Ravi Shastri: 'తమాషానా.. అలాంటి క్రికెటర్‌పై జీవితకాల నిషేధం విధించాలి'

9 Apr, 2022 18:07 IST|Sakshi

టీమిండియా ఆటగాడు.. రాజస్తాన్‌ రాయల్స్‌ స్టార్‌ బౌలర్‌ యజ్వేంద్ర చహల్‌ ఒక విదేశీ క్రికెటర్‌ నుంచి ఎదురైన చేదు అనుభవం గురించి ఇటీవలే పంచుకున్న సంగతి తెలిసిందే. జట్టు సహచర ఆటగాళ్లు రవిచంద్ర అశ్విన్‌, కరుణ్‌ నాయర్‌లకు తన జీవితంలో జరిగిన దుర్ఘటనను, అందులో నుంచి బయటపడిన తీరును చహల్‌ వివరించాడు. తాగిన మైకంలో సహచర క్రికెటర్‌ తనను 15వ అంతస్తు బాల్కనీ నుంచి కిందకు తోసేయబోయాడంటూ.. తృటిలో ప్రాణాలు కాపాడుకున్నాని చహల్‌ పేర్కొన్నాడు. దీనికి సంబంధించిన వీడియోనూ రాజస్తాన్‌ రాయల్స్‌ యాజమాన్యం ట్విటర్‌లో షేర్‌ చేయగా వైరల్‌గా మారింది. అయితే చహల్‌ ఆ క్రికెటర్‌ ఎవరన్నది మాత్రం రివీల్‌ చేయలేదు.

తాజాగా చహల్‌కు జరిగిన చేదు అనుభవంపై టీమిండియా మాజీ హెడ్‌కోచ్‌ రవిశాస్త్రి స్పందించాడు. ఇలాంటి పిచ్చి పని చేసిన ఆ క్రికెటర్‌ను జీవితకాలం నిషేధించడమే సరైనదని పేర్కొన్నాడు. ‘'ఈ ఘటనలో  దోషిని కఠినంగా శిక్షించాలి. మానసిక స్థితి సరిగా లేని వ్యక్తి అలా చేయడం ఆందోళనకరం. ఇది ఫన్నీ విషయం కానే కాదు. ఇలాంటి విషయం వినడం నాకైతే ఇదే మొదటిసారి.

ఈరోజు గనక అలాంటి ఘటన జరిగితే సదరు ఆటగాడిపై  జీవితకాలం నిషేధం విధించాలి. వీలైనంత త్వరగా ఆ వ్యక్తిని  మానసిక పునరావికాస కేంద్రానికి పంపించాలి.  సదరు ఆటగాడిని క్రికెట్ మైదానం దగ్గరికి రానివ్వకపోవడమే  మంచిది. ఇదే సమయంలో ఆటగాళ్లు ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు త్వరగా రిపోర్టు చేయాలి. ఇది తమాషా విషయం కాదు. అవినీతి నిరోధక శాఖకు అవినీతి అధికారుల గురించి చెప్పినట్టు.. ఇలాంటి మానసిక రోగుల గురించి కూడా తెలియజేయాలి.'’ అంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశాడు. 

కాగా ఇదంతా 2013లో చోటుచేసుకుంది. అప్పుడు యజ్వేంద్ర చాహల్ ముంబై జట్టులో ఉన్నాడు. చాహల్ ను తోసేయబోయింది విదేశీ ప్లేయర్ అని అతడు హింట్ ఇచ్చాడు. ఆ సమయంలో ముంబైలో  ఉన్న విదేశీ ఆటగాళ్లలో ఏడెన్ బ్లిజర్డ్, జేమ్స్ ఫ్రాంక్లిన్, కీరన్ పొలార్డ్, లసిత్ మలింగ, మిచెల్ జాన్సన్, డ్వేన్ స్మిత్ లు ఉన్నారు. మరి వీరిలో చాహల్ ను బాల్కనీ నుంచి తోసేయాలనుకున్నది ఎవరు అనేది ఆసక్తికరంగా మారింది.

చదవండి: Yuzvendra Chahal: ఆ క్రికెటర్‌ తాగిన మైకంలో నన్ను... చహల్‌ షాకింగ్‌ కామెంట్స్‌.. చచ్చేవాడిని!

>
మరిన్ని వార్తలు