IPL 2022 RCB Vs SRH Records: ఆర్సీబీని ఢీకొట్టనున్న సన్‌రైజర్స్‌.. రికార్డులు ఎలా ఉన్నాయంటే..?

23 Apr, 2022 17:34 IST|Sakshi

RCB VS SRH: ఐపీఎల్‌ 2022 సీజన్లో ఇవాళ (ఏప్రిల్‌ 23) మరో రసవత్తర సమరం జరుగనుంది. రెండు వరుస ఓటముల అనంతరం నాలుగు విజయాలతో దూసుకుపోతున్న ఆరెంజ్‌ ఆర్మీ.. పట్టిష్టమైన ఆర్సీబీని ఢీకొట్టనుంది. ముంబైలోని బ్రబోర్న్‌ వేదికగా రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్‌ ప్రారంభంకానుంది. ప్రస్తుత సీజన్‌లో ఆర్సీబీ ఇప్పటివరకు ఆడిన 7 మ్యాచ్‌ల్లో 5 విజయాలతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతుండగా, సన్‌రైజర్స్‌.. 8 పాయింట్లతో ఐదో స్థానంలో నిలిచింది. గత మ్యాచ్‌ల్లో ప్రత్యర్ధులపై విజయం సాధించిన ఇరు జట్లు.. నేటి మ్యాచ్‌లోనూ గెలుపుపై ధీమాగా ఉన్నాయి.

సన్‌రైజర్స్‌ గత మ్యాచ్‌లో పంజాబ్‌ను 7 వికెట్ల తేడాతో చిత్తు చేయగా, ఆర్సీబీ.. లక్నోను 18 పరుగుల తేడాతో ఓడించింది. ఈ మ్యాచ్‌ కోసం ఇరు జట్లు ఎలాంటి మార్పులు చేయకపోవచ్చు. సన్‌రైజర్స్‌లో అభిషేక్‌ శర్మ, కేన్‌ విలియమ్సన్‌, రాహుల్‌ త్రిపాఠి, మార్క్రమ్‌, పూరన్‌, ఉమ్రాన్‌ మాలిక్‌, నటరాజన్‌, భువనేశ్వర్‌ కుమార్‌ సూపర్‌ ఫామ్‌లో ఉండగా.. ఆర్సీబీలో కోహ్లి మినహాయించి మిగతా ప్లేయర్లంతా మంచి టచ్‌లో ఉన్నారు. పంజాబ్‌తో మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ స్పీడ్‌స్టర్‌ ఉమ్రాన్‌ మాలిక్‌ భీకరమైన పేస్‌తో నిప్పులు చెరిగి ఆఖరి ఓవర్‌లో పరుగులేమీ ఇవ్వకుండా 3 వికెట్లు పడగొట్టగా, లక్నోపై డుప్లెసిస్‌ 96 పరుగులు సాధించి తృటిలో సెంచరీ మిస్‌ అయ్యాడు.

ఇదే మ్యాచ్‌లో హేజిల్‌వుడ్‌ (4/25) కూడా సత్తా చాటాడు. సన్‌నైజర్స్‌తో పోలిస్తే ఆర్సీబీ అన్ని విభాగాల్లో బలంగా కనిపిస్తున్నప్పటికీ.. వరుస విజయాలతో దూసుకుపోతున్న ఆరెంజ్‌ ఆర్మీని ఏమాత్రం తక్కువ అంచనా వేయడానికి వీలు లేదు. ఆ జట్టు సమిష్టిగా రాణిస్తూ విజయాలు సాధిస్తుంది. ఆర్సీబీ గెలిచిన ప్రతి మ్యాచ్‌లో ఎవరో ఒకరిపైనే ఆధారపడుతూ వస్తుంది. ఇక, హెడ్‌ టు హెడ్‌ రికార్డ్‌ విషయానికొస్తే.. ఇరు జట్లు ఇప్పటివరకు 20 సందర్భాల్లో ఎదురెదురుపడగా సన్‌నైజర్స్‌ 11, ఆర్సీబీ 8 మ్యాచ్‌ల్లో విజయాలు సాధించాయి. ఓ మ్యాచ్‌లో ఫలితం రాలేదు. 

తుది జట్లు (అంచనా):

రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు: డుప్లెసిస్‌, అనుజ్‌రావత్‌, విరాట్‌ కోహ్లి, మ్యాక్స్‌వెల్‌, సుయాశ్‌ ప్రభుదేశాయ్‌, షాబాజ్‌ అహ్మద్‌, దినేశ్‌ కార్తీక్‌, హర్షల్‌ పటేల్‌, హసరంగ, హేజిల్‌వుడ్‌, సిరాజ్‌

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌: అభిషేక్‌ శర్మ, కేన్‌ విలియమ్సన్‌, రాహుల్‌ త్రిపాఠి, మార్క్రమ్‌, పూరన్‌, శశాంక్‌ సింగ్‌, జగదీష సుచిత్‌, భువనేశ్వర్‌ కుమార్‌, జన్సెన్‌, ఉమ్రాన్‌ మాలిక్‌, నటరాజన్‌
చదవండి: ధోనికో లెక్క.. పంత్‌కో లెక్కా..? నో బాల్‌ వివాదంలో ఆసక్తికర చర్చ

మరిన్ని వార్తలు