతున్నాయి.

ఇందుకోసం ఫైనల్లో గుజరాత్‌ టైటాన్స్‌తో పోటీపడే క్రమంలో అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ క్రమంలో శుక్రవారం ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. మరి తుదిజట్లు ఎలా ఉండబోతున్నాయి? పిచ్‌ వాతావరణం, ముఖాముఖి రికార్డులు తదితర అంశాలు పరిశీలిద్దాం.

మ్యాచ్‌ ఎప్పుడు, ఎక్కడ?
శుక్రవారం (మే 27), రాత్రి ఏడున్నర గంటలకు ఆరంభం
వేదిక: నరేంద్ర మోదీ స్టేడియం, అహ్మదాబాద్‌

ముఖాముఖి పోరులో..
ఐపీఎల్‌లో ఇప్పటి వరకు రాజస్తాన్‌, ఆర్సీబీ 26 సార్లు తలపడ్డాయి. ఇందులో 11 సార్లు రాజస్తాన్‌ గెలుపొందగా.. ఆర్సీబీ 13 సార్లు విజయం సాధించింది. ఇక ఐపీఎల్‌-2022 ఎడిషన్లో లీగ్‌ దశలో  రెండు మ్యాచ్‌లలో పోటీ పడగా...ఇరు జట్లు చెరో మ్యాచ్‌లో నెగ్గి సమ ఉజ్జీలుగా ఉన్నాయి.

పిచ్‌ వాతావరణం
అహ్మదాబాద్‌లో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నాయి. రాత్రుళ్లు కూడా ఇక్కడ 29 డిగ్రీలు నమోదు అవుతున్నాయి. ఇక అహ్మదాబాద్‌ గ్రౌండ్‌లో ఆరు ఎర్రమట్టి, 5 నల్లమట్టి పిచ్‌లు ఉన్నాయి. కాబట్టి ఈ మ్యాచ్‌కు ఉపయోగించిన మట్టిపైనే పిచ్‌ స్వభావం ఆధారపడి ఉంటుంది. 

ఎర్రమట్టి పిచ్‌లు అయితే త్వరగా ఎండి.. స్పిన్నర్లకు అనుకూలంగా మారతాయి. గతంలో కూడా ఇక్కడి మ్యాచ్‌లలో స్పిన్నర్లకే ప్రయోజనం చేకూరింది. 

ఇక అహ్మదాబాద్‌ వికెట్‌పై నమోదైన సగటు తొలి ఇన్నింగ్స్‌- 160 పరుగులు. ఇక్కడ లక్ష్య ఛేదనకు దిగిన జట్లే 55 శాతం గెలుపొందాయి. కాబట్టి టాస్‌ గెలిచిన జట్టు ముందుగా బౌలింగ్‌ ఎంచుకునే అవకాశం కనిపిస్తోంది.

తుది జట్ల అంచనా
రాజస్తాన్‌ రాయల్స్‌:
యశస్వి జైశ్వాల్‌, జోస్‌ బట్లర్‌, సంజూ శాంసన్‌(కెప్టెన్‌- వికెట్‌ కీపర్‌), దేవ్‌దత్‌ పడిక్కల్‌, షిమ్రన్‌ హెట్‌మెయిర్‌, రియాన్‌ పరాగ్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌, ట్రెంట్‌ బౌల్ట్‌, ప్రసిద్‌ కృష్ణ, యజువేంద్ర చహల్‌, ఒబెడ్‌ మెకాయ్‌.

బ్యాటర్‌ జోస్‌ బట్లర్‌, బౌలర్లు చహల్‌, ప్రసిద్‌ కృష్ణ రాజస్తాన్‌ జట్టుకు ప్రధాన బలం.

రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు:
విరాట్‌ కోహ్లి, ఫాఫ్‌ డుప్లెసిస్‌(కెప్టెన్‌), రజత్‌ పాటిదార్‌, గ్లెన్‌ మాక్స్‌వెల్‌, దినేశ్‌ కార్తిక్‌(వికెట్‌ కీపర్‌), మహిపాల్‌ లామ్రోర్‌, షాబాజ్‌ అహ్మద్‌, వనిందు హసరంగ, హర్షల్‌ పటేల్‌, మహ్మద్‌ సిరాజ్‌, జోష్‌ హాజిల్‌వుడ్‌.

కోహ్లి, డుప్లెసిస్‌తో పాటు ఎలిమినేటర్‌ హీరో రజత్‌ పాటిదార్‌, దినేశ్‌ కార్తిక్‌ మరోసారి బ్యాట్‌ ఝులిపించడంతో పాటు రాజస్తాన్‌ స్టార్‌ బ్యాటర్లు బట్లర్‌, శాంసన్‌లను ఆర్సీబీ బౌలర్లు కట్టడి చేసి సమిష్టి కృషితో రాణిస్తే గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

చదవండి 👇
Shikhar Dhawan: పాపం ధావన్‌... తన తప్పు లేకున్నా తన్నులు తిన్నాడు! వైరల్‌ వీడియో
IPL 2022: చాన్స్‌ ఇస్తే... చెలరేగిపోయారు... ఈ నలుగురు వారికి వారే సాటి! అద్భుతంగా..

మరిన్ని వార్తలు