IPL 2022: ముంబై ఇండియన్స్‌ చేసిన అతి పెద్ద తప్పు ఇదే! అతడిని అనవసరంగా వదిలేసి..

17 Mar, 2022 13:11 IST|Sakshi
ముంబై ఇండియన్స్‌ జట్టు(ఫైల్‌- PC- IPL)

IPL 2022- Mumbai Indians: ఐపీఎల్‌ మెగా వేలం-2022 నేపథ్యంలో ముంబై ఇండియన్స్‌ నలుగురు ఆటగాళ్లను రిటైన్‌ చేసుకున్న విషయం తెలిసిందే. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, హిట్టర్‌ కీరన్‌ పొలార్డ్‌(వెస్టిండీస్‌), స్టార్‌ పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా, కీలక బ్యాటర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌లను అట్టిపెట్టుకుంది. ఈ క్రమంలో నిబంధనలకు అనుగుణంగా న్యూజిలాండ్‌ పేసర్‌ ట్రెంట్‌ బౌల్ట్‌ను వదిలేయాల్సి వచ్చింది. 

ఇక బెంగళూరు వేదికగా జరిగిన మెగా వేలంలో అతడిని సొంతం చేసుకునేందుకు ముంబై పోటీ పడినా నిరాశ తప్పలేదు. రాజస్తాన్‌ రాయల్స్‌ ఫ్రాంఛైజీ 8 కోట్లు ఖర్చుచేసి బౌల్ట్‌ను దక్కించుకుంది. ఈ నేపథ్యంలో విరాట్‌ కోహ్లి చిన్ననాటి కోచ్‌ రాజ్‌కుమార్‌ శర్మ మాట్లాడుతూ.. అనువభవజ్ఞుడైన బౌల్ట్‌ను వదులుకుని ముంబై పెద్ద పొరపాటే చేసిందని అభిప్రాయపడ్డాడు.

ఈ మేరకు ఆయన ఖేల్‌నీతి పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ.. ‘‘ముంబై లెక్క తప్పింది. ట్రెంట్‌ బౌల్ట్‌ సేవలను వాళ్లు కచ్చితంగా మిస్సవుతారు. బౌల్ట్‌, జస్‌ప్రీత్‌ బుమ్రా కలిసి ఎన్నో మ్యాచ్‌లు గెలిపించారు. అలాంటి పేసర్‌(బౌల్ట్‌)ను ఎందుకు వదిలేసిందో అర్థం కావడం లేదు.  ఇప్పుడు అతడి గైర్హాజరీలో వాళ్లు ఉనద్కట్‌ వైపు చూస్తారేమో! ఇటీవల అతడు సౌరాష్ట్ర తరఫున మంచి ప్రదర్శన ఇచ్చాడు.

తన అనుభవం ముంబైకి పనికివస్తుంది. ఇక మరో ఇద్దరు లెఫ్టార్మ్‌ బౌలర్లను కూడా ముంబై కొనుగోలు చేసింది. కానీ బౌల్ట్‌ లేని లోటు వారు తీరుస్తారా అన్నదే ప్రశ్న’’ అని పేర్కొన్నాడు. కాగా జయదేవ్‌ ఉనద్కట్‌తో పాటు డానియల్‌ సామ్స్‌, టైమల్‌ మిల్స్‌ను ముంబై కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.  కాగా ఐపీఎల్‌-2022 సీజన్‌లో భాగంగా మార్చి 27న ఢిల్లీ క్యాపిటల్స్‌తో ముంబై ఇండియన్స్ తమ మొదటి మ్యాచ్‌ ఆడనుంది.

చదవండి: IPL 2022: మీకంత సీన్‌ లేదు.. అసలు ఆ పోలికేంటి? 16 కోట్లు పెట్టి ఆటగాడిని కొనేవాళ్లు ఉన్నారా?

మరిన్ని వార్తలు