మళ్లీ హైదరా‘బాధ’

9 May, 2022 05:49 IST|Sakshi

సన్‌రైజర్స్‌కు వరుసగా నాలుగో ఓటమి

67 పరుగులతో గెలిచిన బెంగళూరు

మెరిపించిన డుప్లెసిస్‌ హసరంగకు ఐదు వికెట్లు

ముంబై: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ప్లే ఆఫ్స్‌ ఆశలు సంక్లిష్టమయ్యాయి. మిగిలున్న మ్యాచ్‌లు గెలవాల్సిన దశలో సన్‌రైజర్స్‌ చేతులెత్తేసింది. బ్యాటింగ్‌ లో జోరు, బౌలింగ్‌లో పదును కనబరిచిన రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ) 67 పరుగుల తేడాతో జయభేరి మోగించి ఏడో విజయంతో ప్లే ఆఫ్స్‌ రేసులో పడింది. మొదట ఆర్‌సీబీ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది.

కెప్టెన్‌ డుప్లెసిస్‌ (50 బంతుల్లో 73 నాటౌట్‌; 8 ఫోర్లు, 2 సిక్సర్లు), రజత్‌ పటిదార్‌ (38 బంతుల్లో 48; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. దినేశ్‌ కార్తీక్‌ (8 బంతుల్లో 30 నాటౌట్‌; 1 ఫోర్, 4 సిక్సర్లు) దంచేశాడు. తర్వాత హైదరాబాద్‌ 19.2 ఓవర్లలో 125 పరుగులకే ఆలౌటై వరుసగా నాలుగో ఓటమిని చవిచూసింది. రాహుల్‌ త్రిపాఠి (37 బంతుల్లో 58; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) పోరాడగా... ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ హసరంగ (5/18) తన స్పిన్‌తో హైదరాబాద్‌ను దెబ్బ తీశాడు.  

ధాటిగా నడిపించిన డుప్లెసిస్‌
బెంగళూరు స్టార్‌ కోహ్లి (0) ఆడిన తొలి బంతికే అవుటయ్యాడు. రైజర్స్‌కు ఈ ఆనందం అంతలోనే ఆవిరైంది. మళ్లీ 12.1 ఓవర్ల దాకా ఆర్‌సీబీ వికెట్టే కోల్పోలేదు. కెప్టెన్‌ డుప్లెసిస్,  పటిదార్‌ ఇన్నింగ్స్‌ ను ధాటిగా నడిపించారు. దీంతో 11.4 ఓవర్లలో జట్టు స్కోరు వంద దాటింది. డుప్లెసిస్, పటిదార్‌ రెండో వికెట్‌కు 105 పరుగులు జోడించారు. తర్వాత మ్యాక్స్‌వెల్‌ (24 బంతుల్లో 33; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) కూడా ధాటిగా ఆడగా.. ఫజల్‌హఖ్‌ ఫారూఖి ఆఖరి ఓవర్లో దినేశ్‌ కార్తీక్‌ 6, 6, 6, 4 బాదడంతో మొత్తం 25 పరుగులొచ్చాయి.

ఓపెనర్లిద్దరూ 0, 0
హైదరాబాద్‌ బ్యాటింగ్‌ ఓపెనర్ల డకౌట్లతో మొదలైంది. మ్యాక్స్‌వెల్‌ తొలి ఓవర్‌లో బంతి కూడా ఆడని విలియమ్సన్‌ (0) షహబాజ్‌ డైరెక్ట్‌ త్రోకు రనౌటై ‘డైమండ్‌ డక్‌’ అయ్యాడు. ఐదో బంతికి అభిషేక్‌ శర్మ (0) క్లీన్‌ బౌల్డయ్యాడు. కష్టాల్లో పడిన సన్‌రైజర్స్‌ సగం ఓవర్లు ముగిసేసరికి లక్ష్యాన్ని చేరుకోలేనంత దూరంలో నిలిచింది. మార్క్‌రమ్‌ (21) కాసేపు ఆడినా... రాహుల్‌ త్రిపాఠి పోరాడినా... భారీ లక్ష్యానికి ఇవేవీ సరిపోలేదు. స్పిన్నర్‌ హసరంగ వైవిధ్యమైన బంతులకు రైజర్స్‌ బ్యాటర్స్‌ చేతులెత్తేశారు. పూరన్‌ (19) మినహా సుచిత్‌ (2), శశాంక్‌ (8), కార్తీక్‌ త్యాగి (0), ఉమ్రాన్‌ (0), ఫారుఖి (2 నాటౌట్‌), భువనేశ్వర్‌ (8) సింగిల్‌ డిజిట్‌ చేసి డగౌట్‌కు వెళ్లారు.

