IPL 2022 RR Vs CSK: అశ్విన్‌, జైశ్వాల్‌ మెరుపులు.. రాజస్తాన్‌ రాజసంగా ప్లేఆఫ్స్‌కు

21 May, 2022 05:40 IST|Sakshi

రెండో స్థానంతో ప్లే ఆఫ్స్‌కు

చెన్నైపై 5 వికెట్లతో విజయం

రాణించిన జైస్వాల్, అశ్విన్‌

మొయిన్‌ అలీ పోరాటం వృథా

ముంబై: రాజస్తాన్‌ రాయల్స్‌ లక్ష్యఛేదనకు దిగిన తొలి ఓవర్‌ పూర్తవడంతోనే నెట్‌ రన్‌రేట్‌తో ఈ ఐపీఎల్‌ సీజన్‌లో ‘ప్లే ఆఫ్స్‌’ దశకు అర్హత సాధించింది. డిఫెండింగ్‌ చాంపియన్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌తో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ఐదు వికెట్ల విజయంతో రాజస్తాన్‌ లీగ్‌ దశను రెండో స్థానంతో ముగించింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన చెన్నై  నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది.

మొయిన్‌ అలీ (57 బంతుల్లో 93; 13 ఫోర్లు, 3 సిక్సర్లు) వీరోచిత ప్రదర్శన చేశాడు. తర్వాత రాజస్తాన్‌ రాయల్స్‌ 19.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 151 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ (44 బంతుల్లో 59; 8 ఫోర్లు, 1 సిక్స్‌), ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ రవిచంద్రన్‌ అశ్విన్‌ (23 బంతుల్లో 40 నాటౌట్‌; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) రాణించారు.  

ఆడింది అలీ ఒక్కడే!
ఓపెనర్లు రుతురాజ్‌ గైక్వాడ్‌ (2), కాన్వే (16) సహా... జగదీశన్‌ (1), అంబటి రాయుడు (3), ధోని (28 బంతుల్లో 26; 1 ఫోర్, 1 సిక్స్‌) ఇలా చెన్నై బ్యాటర్లంతా నిరాశపరిస్తే వన్‌డౌన్‌ బ్యాటర్‌ మొయిన్‌ అలీ ఒంటరి పోరాటం చేశాడు. ఇక చెన్నై జోరంతా 4, 5, 6 ఓవర్లలోనే కనిపించింది. ఆ తర్వాత బోర్‌ కొట్టించింది. ఆ మూడు ఓవర్లయితే అలీ జూలు విదిల్చాడు. ప్రసిధ్‌ కృష్ణ నాలుగో ఓవర్లో 4, 4, 0, 6, 4, 0లతో 18 పరుగులు పిండుకున్న అలీ... అశ్విన్‌ ఐదో ఓవర్లో రెండు బౌండరీలు, ఒక సిక్సర్‌ బాదాడు.

ఇక బౌల్ట్‌ ఆరో ఓవరైతే బంతి ఆరుసార్లూ బౌండరీ లైను దాటింది. 6, 4, 4, 4, 4, 4లతో అలీ శివమెత్తాడు. ఈ ఓవర్లో 26 పరుగులొచ్చాయి. 19 బంతుల్లోనే అతని ఫిఫ్టీ పూర్తయింది. పవర్‌ ప్లేలో చెన్నై స్కోరు 75/1 అయితే అలీ ఒక్కడివే 59 పరుగులుండటం విశేషం. ఆ తర్వాత 14 ఓవర్లలో 5 వికెట్లను కోల్పోయి మరో 75 పరుగులే చేయగలిగింది. ఆఖరి ఓవర్‌ తొలిబంతికే మొయిన్‌ అవుట్‌ కావడంతో సెంచరీ చేజారింది.

యశస్వి అర్ధ శతకం
భారీ లక్ష్యం కాకపోయినా ఛేదించేందుకు రాజస్తాన్‌ కష్టపడింది. ఆరంభంలోనే బట్లర్‌ (2) పెవిలియన్‌ చేరగా, మరో ఓపెనర్‌ యశస్వి జైస్వాల్, కెప్టెన్‌ సామ్సన్‌ (15) రెండో వికెట్‌కు 51 పరుగులు జోడించాక స్వల్ప వ్యవధిలో సామ్సన్‌తో పాటు పడిక్కల్‌ (3) కూడా పెవిలియన్‌ చేరాడు. ఇన్నింగ్స్‌ కు వెన్నెముకగా నిలిచిన జైస్వాల్‌ 39 బంతుల్లో (8 ఫోర్లు) అర్ధసెంచరీ సాధించాడు. అయితే జట్టు స్కోరు 100 పరుగులు దాటాక జైస్వాల్‌ను, హెట్‌మైర్‌ (6)ని అవుట్‌ చేసిన సోలంకి రాయల్స్‌ శిబిరంలో గుబులు రేపాడు. ఈ దశలో అశ్విన్‌ సిక్సర్లతో ఆపద్భాంధవుడి పాత్ర పోషించి.. పరాగ్‌ (10 నాటౌట్‌)తో కలిసి జట్టును గెలిపించాడు.

మరిన్ని వార్తలు