IPL 2022: షేన్ వార్న్‌కు నివాళిగా ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసిన రాజస్థాన్‌ రాయల్స్‌

27 Apr, 2022 22:46 IST|Sakshi

ఐపీఎల్‌ ప్రారంభ ఎడిషన్‌లో (2008) ఏ మాత్రం అంచనాలు లేని రాజస్థాన్‌ రాయల్స్‌ను ఛాంపియన్‌గా నిలబెట్టిన ఘనత లెజెండరీ షేన్‌ వార్న్‌దే అన్నది ఎవరూ కాదనలేని నిజం. ఐపీఎల్‌ అరంగేట్రం సీజన్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌కు నాయకత్వం వహించి, ఆ జట్టు టైటిల్‌ గెలవడంలో కీలకపాత్ర పోషించిన వార్న్‌ ఇటీవలే గుండెపోటుతో మరణించాడు. ఆటగాడిగా, కెప్టెన్‌గా, మెంటార్‌గా తమతో ప్రత్యేక అనుబంధం కలిగిన వార్న్‌కు రాజస్థాన్‌ రాయల్స్‌ ఘనంగా నివాళులర్పించాలని ప్లాన్‌ చేసింది. 

ఇందుకోసం వార్న్‌ ఆర్‌ఆర్‌కు టైటిల్‌ అందించిన మైదానంలో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసింది. నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియం వేదికగా జరిగిన 2008 ఐపీఎల్‌ ఫైనల్లో రాజస్థాన్ రాయల్స్... చెన్నై సూపర్ కింగ్స్‌ను మట్టికరిపించి ఐపీఎల్‌ తొలి విజేతగా అవతరించింది. ఇప్పుడదే మైదానంలో రాజస్థాన్‌ రాయల్స్‌ షేన్‌ వార్న్‌ను స్మరించుకునేందుకు ఏర్పాట్లు ప్రారంభించింది. 

ఏప్రిల్ 30న డీవై పాటిల్ స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగే మ్యాచ్‌కు ముందు ఆర్‌ఆర్‌ యాజమాన్యం ఓ ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి వార్న్ కుటుంబానికి చెందిన పలువురు దగ్గరి వ్యక్తులకు ఆహ్వానం పంపింది. వార్న్‌ సోదరుడు జేసన్ వార్న్ ఈ కార్యక్రమంలో పాల్గొంటానని వెల్లడించాడు. ఈ ప్రోగ్రాం స్టార్ స్పోర్ట్స్‌తో పాటు రాజస్థాన్ రాయల్స్ సోషల్ మీడియా హ్యాండిల్లో కూడా ప్రత్యక్ష ప్రసారం కానుంది. ఈ కార్యక్రమం సందర్భంగా రాజస్థాన్ ఆటగాళ్లు తమ జెర్సీ కాలర్ పైనా, ప్లేయింగ్ కిట్లపైనా 'SW23' అనే స్టిక్కర్లు పెట్టుకోనున్నారు. 
చదవండి: టీమిండియా టెస్ట్‌ కెప్టెన్సీకి అతడే సరైనోడు..!

మరిన్ని వార్తలు