స్కోరు వివరాలు
రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు ఇన్నింగ్స్‌: కోహ్లి (సి) విలియమ్సన్‌ (బి) సుచిత్‌ 0; డుప్లెసిస్‌ (నాటౌట్‌) 73; పటిదార్‌ (సి) త్రిపాఠి (బి) సుచిత్‌ 48; మ్యాక్స్‌వెల్‌ (సి) మార్క్‌రమ్‌ (బి) త్యాగి 33; కార్తీక్‌ (నాటౌట్‌) 30; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 3 వికెట్లకు) 192.
వికెట్ల పతనం: 1–0, 2–105, 3–159.
బౌలింగ్‌: సుచిత్‌ 4–0–30–2, భువనేశ్వర్‌ 4–0–34–0, ఫారూఖి 4–0–47–0, త్యాగి 4–0–42–1, ఉమ్రాన్‌ 2–0–25–0, అభిషేక్‌ 2–0–13–0.

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఇన్నింగ్స్‌: అభిషేక్‌ (బి) మ్యాక్స్‌వెల్‌ 0; విలియమ్సన్‌ (రనౌట్‌) 0; త్రిపాఠి (సి) మహిపాల్‌ (బి) హాజల్‌వుడ్‌ 58; మార్క్‌రమ్‌ (సి) కోహ్లి (బి) హసరంగ 21; పూరన్‌ (సి) షహ బాజ్‌ (బి) హసరంగ 19; సుచిత్‌ (స్టంప్డ్‌) దినేశ్‌ కార్తీక్‌ (బి) హసరంగ 2; శశాంక్‌ (సి) మ్యాక్స్‌వెల్‌ (బి) హసరంగ 8; త్యాగి (సి) పటిదార్‌ (బి) హజల్‌వుడ్‌ 0; భువనేశ్వర్‌ (సి) డుప్లెసిస్‌ (బి) హర్షల్‌ 8; ఉమ్రాన్‌ (ఎల్బీడబ్ల్యూ) (బి) హసరంగ 0; ఫారూఖి (నాటౌట్‌) 2; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (19.2 ఓవర్లలో ఆలౌట్‌) 125.
వికెట్ల పతనం: 1–0, 2–1, 3–51, 4–89, 5–104, 6–114, 7–114, 8–114, 9–114, 10–125.
బౌలింగ్‌: మ్యాక్స్‌వెల్‌ 2–0–13–1, హజల్‌వుడ్‌ 4–0–17–2, షహబాజ్‌ 2–0–20–0, సిరాజ్‌ 3–0–27–0, మహిపాల్‌ 1–0–7–0, హర్షల్‌ పటేల్‌æ 3.2–0–20–1, హసరంగ 4–1–18–5.

ఐపీఎల్‌లో నేడు
ముంబై ఇండియన్స్‌ X కోల్‌కతా నైట్‌రైడర్స్‌
వేదిక: ముంబై, రాత్రి గం. 7:30 నుంచి స్టార్‌ స్పోర్ట్స్‌–1లో ప్రత్యక్ష ప్రసారం.

మరిన్ని వార్తలు