Rishabh Pant: అలా చేయడం తప్పే.. కానీ మేము నష్టపోయాం.. థర్డ్‌ అంపైర్‌ జోక్యం చేసుకోవాల్సింది: పంత్‌

23 Apr, 2022 08:49 IST|Sakshi
పంత్‌- పావెల్‌(PC: IPL/Disney+hotstar)

IPL 2022 DC Vs RR: Rishabh Pant On No Ball Decision- ‘‘మ్యాచ్‌ ఆసాంతం వాళ్లు(రాజస్తాన్‌ రాయల్స్‌) బాగా బౌల్‌ చేశారు. కానీ చివర్లో పావెల్‌ మాకు ఆశలు కల్పించాడు. నిజానికి ఆ ‘నో-బాల్‌’ అనేది మాకు ఆ సమయంలో అత్యంత విలువైనది. కానీ నా చేతిలో ఏం లేదు కదా! ఈ విషయంలో మేము నిజంగా పూర్తి నిరాశకు లోనయ్యాం’’ అని ఢిల్లీ క్యాపిటల్స్‌ కెప్టెన్‌ రిషభ్‌ పంత్‌ అన్నాడు. కాగా ఐపీఎల్‌-2022లో భాగంగా శుక్రవారం రాజస్తాన్‌ రాయల్స్‌తో ఢిల్లీ తలపడిన సంగతి తెలిసిందే.

హోరాహోరీగా సాగిన ఈ హై స్కోరింగ్‌ మ్యాచ్‌లో చివరి ఓవర్లో ఢిల్లీ విజయానికి 36 పరుగులు అవసరమైన వేళ రాజస్తాన్‌ తమ బౌలర్‌ మెక్‌కాయ్‌ను రంగంలోకి దించింది. ఈ క్రమంలో.. తొలి 3 బంతుల్లో ఢిల్లీ బ్యాటర్‌ రోవ్‌మన్‌ పావెల్‌ సిక్సర్లు బాదాడు. అయితే, ఫుల్‌టాస్‌గా వచ్చిన మూడో బంతి నో- బాల్‌గా అనిపించడంతో హైడ్రామా చోటు చేసుకున్న విషయం తెలిసిందే.

అంపైర్‌ నో- బాల్‌ అంశాన్ని పరిగణనలోకి తీసుకోలేదంటూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన  ఢిల్లీ కెప్టెన్‌ పంత్‌ క్రీజులో ఉన్న తమ ఆటగాళ్లు పావెల్‌, కుల్దీప్‌ యాదవ్‌లను వెనక్కిపిలిచాడు. అంతేకాదు ఢిల్లీ అసిస్టెంట్‌ కోచ్‌ ఆమ్రే సైతం మైదానంలోకి వెళ్లాడు. కానీ అంపైర్‌ మాత్రం తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. మెక్‌కాయ్‌ వేసిన ఆ ఫుల్‌టాస్‌ను నో- బాల్‌గా ప్రకటించలేదు.

ఈ ఘటనపై స్పందించిన పంత్‌ మ్యాచ్‌ అనంతరం మాట్లాడుతూ.. అంపైర్‌ తీరుపై అసహనం వ్యక్తం చేశాడు. ‘‘ఆ బాల్‌ విషయంలో డగౌట్‌లో ఉన్న ప్రతి ఒక్కరు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. గ్రౌండ్‌లో ఉన్న ప్రతిఒక్కరు అక్కడ ఏం జరిగిందనేది స్పష్టంగా చూశారు. నిజానికి థర్డ్‌ అంపైర్‌ ఈ విషయంలో జోక్యం చేసుకుని.. దానిని నో- బాల్‌గా ప్రకటించాల్సింది’’ అని పేర్కొన్నాడు.

అయితే, అదే సమయంలో ఆమ్రేను మైదానంలోకి పంపిన తన నిర్ణయం పట్ల పంత్‌ విచారం వ్యక్తం చేశాడు. కానీ తమ విషయంలో జరిగింది కూడా ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని తనను తాను సమర్థించుకునే ప్రయత్నం చేశాడు. ఇరు వైపులా తప్పు ఉందని, ప్రత్యర్థి 200కు పైగా స్కోరు చేసినపుడు.. దానిని ఛేదించే క్రమంలో టార్గెట్‌ చేరుకుంటామన్న సమయంలో ఇలా జరగడం అసహనానికి దారి తీసిందన్నాడు. అంతేగాక.. ఈ సీజన్లో అంపైరింగ్‌ ఎంత బాగుంటుందో చూస్తూనే ఉన్నాం కదా అంటూ అంపైర్లపై సెటైర్లు వేశాడు.

ఇక మ్యాచ్‌ ఆరంభంలో తాము ఇంకాస్త మెరుగ్గా బౌలింగ్‌ చేస్తే బాగుండేదని పంత్‌ అభిప్రాయపడ్డాడు. ఏదేమైఆ ఆఖరి వరకు పోరాట పటిమ కనబరిచిన తమ జట్టు సభ్యులను అభినందించిన పంత్‌.. తలెత్తుకునే ఉండాలని, తదుపరి మ్యాచ్‌కు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చాడు. ఇక ఈ మ్యాచ్‌లో పంత్‌ సేన 15 పరుగుల తేడాతో ఓటమి పాలైన సంగతి తెలిసిందే.

ఐపీఎల్‌ -2022 మ్యాచ్‌ 34: ఢిల్లీ క్యాపిటల్స్‌ వర్సెస్‌ రాజస్తాన్‌ రాయల్స్‌ స్కోర్లు:
రాజస్తాన్‌-222/2 (20)
ఢిల్లీ- 207/8 (20)

చదవండి👉🏾Rishabh Pant: హైడ్రామా.. పంత్‌ తీవ్ర అసహనం.. బ్యాటర్లను వెనక్కి వచ్చేయమంటూ..
IPL 2022 DC Vs RR: బట్లర్‌ ‘తీన్‌’మార్‌...

Poll
Loading...
మరిన్ని వార్తలు