Rishabh Pant: ఓటమికి పంత్‌ను నిందించాల్సిన అవసరం లేదు.. మా కొంప ముంచింది అదే: పాంటింగ్‌

22 May, 2022 13:28 IST|Sakshi
రిషభ్‌ పంత్‌కు మద్దతుగా నిలిచిన పాంటింగ్‌(PC: IPL/BCCI)

IPL 2022 DC Vs MI- Ricky Ponting Comments: ‘‘ఢిల్లీ క్యాపిటల్స్‌కు కెప్టెన్‌గా రిషభ్‌ పంత్‌ సరైన ఛాయిస్‌ అనడంలో నాకు ఏమాత్రం సందేహం లేదు. గత సీజన్‌లో.. ఇప్పుడు కూడా తను తన బాధ్యతను సక్రమంగా నెరవేర్చాడు. శ్రేయస్‌ అయ్యర్‌ గాయపడిన నేపథ్యంలో అతడి నుంచి సారథ్య బాధ్యతలు చేపట్టిన తర్వాత పంత్‌ అద్భుతంగా రాణిస్తూ జట్టును ముందుకు నడిపిస్తున్నాడు’’ అని ఢిల్లీ క్యాపిటల్స్‌ హెడ్‌కోచ్‌ రిక్కీ పాంటింగ్‌ తమ కెప్టెన్‌ రిషభ్‌ పంత్‌కు మద్దతుగా నిలిచాడు.

పంత్‌ ఇంకా చిన్నవాడని, అయినప్పటికీ ఐపీఎల్‌ లాంటి ప్రఖ్యాత లీగ్‌లో ఒత్తిడిని అధిగమిస్తూ ముందుకు సాగుతున్న తీరు అమోఘమని కొనియాడాడు. చిన్న చిన్న తప్పిదాలు చేయడం సహజమని, తను ఇంకా నేర్చుకునే దశలోనే ఉన్నాడని అండగా నిలబడ్డాడు. ప్లే ఆఫ్స్ బెర్తును ఖరారు చేసుకోవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌.. ముంబై ఇండియన్స్‌ చేతిలో ఓడిన సంగతి తెలిసిందే.

చివరి ఓవర్‌ వరకు ఉత్కంఠ రేపిన ఈ మ్యాచ్‌లో సింపుల్‌ క్యాచ్‌ వదిలేయడం సహా ముంబై ఆటగాడు టిమ్‌ డేవిడ్‌ విషయంలో రివ్యూకు వెళ్లకుండా పంత్‌ చేసిన తప్పిదాల వల్ల భారీ మూల్యమే చెల్లించాల్సి వచ్చింది. దీంతో అతడిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో మ్యాచ్‌ అనంతరం రిక్కీ పాంటింగ్‌ మాట్లాడుతూ.. పంత్‌ను వెనకేసుకొచ్చాడు.

‘‘పంత్‌ ఇంకా చిన్న పిల్లవాడు.. కెప్టెన్‌గా నేర్చుకునే దశలోనే ఉన్నాడు. ముఖ్యంగా టీ20 జట్టు సారథిగా.. అది కూడా ఐపీఎల్‌ లాంటి ప్రధాన లీగ్‌లో ఒత్తిడిని తట్టుకోవడం మామూలు విషయం కాదు. ప్రతి విషయాన్ని భూతద్దంలో పెట్టి చూస్తారు. అయితే గెలుపోటములు సహజమే’’ అంటూ ఢిల్లీ ఓటమికి పంత్‌ను నిందించాల్సిన అవసరం లేదంటూ పంత్‌కు పాంటింగ్‌కు మద్దతునిచ్చాడు.

ఇక ముంబైతో మ్యాచ్‌లో తమకు శుభారంభం లభించలేదన్న పాంటింగ్‌.. టాపార్డర్‌ విఫలమైందని అసంతృప్తి వ్యక్తం చేశాడు. 40 పరుగులకే నాలుగు వికెట్లు పడ్డాయని, టీ20 ఫార్మాట్‌లో భారీ స్కోరు చేయాలంటే ఇలా జరగడం ఆమోదయోగ్యం కాదన్నాడు. అదే విధంగా ముంబై ప్లేయర్‌ టిమ్‌ డేవిడ్‌ బాగా ఆడాడని, ఓటమి నుంచి తాము పాఠాలు నేర్చుకోవాల్సిన ఆవశ్యకత ఉందని పేర్కొన్నాడు. కాగా ఢిల్లీ ఓటమితో ఆర్సీబీ వరుసగా మూడోసారి ప్లే ఆఫ్స్‌ చేరింది.

ఐపీఎల్‌ మ్యాచ్‌: 69- ఢిల్లీ క్యాపిటల్స్‌ వర్సెస్‌ ముంబై ఇండియన్స్‌
టాస్‌: ముంబై- తొలుత బౌలింగ్‌
ఢిల్లీ స్కోరు: 159/7 (20)
ముంబై స్కోరు: 160/5 (19.1)
విజేత: ముంబై.. ఐదు వికెట్ల తేడాతో గెలుపు
ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌: జస్‌ప్రీత్‌ బుమ్రా(4 ఓవర్లలో 25 పరుగులు ఇచ్చి 3 వికెట్లు)

చదవండి👉🏾Rishabh Pant: ఒత్తిడి సమస్యే కాదు.. మా ఓటమికి కారణం అదే.. ఇకనైనా: పంత్‌ అసంతృప్తి!
చదవండి👉🏾IPL 2022 DC VS MI: టిమ్‌ డేవిడ్‌కు గిఫ్ట్‌ పంపిన ఆర్సీబీ కెప్టెన్‌..!

Poll
Loading...
మరిన్ని వార్తలు