IPL 2022 RCB Vs GT Prediction: నిలవాలంటే గెలవాలి.. అదీ భారీ తేడాతో..!

19 May, 2022 11:32 IST|Sakshi
Photo Courtesy: IPL

ఐపీఎల్‌ 2022 సీజన్‌లో ఇవాళ (మే 19) మరో డూ ఆర్‌ డై మ్యాచ్‌ జరుగనుంది. టేబుల్‌ టాపర్‌ అయిన గుజరాత్‌ టైటాన్స్‌ను ప్లే ఆఫ్స్‌పై గంపెడాశలు పెట్టుకున్న రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ఢీకొట్టనుంది. గుజరాత్‌ ఇదివరకే ప్లే ఆఫ్స్‌ బెర్తు ఖారారు చేసుకోగా, ఈ మ్యాచ్‌ ఫలితంపై ఆర్సీబీ అవకాశాలు ఆధారపడి ఉన్నాయి. ముంబైలోని వాంఖడే వేదికగా రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్‌ ప్రారంభంకానుంది.  

13 మ్యాచ్‌ల్లో 7 విజయాలతో పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉన్న ఆర్సీబీ ప్లే ఆఫ్స్‌కు చేరాలంటే ఈ మ్యాచ్‌లో తప్పనిసరిగా భారీ తేడాతో గెలవాల్సి ఉంది. ఇది జరిగి నాలుగో స్థానంలో ఉన్న ఢిల్లీ (13 మ్యాచ్‌ల్లో 7 విజయాలు) శనివారం (మే 21) ముంబై చేతిలో ఓడితే ఆర్సీబీ ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధిస్తుంది. మ్యాచ్‌ విషయానికొస్తే.. అరంగేట్రం సీజన్‌లోనే అదిరిపోయే విజయాలతో దూసుకుపోతున్న గుజరాత్‌ను ఓడించడం ఆర్సీబీకి అంత సులువు కాకపోవచ్చు. దీంతో ఈ మ్యాచ్‌ రసవత్తరంగా సాగడం ఖాయంగా తెలుస్తోంది.

ఒకవేళ గుజరాత్‌ ఈ మ్యాచ్‌ కోసం సీనియర్లకు రెస్ట్‌ ఇచ్చి రిజర్వ్‌ ఆటగాళ్లను బరిలోకి దించాలని భావిస్తే ఆర్సీబీ గెలుపుపై ఆశలు పెట్టుకోవచ్చు. అయితే గుజరాత్‌ ఆ ఆలోచనలో లేనట్టే కనిపిస్తుంది. ఈ మ్యాచ్‌లోనూ పూర్తి స్థాయి జట్టుతో బరిలోకి దిగి విజయం సాధించాలని గుజరాత్‌ సారధి హార్ధిక్‌ పట్టుదలగా ఉన్నాడు. ఆర్సీబీని తేలిగ్గా తీసుకుని ఈ మ్యాచ్‌లో లూజ్‌గా వదిలితే తదుపరి తమకే ఆపాయంగా పరిగణించవచ్చన్నది హార్ధిక్‌ భయం. అందుకే గత మ్యాచ్‌లో సీఎస్‌కేను మట్టికరిపించిన జట్టునే యధాతథంగా ఈ మ్యాచ్‌లోనూ కొనసాగించవచ్చు. 

సాహా, శుభ్‌మన్‌ గిల్‌ మంచి ఫామ్‌లో ఉండటం గుజరాత్‌కు కలిసొచ్చే విషయం. ఒకవేళ గుజరాత్‌ ఏదైనా మార్పు చేయాలని భావిస్తే మాథ్యూ వేడ్‌ను పక్కకు పెట్టి ఫెర్గూసన్‌ను ఆడించవచ్చు.

ఆర్సీబీ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో ఆ జట్టుకు విజయంతో పాటు మెరుగైన రన్‌రేట్ కూడా అవసరం కాబట్టి భారీ హిట్టర్లతో బరిలోకి దిగే అవకాశం ఉంది. పంజాబ్‌ కింగ్స్‌తో ఆడిన జట్టులో బలమైన హిట్టర్లు ఉన్నారు కాబట్టి దాదాపుగా ఆ జట్టునే కొనసాగించే అవకాశం ఉంది. విరాట్ కోహ్లి, డుప్లెసిస్, మ్యాక్స్‌వెల్‌, దినేశ్‌ కార్తీక్ చెలరేగితే మాత్రం ఆర్సీబీని ప్లే ఆఫ్స్‌కు చేరకుండా ఏ శక్తి ఆపలేదు. వీరికి దేశీ బ్యాటర్లు రజత్‌ పాటిదార్‌, మహిపాల్‌ లోమ్రార్‌లు కూడా తోడైతే గుజరాత్‌కు ప్లే ఆఫ్స్‌కు ముందు పరాభవం తప్పకపోవచ్చు. అయితే ప్రధాన బౌలర్లు జోష్‌ హేజిల్‌వుడ్‌, మహ్మద్‌ సిరాజ్‌ పేలవ ఫామ్‌ ఆర్సీబీని కలవరపెడుతుంది. 

తుది జట్లు (అంచనా)..
ఆర్సీబీ: విరాట్ కోహ్లి, డుప్లెసిస్(కెప్టెన్), రజత్ పటిదార్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, మహిపాల్ లోమ్రార్, షాబాజ్ అహ్మద్, దినేశ్ కార్తీక్(వికెట్‌ కీపర్), హర్షల్ పటేల్, వనిందు హసరంగ, మహ్మద్‌ సిరాజ్, జోష్ హేజిల్‌వుడ్

గుజరాత్: వృద్దిమాన్ సాహా(వికెట్‌ కీపర్), శుభ్‌మన్ గిల్, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), డేవిడ్‌ మిల్లర్‌, రాహుల్ తెవాటియా, లోకీ ఫెర్గూసన్‌, రషీద్ ఖాన్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, అల్జరీ జోసెఫ్, యష్ దయాల్, మహ్మద్‌ షమీ
చదవండి: IPL 2022: కోల్‘కథ’ ముగిసింది

మరిన్ని వార్తలు