RCB VS KKR: హెడ్‌ టు హెడ్‌ రికార్డ్స్‌ ఎలా ఉన్నాయంటే..?

30 Mar, 2022 13:42 IST|Sakshi
pic credit: FGN News

RCB VS KKR Head To Head Records: ఐపీఎల్‌ 2022 సీజన్‌లో ఇవాళ (మార్చి 30) మరో రసవత్తర పోరు జరుగనుంది. ముంబైలోని డీవై పాటిల్‌ స్టేడియంలో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్సీబీ), కోల్‌కతా నైట్‌రైడర్స్‌ జట్లు తలపడనున్నాయి. రాత్రి 7:30 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్‌లో పరుగుల వరద పారడం ఖాయమని తెలుస్తుంది. తొలి మ్యాచ్‌లో సీఎస్‌కేపై గ్రాండ్‌ విక్టరీతో కేకేఆర్‌ జోరుమీదుండగా.. భారీ స్కోర్‌ను కాపాడుకోలేక, పంజాబ్‌ చేతిలో చావుదెబ్బ తిన్న ఆర్సీబీ.. బోణీ విజయం కోసం ఆరాటపడుతుంది. 

హెడ్‌ టు హెడ్‌ రికార్డ్స్‌ విషయానికొస్తే.. క్యాష్‌ రిచ్‌ లీగ్‌లో ఇరు జట్లు 29 మ్యాచ్‌ల్లో తలపడగా కేకేఆర్‌ 16, ఆర్సీబీ 13 మ్యాచ్‌ల్లో విజయాలు నమోదు చేశాయి. ఇక గతేడాది జరిగిన 2 మ్యాచ్‌ల్లోనూ కేకేఆర్‌ ఘన విజయాలు సాధించి ఆర్సీబీపై ఆధిక్యం ప్రదర్శించింది. ఇరు జట్ల బలాబలాలను పరిశీలిస్తే.. ఆర్సీబీతో పోలిస్తే కేకేఆర్‌ బ్యాటింగ్‌, బౌలింగ్‌ విభాగాల్లో బలంగా ఉందనే చెప్పాలి. చెన్నైతో జరిగిన గత మ్యాచ్‌లో చిన్నచిన్న పోరపాట్లు మినహా కేకేఆర్‌ అన్ని విభాగాల్లో ప్రత్యర్ధిపై పైచేయి సాధించింది. 

కొత్త కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ తనకున్న వనరులను అద్భుతంగా వినియోగించుకోగా, సీనియర్‌ బ్యాటర్‌ రహానే తిరిగి ఫామ్‌లోకి రావడం కేకేఆర్‌కు శుభపరిణామమని చెప్పాలి. బ్యాటింగ్‌లో వెంకటేష్ అయ్యర్, నితీష్ రాణా, సామ్ బిల్లింగ్స్.. బౌలింగ్‌లో సునీల్ నరైన్, శివమ్ మావి, ఉమేష్ యాదవ్, వరుణ్ చక్రవర్తిలు మంచి టచ్‌లో ఉండటంతో ఆర్సీబీతో మ్యాచ్‌లోనూ కేకేఆర్‌కు తిరుగుండదని అంచనా.

ఇక ఆర్సీబీ విషయానికొస్తే.. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 205 పరుగుల భారీ స్కోర్ సాధించినప్పటికీ, దాన్ని కాపాడుకోలేక చేతులెత్తేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. కెప్టెన్ డుప్లెసిస్, విరాట్ కోహ్లి, దినేష్ కార్తీక్‌లు అద్భుతమైన టచ్‌లో ఉండటం కేకేఆర్‌తో మ్యాచ్‌కు ముందు ఆర్సీబీకి కలిసొచ్చే అంశం. తొలి మ్యాచ్‌లో కీలక బౌలర్లు  హర్షల్ పటేల్, మహమ్మద్ సిరాజ్, హసరంగ  దారాళంగా పరుగులు సమర్పించుకోవడం ఆర్సీబీని కలవరపెడుతుంది. మొత్తంగా చూస్తే.. ఆర్సీబీతో మ్యాచ్‌లో కేకేఆర్‌కే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పాలి. 

ఆర్సీబీ (అంచనా): డుప్లెసిస్(కెప్టెన్), అనూజ్ రావత్, విరాట్ కోహ్లి, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్, వనిందు హసరంగ, డేవిడ్ విల్లీ, హర్షల్ పటేల్, షాబాజ్ అహ్మద్, ఆకాష్ దీప్, మహ్మద్ సిరాజ్

కేకేఆర్‌ (అంచనా): వెంకటేష్ అయ్యర్, అజింక్య రహానే, నితీష్ రాణా, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), సామ్ బిల్లింగ్స్, ఆండ్రీ రస్సెల్, షెల్డన్ జాక్సన్ (వికెట్ కీపర్), సునీల్ నరైన్, శివమ్ మావి, ఉమేష్ యాదవ్, వరుణ్ చక్రవర్తి 
చదవండి: IPL: క్రిస్‌ గేల్‌ వచ్చేస్తున్నాడు..!

మరిన్ని వార్తలు