Umran Malik: 'ఇలాగే ఉంటే 156.. 256 అవుతుంది'.. ఎస్‌ఆర్‌హెచ్‌ బౌలర్‌కు వార్నింగ్‌

9 May, 2022 11:20 IST|Sakshi
PC: IPL Twitter

టీమిండియా మాజీ హెడ్‌కోచ్‌ రవిశాస్త్రి ఎస్‌ఆర్‌హెచ్‌ సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ బౌలర్‌ ఉమ్రాన్‌ మాలిక్‌కు తనదైన శైలిలో హెచ్చరికలు పంపాడు. సీజన్‌ ఆరంభం నుంచి అత్యంత వేగవంతమైన బంతులు సంధించడంతో పాటు కీలక సమయంలో వికెట్లు పడగొడుతూ అందరి దృష్టిని ఆకర్షించాడు. ప్రతీ మ్యాచ్‌లోనూ గంటకు 150 కిమీ వేగంపైనే ఉమ్రాన్‌ బంతులు వేస్తున్నాడు. ఈ సీజన్‌లో అత్యంత వేగవంతమైన డెలవరీ ఉమ్రాన్‌ పేరిటే ఉంది.

ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో ఉమ్రాన్‌ ఒక బంతిని దాదాపు 157 కిమీ వేగంతో విసిరాడు. తాజాగా ఆర్‌సీబీతో మ్యాచ్‌లోనూ మరోసారి 156 కిమీ వేగంతో బంతులను సంధించాడు.  ఈ సీజన్‌లో ఏడుసార్లు అత్యంత ఫాస్ట్‌ డెలివరీ అవార్డును అందుకున్న ఉమ్రాన్‌ మాలిక్‌పై ప్రశంసలు కురిశాయి. రానున్న టి20 ప్రపంచకప్‌కు ఉమ్రాన్‌ను ఎంపిక చేయాలని.. బుమ్రాకు సరైన జోడి అంటూ పలువురు మాజీలు సహా ఫ్యాన్స్‌ అభిప్రాయం వ్యక్తం చేశారు.

అయితే గత మూడు మ్యాచ్‌ల నుంచి చూసుకుంటే ఉమ్రాన్‌ మాలిక్‌ బౌలింగ్‌ గాడి తప్పినట్లనిపిస్తుంది. వరుసగా మూడు మ్యాచ్‌లు(సీఎస్‌కేపై 4 ఓవర్లలో 48, ఢిల్లీ క్యాపిటల్స్‌పై 4 ఓవర్లలో 52, ఆర్సీబీపై 2 ఓవర్లలో 25) కలిపి 125 పరుగులు ఇవ్వడమేగాక ఒక్క వికెట్‌ కూడా తీయలేకపోయాడు.కాగా వరుసగా బౌలింగ్‌లో విఫలమవుతున్న ఉమ్రాన్‌పై రవిశాస్త్రి స్పందించాడు.

''ఉమ్రాన్‌ మాలిక్‌ బౌలింగ్‌ బాగుంది. ప్రతీ మ్యాచ్‌లో గంటకు 156, 157 కిమీవేగంతో బంతులు విసరడమనేది మాములు విషయం కాదు. అలా చేయాలంటే కచ్చితమైన ఫిట్‌నెస్‌ ఉండి తీరాల్సిందే. ఈ సీజన్‌ ఆరంభం నుంచి అతను మంచి లైన్‌ అండ్‌ లెంగ్త్‌తో పాటు గుడ్‌పేస్‌తో బౌలింగ్‌ కొనసాగిస్తున్నాడు. మనకు మరో భవిష్యత్తు ఆశాకిరణం కనిపిస్తు‍న్నాడని.. మంచి బౌలర్‌గా తయారవుతాడని అందరు మెచ్చుకున్నారు.

కానీ అదే ఉమ్రాన్‌ ఇప్పుడు వరుసగా మూడు మ్యాచ్‌ల్లో దారుణ ప్రదర్శన కనబరిచాడు. ఇలాగే ఉంటే 156 కచ్చితంగా 256 అవుతుంది.. దీనర్థం మిగతా మ్యాచ్‌ల్లోనూ అతను వికెట్లు తీయలేక ఎక్కువ పరుగులు ఇవ్వడమే. దీనిని ఉమ్రాన్‌ వీలైనంత తొందరగా కరెక్ట్‌ చేసుకోవాలి.. లేదంటే అతనికి భారీ నష్టమే మిగులుతుంది. మంచి స్పీడ్‌ ఒక్కటే కాదు.. లైన్‌ అండ్‌ లెంగ్త్‌ కూడా ముఖ్యమే.'' అంటూ చెప్పుకొచ్చాడు. 

ఇక ఈ సీజన్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ పరిస్థితి మళ్లీ మొదటికే వచ్చింది. ఆరంభంలో రెండు మ్యాచ్‌ల్లో ఓడినప్పటికి.. ఆ తర్వాత వరుసగా ఐదు విజయాలు నమోదు చేసి ఒక్కసారిగా రేసులోకి వచ్చింది. ఏడు మ్యాచ్‌లు పూర్తయ్యేసరికి టాప్‌-2లో ఉన్న ఎస్‌ఆర్‌హెచ్‌.. గుజరాత్‌తో మ్యాచ్‌లో ఓటమి చవిచూసింది. అక్కడి నుంచి మళ్లీ హ్యాట్రిక్‌ పరాజయాలు చూసిన ఎస్‌ఆర్‌హెచ్‌ మొత్తంగా 11 మ్యాచ్‌ల్లో ఐదు విజయాలు.. ఆరు పరాజయాలతో పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉంది. ఇక ప్లే ఆఫ్‌కు చేరాలంటే ఎస్‌ఆర్‌హెచ్‌ తన చివరి మూడు మ్యాచ్‌ల్లో కచ్చితంగా గెలవాల్సి ఉంటుంది.

చదవండి: IPL 2022: ధోని.. బ్యాట్‌ కొరకడం వెనుక అసలు కథ ఇదే!

SRH Vs RCB: కోహ్లి గోల్డెన్‌ డక్‌.. జగదీశ సుచిత్‌ అరుదైన రికార్డు!

మరిన్ని వార్తలు