RCB Vs GT: టైటాన్స్‌తో మ్యాచ్‌.. గుజరాత్‌ ప్రజల మద్దతు మాత్రం నాకే: ఆర్సీబీ బౌలర్‌

30 Apr, 2022 13:16 IST|Sakshi
హర్షల్‌ పటేల్‌(PC: IPL/BCCI)

IPL 2022 RCB Vs GT: ఐపీఎల్‌-2022లో భాగంగా టైటాన్స్‌తో మ్యాచ్‌లో గుజరాత్‌ ప్రజలు తనకు మద్దతుగా నిలుస్తారని రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు(ఆర్సీబీ) బౌలర్‌ హర్షల్‌ పటేల్‌ ఆశాభావం వ్యక్తం చేశాడు. ముంబైలోని బ్రబౌర్న్‌ స్టేడియంలో జరిగే పోరులో సొంతవాళ్లు తనకు అండగా నిలబడతారని పేర్కొన్నాడు. కాగా గుజరాత్‌లోని సనంద్‌లో పుట్టిపెరిగిన ఈ రైట్‌ ఆర్మ్‌ పేసర్‌.. దేశవాళీ క్రికెట్‌లో మాత్రం హర్యానాకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.

ఇక 2012లో ఆర్సీబీ తరఫున ఐపీఎల్‌లో ఎంట్రీ ఇచ్చి అంచెలంచెలుగా ఎదిగాడు. టీమిండియాలో చోటు దక్కించుకున్నాడు. ఇక గత సీజన్‌లో ఆర్సీబీకి ప్రాతినిథ్యం వహించిన హర్షల్‌ పటేల్‌.. అత్యధిక వికెట్లు(32) తీసిన బౌలర్‌గా నిలిచి పర్పుల్‌ క్యాప్‌ సొంతం చేసుకున్నాడు. 

ఈ క్రమంలో మెగా వేలం-2022లో ఆ జట్టు 10.75 కోట్ల రూపాయలు వెచ్చించి అతడిని కొనుగోలు చేసింది. కాగా ఇప్పటి వరకు ఆడిన 8 మ్యాచ్‌లలో హర్షల్‌ 10 వికెట్లు కూల్చాడు. ఇదే జోష్‌లో గుజరాత్‌ టైటాన్స్‌తో శనివారం నాటి(ఏప్రిల్‌ 30) మ్యాచ్‌కు సన్నద్ధమవుతున్నాడు.

ఈ నేపథ్యంలో ఆర్సీబీ సోషల్‌ మీడియాతో ముచ్చటిస్తూ ఆసక్తిర వ్యాఖ్యలు చేశాడు. ‘‘గుజరాత్‌ ప్రజలు నన్ను సపోర్టు చేస్తారని అనుకుంటున్నా. ఏదేమైనా.. ఎవరేం అనుకున్నా.. మ్యాచ్‌ గెలవాలనే మేము కోరుకుంటాం. జట్టు ప్రయోజనాల దృష్ట్యా విజయం సాధించేందుకు కృషి చేస్తాం’’ అని ఈ ఆర్సీబీ ప్లేయర్‌ చెప్పుకొచ్చాడు.

కాగా టీమిండియా ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా సారథ్యంలోని గుజరాత్‌ టైటాన్స్‌ ఇప్పటికే ఎనిమిదింట ఏడు విజయాలు సాధించి 14 పాయింట్లతో టాప్‌లో ఉన్న విషయం తెలిసిందే. ఈ విషయంపై హర్షల్‌ పటేల్‌ స్పందిస్తూ.. ‘‘గుజరాత్‌ బలమైన ప్రత్యర్థి. ఆ జట్టులోని ఆటగాళ్లంతా మంచి ఫామ్‌లో ఉన్నారు.

ఆ జట్టుతో పోరు మాకు నిజంగా సవాలే. అయితే, ఈ సవాలును ఎదుర్కొనేందుకు మేము అన్ని రకాలుగా సిద్ధమయ్యాం. ఎవరిని ఎలా ఎదుర్కోవాలో ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాం. మైదానంలో వాటిని అమలు చేస్తాం’’ అని పేర్కొన్నాడు. 

>
Poll
Loading...
మరిన్ని వార్తలు