Ravichandran Ashwin: ఐపీఎల్‌లో అశ్విన్‌ అరుదైన ఘనత.. 

27 Apr, 2022 11:38 IST|Sakshi
Courtesy: IPL Twitter

రాజస్తాన్‌ రాయల్స్‌ సీనియర్‌ ఆఫ్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ ఐపీఎల్‌లో 150 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. ఆర్‌సీబీతో మ్యాచ్‌లో రజత్‌ పాటిదార్‌ను పెవిలియన్‌ చేర్చడం ద్వారా అశ్విన్‌ ఈ ఫీట్‌ సాధించాడు. ఇన్నింగ్స్ పదో ఓవర్లో బౌలింగ్‌కు వచ్చిన అతను.. తన స్పిన్‌తో యువ బ్యాటర్ పటీదార్‌ను బోల్తా కొట్టించాడు. అశ్విన్ వేసిన బంతిని సరిగా అంచనా వేయలేకపోయిన పటీదార్.. క్లీన్ బౌల్డ్ అయ్యాడు.

తద్వారా ఐపీఎల్‌లో హర్భజన్‌ సింగ్‌ తర్వాత 150 వికెట్లు పడగొట్టిన రెండో ఆఫ్‌స్పిన్నర్‌గా నిలిచాడు. ఓవరాల్‌గా ఐపీఎల్‌లో 150 వికెట్ల మార్క్‌ అందుకున్న ఎనిమిదో బౌలర్‌గా అశ్విన్‌ రికార్డు సాధించాడు. ఇక ఆర్‌సీబీతో మ్యాచ్‌లో అశ్విన్‌ కీలకమైన మూడు వికెట్లు తీశాడు. మొదట రజత్‌ పాటిదార్‌ను వెనక్కి పంపిన అశ్విన్‌ ఆ తర్వాత సుయాష్‌ ప్రభుదేశాయ్‌, షాబాజ్‌ అహ్మద్‌ వికెట్లను పడగొట్టాడు. ఇక ఐపీఎల్‌లో రిటైర్డ్‌ ఔట్‌ అయిన తొలి బ్యాటర్‌గా అశ్విన్‌ చరిత్ర సృష్టించాడు. రూ. 5 కోట్లకు రాజస్తాన్‌ రాయల్స్‌ అశ్విన్‌ను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. రాజస్తాన్‌ రాయల్స్‌ ​29 పరుగుల తేడాతో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ) జట్టును ఓడించింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన రాజస్తాన్‌ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ రియాన్‌ పరాగ్‌ (31 బంతుల్లో 56 నాటౌట్‌; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్ధ సెంచరీ సాధించాడు. అనంతరం బెంగళూరు 19.3 ఓవర్లలో 115 పరుగులకే ఆలౌటైంది. కెప్టెన్‌ డుప్లెసిస్‌ (21 బంతుల్లో 23; 3 ఫోర్లు, 1 సిక్స్‌)దే అత్యధిక స్కోరు. కుల్దీప్‌ సేన్‌ (4/20) రాణించగా, అశ్విన్‌ 3 వికెట్లు, ప్రసిధ్‌ కృష్ణ 2 వికెట్లు తీశారు.  

చదవండి: Virat Kohli: ఎత్తుపల్లాలు సహజం.. జట్టు నుంచి తీసేయాలనడం కరెక్ట్‌ కాదు!

IPL 2022 RR Vs RCB: ఐపీఎల్‌ చరిత్రలో మూడో ఆటగాడిగా రియాన్‌ పరాగ్‌..

మరిన్ని వార్తలు