IPL 2022 Playoffs: ప్లే ఆఫ్స్‌కు ఆర్సీబీ.. సన్‌రైజర్స్‌ రికార్డును తిరగరాసేనా..?

22 May, 2022 16:51 IST|Sakshi

ఐపీఎల్‌ 2022 సీజన్‌లో ఇతర జట్ల జయాపజాలపై ఆధారపడి అతికష్టం మీద ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించిన ఆర్సీబీ ఓ అరుదైన రికార్డును సాధించింది. క్యాష్‌ రిచ్‌ లీగ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ (11), ముంబై ఇండియన్స్‌ (9) తర్వాత అత్యధిక సార్లు (8) ప్లే ఆఫ్స్‌కు చేరిన మూడో జట్టుగా రికార్డుల్లో నిలిచింది. 

సీఎస్‌కే 2008 నుంచి 2015 వరకు వరుసగా 8 సీజన్లు, ఆతర్వాత 2018, 2019, 2021 సీజన్లలో ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించగా.. ముంబై 2010-2015 వరకు వరుసగా ఆరు సీజన్లు, ఆతర్వాత 2017, 2018, 2021 సీజన్లలో ప్లే ఆఫ్స్‌కు చేరుకుంది. ఆర్సీబీ.. 2009-2011 వరకు వరుసగా 3 సీజన్లు, ఆతర్వాత 2015, 2016 సీజన్లు, తిరిగి 2020-2022 వరుసగా మూడు సీజన్లలో ప్లే ఆఫ్స్‌కు చేరుకంది. 

ఐపీఎల్‌లో ఆర్సీబీతో సమానంగా సన్‌రైజర్స్‌ కూడా 8 సార్లు ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించింది. అయితే, ప్రస్తుత సీజన్‌లో ఆర్సీబీ మినహా మిగిలిన మూడు జట్లు లీగ్‌ దశలోనే నిష్క్రమించాయి. కాగా, ఐపీఎల్‌ 2022 సీజన్‌లో నాలుగో జట్టుగా ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించిన ఆర్సీబీ.. ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో మూడో స్థానంలో ఉన్న లక్నో సూపర్ జెయింట్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తే, ఆతర్వాత రెండో క్వాలిఫైయర్‌, చివరిగా ఫైనల్స్‌కు చేరుకుంటుంది. 

అయితే లీగ్‌ చరిత్రలో ఎలిమినేటర్ మ్యాచ్ ఆడిన జట్లు, టైటిల్ నెగ్గడం ఒకే ఒక్కసారి జరిగింది. 2016 సీజన్‌లో లీగ్ స్టేజ్‌లో మూడో స్థానంలో నిలిచిన సన్‌రైజర్స్, ఎలిమినేటర్‌లో కేకేఆర్‌ని, రెండో క్వాలిఫైయర్‌లో గుజరాత్ లయన్స్‌ని ఓడించి ఫైనల్ చేరింది. అనంతరం ఫైనల్‌లో ఆర్సీబీని మట్టికరిపించి టైటిల్‌ను సాధించింది. 

ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ మినహా ఎలిమినేటర్‌ మ్యాచ్‌లు ఆడిన మిగిలిన జట్లన్నీ రన్నరప్‌ లేదా మూడు, నాలుగు స్థానాలతో సరిపెట్టుకున్నాయి. అయితే ఇప్పుడు ఆర్సీబీ ఇదే రికార్డును తిరగరాయాలని కంకణం కట్టుకుంది. 8 సార్లు ఫ్లేఆఫ్స్ ఆడిన ఆర్సీబీ.. 2009, 2011, 2016 సీజన్లలో ఫైనల్‌కి దూసుకెళ్లినప్పటికీ డెక్కన్ ఛార్జర్స్, చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతుల్లో ఓడి రన్నరప్‌తో సరిపెట్టుకుంది.
చదవండి: టిమ్‌ డేవిడ్‌పై ప్రేమను ఒలకబోస్తున్న ఆర్సీబీ.. వీ లవ్‌ యు అంటూ..!

మరిన్ని వార్తలు