IPL 2022: కోహ్లి దంచేశాడు.. అయినా సరే ఢిల్లీ క్యాపిటల్స్‌ ఓడితేనే

20 May, 2022 07:45 IST|Sakshi
PC: IPL Twitter

ముంబై: చాన్నాళ్ల తర్వాత విరాట్‌ కోహ్లి దంచేశాడు. మ్యాక్స్‌వెల్‌ ఆల్‌రౌండ్‌ మెరుపులు మెరిపించాడు. రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్సీబీ) తమ ఆఖరి మ్యాచ్‌లో ఘనవిజయం సాధించింది. రేసులో నిలిచింది. ఒక్క మ్యాచ్‌లో ఇన్ని సంతోషాలు వచ్చాయి కానీ... అసలైన ‘ప్లే ఆఫ్స్‌’ బెర్తు కోసం శనివారం దాకా ఆగాల్సిందే. ఢిల్లీ ఫలితంపై ఆర్సీబీ ముందుకో... ఇంటికో ఆధారపడివుంది. ముంబై చేతిలో క్యాపిటల్స్‌ ఓడితేనే బెంగళూరు ప్లేఆఫ్స్‌ చేరుతుంది. గురువారం జరిగిన ఐపీఎల్‌ మ్యాచ్‌లో ఆర్సీబీ 8 వికెట్ల తేడాతో గుజరాత్‌ టైటాన్స్‌పై జయభేరి మోగించింది.

తొలుత టైటాన్స్‌ 20 ఓవర్లలో 5 వికెట్లకు 168 పరుగులు చేసింది. కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా (47 బంతుల్లో 62 నాటౌట్‌; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), మిల్లర్‌ (25 బంతుల్లో 34; 3 సిక్సర్లు) రాణించారు. తర్వాత బెంగళూరు 18.4 ఓవర్లలో 2 వికెట్లే కోల్పోయి 170 పరుగులు చేసి గెలిచింది. కోహ్లి (54 బంతుల్లో 73; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు) పాత కోహ్లిలా చెలరేగాడు. డుప్లెసిస్‌ (38 బంతుల్లో 44; 5 ఫోర్లు) రాణించాడు. బౌలింగ్‌లో కీలకమైన వికెట్, అద్భుతమైన క్యాచ్‌ పట్టిన మ్యాక్స్‌వెల్‌ (18 బంతుల్లో 40 నాటౌట్‌; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) మెరుపు బ్యాటింగ్‌తో జట్టును చకచకా లక్ష్యానికి చేర్చాడు.  

చదవండి: Virat Kohli: కోహ్లి అరుదైన ఫీట్‌.. ఐపీఎల్‌ చరిత్రలో తొలి బ్యాటర్‌గా

మరిన్ని వార్తలు