IPL 2022: గుజరాత్‌ను ఢీకొట్టనున్న రాజస్తాన్‌.. నేడే తొలి క్వాలిఫయర్‌

24 May, 2022 07:19 IST|Sakshi
Photo Courtesy: IPL

జోరు మీదున్న హార్దిక్‌ బృందం

దీటుగా సంజూ సామ్సన్‌ జట్టు

రాత్రి గం. 7:30 నుంచి స్టార్‌ స్పోర్ట్స్‌–1లో ప్రత్యక్ష ప్రసారం

కోల్‌కతా: ఈ ఏడాదే ఐపీఎల్‌లో ప్రవేశించిన గుజరాత్‌ టైటాన్స్‌ ఇప్పుడు ఫైనల్లో అడుగు పెట్టేందుకు తహతహలాడుతోంది. ఇప్పటిదాకా ఈ టోర్నీలో అంచనాలకు మించి రాణించిన టైటాన్స్‌ నేడు జరిగే తొలి క్వాలిఫయర్‌లో మాజీ చాంపియన్‌ రాజస్తాన్‌ రాయల్స్‌తో తలపడుతుంది. ఇరు జట్లను పరిశీలిస్తే... రాజస్తాన్‌ బలమంతా బ్యాటింగే. లీగ్‌ దశలో ఏకంగా 200 పైచిలుకు స్కోర్లను మూడుసార్లు చేసింది. 190 పరుగుల లక్ష్యాన్ని కూడా అవలీలగా ఛేదించింది.

ఓపెనింగ్‌లో బట్లర్‌ సెంచరీలతో కదంతొక్కాడు. గత కొన్ని మ్యాచ్‌ల్లో ఇతను విఫలమైతే వెంటనే మెరిపించే బాధ్యతను మరో ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ తీసుకున్నాడు. ఈ ఇద్దరితో పాటు కెప్టెన్‌ సంజూ సామ్సన్‌తో టాపార్డర్‌ పటిష్టంగా ఉంది. మిడిలార్డర్‌లో హెట్‌మైర్, దేవ్‌దత్‌ పడిక్కల్, రియాన్‌ పరాగ్‌లతో బ్యాటింగ్‌ ఆర్డర్‌ బలంగా ఉంది. సీమర్లు బౌల్ట్, ప్రసిధ్‌ కృష్ణ, స్పిన్నర్లు చహల్, అశ్విన్‌లు కూడా రాణిస్తుండటంతో రాజస్తాన్‌ లీగ్‌ దశలో రెండో స్థానంలో నిలిచింది. 

చాంపియన్లను ‘ఢీ’కొట్టి... 
మరోవైపు గుజరాత్‌ డిఫెండింగ్‌ చాంపియన్‌ చెన్నైపై రెండుసార్లు, మాజీ చాంపియన్‌ రాజస్తాన్‌పై ఆడిన ఒకసారి గెలిచి ఆరంభం నుంచి ఆఖరిదాకా అగ్రస్థానంలోనే నిలిచింది. ఓపెనర్‌ వృద్ధిమాన్‌ సాహా, వేడ్, కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా, మిల్లర్, రాహుల్‌ తెవాటియాలు చకచకా పరుగులు సాధిస్తున్నారు. బౌలింగ్‌లో సీనియర్‌ సీమర్‌ షమీ, ఫెర్గూసన్‌ ప్రత్యర్థి బ్యాటర్లను దెబ్బతీస్తున్నారు. లీగ్‌ స్పెషలిస్టు స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌ బంతితోనే కాదు... అవసరమైనప్పుడు బ్యాట్‌తోనూ జట్టుకు అవసరమైన పరుగులు జతచేస్తున్నాడు.

జట్లు (అంచనా)..
గుజరాత్‌: హార్దిక్‌ పాండ్యా (కెప్టెన్‌), సాహా, గిల్, వేడ్, మిల్లర్, తెవాటియా, రషీద్‌ ఖాన్, షమీ, సాయికిషోర్, ఫెర్గూసన్, యశ్‌ దయాళ్‌. 

రాజస్తాన్‌: సామ్సన్‌ (కెప్టెన్‌), యశస్వి, బట్లర్, పడిక్కల్, హెట్‌మైర్, పరాగ్, అశ్విన్, బౌల్ట్, చహల్, ప్రసిధ్‌ కృష్ణ, మెక్‌కాయ్‌. 

మరిన్ని వార్తలు