Rishi Dhawan: ఫేస్‌గార్డ్‌తో పంజాబ్‌ కింగ్స్‌ ఆల్‌రౌండర్‌.. అసలు కథ ఇదే!

26 Apr, 2022 09:12 IST|Sakshi
Courtesy: IPL Twitter

పంజాబ్‌ కింగ్స్‌ ఆల్‌రౌండర్‌ రిషి ధవన్‌ ఐదేళ్ల తర్వాత ఐపీఎల్‌లో రీఎంట్రీ ఇచ్చాడు. సీఎస్‌కేతో జరిగిన మ్యాచ్‌లో రిషి ధవన్‌ బౌలింగ్‌లో 4 ఓవర్లు వేసి 39 పరుగులిచ్చి రెండు కీలక వికెట్లు పడగొట్టాడు. ఐదేళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇచ్చి తొలి మ్యాచ్‌లోనే తన బౌలింగ్‌తో ఆకట్టుకునే ప్రదర్శన ఇచ్చిన అతను మ్యాచ్‌ విజయంలోనూ కీలకపాత్ర పోషించాడు. కాగా మ్యాచ్‌లో రిషి ధావన్‌ ఫేస్‌గార్డ్‌ పెట్టుకొని బౌలింగ్‌ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఫేస్‌గార్డ్‌ వెనుక ఉన్న కథను రిషి ధవన్‌ మ్యాచ్‌ అనంతరం రివీల్‌ చేశాడు.

కాగా ఐపీఎల్‌ 2022కు ముందు జరిగిన రంజీ ట్రోఫీలో రిషి ధవన్‌ రెండో రౌండ్‌ మ్యాచ్‌ల్లో బౌలింగ్‌ చేస్తూ గాయపడ్డాడు. బ్యాట్స్‌మన్‌ కొట్టిన షాట్‌కు రిషి ధవన్‌ ముక్కు పగిలి రక్తం బయటికి వచ్చింది. దీంతో ముక్కుకు సర్జరీ చేయించుకున్న అతను ఐపీఎల్‌ 15వ సీజన్‌లో ఆరంభ మ్యాచ్‌లకు దూరమయ్యాడు. ఇక సీఎస్‌కేతో మ్యాచ్‌కు బరిలోకి దిగిన రిషి ధవన్‌ ఫేస్‌గార్డ్‌ పెట్టుకొని బౌలింగ్‌ దిగాడు.

''దాదాపు ఐదేళ్ల తర్వాత ఐపీఎల్‌లో రీఎంట్రీ  ఇస్తున్నా. ఒక రకంగా ఇన్నేళ్లు ఐపీఎల్‌కు దూరమయ్యాననే బాధ ఉండేది. కానీ రంజీ ట్రోఫీలో గాయపడిన నేను ముక్కుకు సర్జరీ చేయించుకున్నా. ప్రమాదం ఎటువైపు నుంచి వస్తుందో ఎవరు చెప్పలేరు. రిస్క్‌ తీసుకోవడం ఎందుకని సీఎస్‌కేతో మ్యాచ్‌లో ఫేస్‌గార్డ్‌తో బరిలోకి దిగా. ఐదేళ్ల తర్వాత ఆడుతున్న తొలి మ్యాచ్‌లోనే ధోని వికెట్‌ పడగొట్టడం సంతోషమనిపించింది. ఓవరాల్‌గా నా ప్రదర్శన పట్ల సంతృప్తిగా ఉన్నానంటూ'' చెప్పుకొచ్చాడు.

ఇక గతేడాది డిసెంబర్‌లో జరిగిన విజయ్‌ హజారే ట్రోఫీలో హిమాచల్‌ ప్రదేశ్‌ తొలి టైటిల్‌ గెలవడంలో రిషి ధవన్‌ పాత్ర కీలకం. కెప్టెన్‌గా, ఆల్‌రౌండర్‌గా సూపర్‌ ప్రదర్శన కనబరిచాడు. ఈ ప్రదర్శనే అతన్ని ఐపీఎల్‌ మెగావేలంలో పంజాబ్‌ కింగ్స్‌ రూ.55 లక్షలకు దక్కించుకునేలా చేసింది.

చదవండి: Rishi Dhawan: ఐదేళ్ల తర్వాత రీ ఎంట్రీ.. అయితేనేం అదరగొట్టాడు

మరిన్ని వార్తలు