Ajinkya Rahane: మూడుసార్లు తప్పించుకున్నాడు.. ఏం ప్రయోజనం!

10 Apr, 2022 19:16 IST|Sakshi
Courtesy: IPL Twitter

ఐపీఎల్‌ 2022లో ఢిల్లీ క్యాపిటల్స్‌, కేకేఆర్‌ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్‌ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 215 పరుగుల భారీ స్కోరు చేసింది. పృథ్వీ షా 51, వార్నర్‌ 61 పరుగులు చేయగా.. ఆఖర్లో అక్షర్‌ పటేల్ 22*, శార్దూల్‌ ఠాకూర్‌ 29* రాణించారు. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్‌కు ఓపెనర్లుగా వెంకటేశ్‌ అయ్యర్‌, రహానేలు వచ్చారు.

ఘనమైన ఆరంభం వస్తుందనుకుంటే తొలి ఓవర్లోనే కేకేఆర్‌కు వరుస షాక్‌లు తగిలాయి. ముస్తాఫిజుర్‌ వేసిన తొలి ఓవర్‌లోనే అజింక్యా రహానే మూడుసార్లు ఔట్‌ నుంచి తప్పించుకున్నాడు. ఇందులో రహానే రెండుసార్లు డీఆర్‌ఎస్‌తో ఫలితం సాధించగా.. మరొకసారి అంపైర్‌ నాటౌట్‌ ఇచ్చాడు. ఓవర్‌ తొలి బంతి రహానే ప్యాడ్ల మీదకు వచ్చింది. ఢిల్లీ ఆటగాళ్లు అప్పీల్‌ చేయగా.. అంపైర్‌ ఔటిచ్చాడు. వెంటనే రహానే రివ్యూకు వెళ్లి ఫలితం సాధించాడు. ఆ తర్వాత రెండో బంతి కూడా అదే తరహాలో రావడం.. ఢిల్లీ అప్పీల్‌కు వెళ్లడం.. అంపైర్‌ మదన్‌ గోపాల్‌ ఔటివ్వడం జరిగిపోయాయి. అయితే రెండోసారి రహానే రివ్యూకు వెళ్లాడు. రిప్లేలో బంతి ఎడ్జ్‌ తీసుకున్నట్లు తేలడంతో నాటౌట్‌ అని వచ్చింది.


ఇక ముచ్చటగా మూడోసారి వైడ్‌ వెళ్తున్న బంతిని రహానే టచ్‌ చేశాడు. అయితే ఈసారి ఢిల్లీ క్యాపిటల్స్‌ ఎలాంటి అప్పీల్‌కు వెళ్లలేదు. వాస్తవానికి బంతి బ్యాట్‌కు తగిలినట్లు అల్ట్రాఎడ్జ్‌లో స్పైక్‌ కనిపించింది. కానీ ఢిల్లీ అప్పీల్‌ చేయకపోవడంతో రహానే ఔట్‌ నుంచి తప్పించుకున్నాడు. మూడుసార్లు బతికిపోయిన రహానే ఆ అవకాశాన్ని వినియోగించుకోలేకపోయాడు. 14 బంతులెదుర్కొని 8 పరుగులు మాత్రమే చేసిన రహానే ఖలీల్‌ అహ్మద్‌ బౌలింగ్‌లో శార్దూల్‌ ఠాకూర్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. అలా రహానే ఇన్నింగ్స్‌ ముగిసింది. ఇది చూసిన అభిమానులు.. మూడుసార్లు ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు.. అవకాశమొచ్చినా ఉపయోగించుకోలేకపోయాడు.. ఆడి ఏం ప్రయోజనం అంటూ చురకలు అంటించారు.

చదవండి: Ricky Ponting: అంపైర్‌తో ఢిల్లీ క్యాపిటల్స్‌ హెడ్‌కోచ్‌ వాగ్వాదం

>
మరిన్ని వార్తలు