Rishi Dhawan: ఐదేళ్ల తర్వాత రీ ఎంట్రీ.. అయితేనేం అదరగొట్టాడు

26 Apr, 2022 08:43 IST|Sakshi
Courtesy: IPL Twitter

సీఎస్‌కేతో జరిగిన ఉత్కంఠ పోరులో పంజాబ్‌ కింగ్స్‌ 11 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇక మ్యాచ్‌ విజయంలో​ శిఖర్‌ ధావన్‌ కీలకపాత్ర పోషించాడని అనుకుంటున్నాం. కానీ మనకు కనబడని మరో వ్యక్తి కూడా గెలుపులో బాగమయ్యాడు. అతనే పంజాబ్‌ కింగ్స్‌ బౌలర్‌ రిషి ధవన్‌. ఐదేళ్ల తర్వాత ఐపీఎల్‌లో రీఎంట్రీ ఇచ్చిన అతను తొలి మ్యాచ్‌లోనే అదరగొట్టాడు. 2016లో రిషి ధవన్‌ ఆఖరిసారి పంజాబ్‌ కింగ్స్‌ తరపునే ఐపీఎల్‌ ఆడడం విశేషం.

ముందు సూపర్‌ ఫామ్‌లో ఉన్న శివమ్‌ ధూబేను కీలక సమయంలో వెనక్కి పంపిన రిషి ధవన్‌.. దాదాపు ఐదేళ్ల తర్వాత తొలి వికెట్‌ సాధించాడు. . ముఖ్యంగా ఆఖరి ఓవర్లో సీఎస్‌కేకు 27 పరుగులు అవసరమైన దశలో సూపర్‌ బౌలింగ్‌ చేశాడు. ముంబైతో మ్యాచ్‌లో ఫినిషర్‌ పాత్రతో అదరగొట్టిన ధోనిని తెలివైన బంతితో బోల్తా కొట్టించి సీఎస్‌కేను విజయానికి దూరం చేశాడు. ఓవరాల్‌గా ఆఖరి ఓవర్‌లో 16 పరుగులు మాత్రమే ఇచ్చి పంజాబ్‌ను గెలిపించాడు. బ్యాటింగ్‌ శిఖర్‌ ధావన్‌(88*పరుగులు) సాధించగా.. బౌలింగ్‌లో రిషి ధవన్‌ 4 ఓవర్లలో 39 పరుగులిచ్చి రెండు కీలక వికెట్లు తీశాడు. ఇక మ్యాచ్‌లో రిషి ధవన్‌ ఫేస్‌గార్డ్‌ పెట్టుకొని బౌలింగ్‌ చేయడం చర్చనీయాంశంగా మారింది.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే..188 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సీఎస్‌కే నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 176 పరుగులు మాత్రమే చేయగలిగింది. రాయుడు 78 పరుగుల వీరోచిత పోరాటం సరిపోలేదు. తద్వారా సీఎస్‌కే సీజన్‌లో ఆరో ఓటమిని మూటగట్టుకుంది. పంజాబ్‌ కింగ్స్‌ 8 మ్యాచ్‌ల్లో నాలుగు విజయాలు, నాలుగు ఓటములతో పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉంది.

చదవండి: Ravindra Jadeja: 'మా కెప్టెన్‌ బౌలింగ్‌, బ్యాటింగ్‌, ఫీల్డింగ్‌ చేయలేడు..'

మరిన్ని వార్తలు