Kane Williamson: ఇంకెంత కాలం విలియమ్సన్‌ను భరిస్తారు.. తుది జట్టు నుంచి తప్పించండి!

17 May, 2022 14:23 IST|Sakshi
సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌(PC: IPL/BCCI)

IPL 2022- Kane Williamson: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ ఆట తీరుపై టీమిండియా మాజీ క్రికెటర్‌ ఆర్పీ సింగ్‌ విమర్శలు గుప్పించాడు. పవర్‌ప్లేలో ఆడే అవకాశాన్ని సరిగా వినియోగించుకోలేకపోతున్నాడని పెదవి విరిచాడు. ఇకనైనా అతడిని తుది జట్టు నుంచి తప్పించాలని సన్‌రైజర్స్‌ యాజమాన్యానికి సూచించాడు. 

కాగా ఐపీఎల్‌-2022 సీజన్‌లో కేన్‌ మామ బ్యాటర్‌గా విఫలమవుతున్నాడు. ఈ ఎడిషన్‌లో ఇప్పటి వరకు ఆడిన 12 మ్యాచ్‌లలో అతడు చేసిన పరుగులు మొత్తం కలిపి 208. అత్యధిక స్కోరు 57. అంటే కేన్‌ విలియమ్సన్‌ ఆట తీరు ఎంత ఘోరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.   

ఈ నేపథ్యంలో ఆర్పీ సింగ్‌.. కేన్‌ విలియమ్సన్‌ ఆట తీరు గురించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘‘విలియమ్సన్‌ జట్టులో ఉంటే బాగుంటుంది. అయితే, అతడిని తుది జట్టు నుంచి తప్పించినా బాగానే ఉంటుంది. ఇంకెంత కాలం అతడిని భరిస్తారు? తనొక ప్రొఫెషనల్‌ క్రికెటర్‌. కానీ స్థాయికి తగ్గ ప్రదర్శన ఇవ్వలేకపోతున్నాడు. ఇప్పుడు కూడా అతడిని కొనసాగించాలా?

కేన్‌ విలియమ్సన్‌ మంచి వ్యక్తి. గొప్ప కెప్టెన్‌ కూడా! కానీ ఓపెనర్‌గా రాణించలేకపోతున్నాడు. ఇప్పటికీ జట్టులో మార్పులు చేయకపోతే కష్టం. అభిషేక్‌ శర్మతో కలిసి రాహుల్‌ త్రిపాఠిని ఓపెనింగ్‌కు దింపండి’’ అని సన్‌రైజర్స్‌ యాజమాన్యానికి సూచించాడు.

ఇక భారత మాజీ లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌ ప్రజ్ఞాన్‌ ఓజా సైతం ఓపెనర్‌గా విలియమ్సన్‌ పెద్దగా ఆకట్టుకోవడం లేదని, అతడు మిడిలార్డర్‌లో ఫిట్‌ అవుతాడని అభిప్రాయపడ్డాడు. కాగా సన్‌రైజర్స్‌ మంగళవారం(మే 17) ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌ ఆడనుంది. ఈ మ్యాచ్‌లో భారీ తేడాతో గెలిస్తేనే ప్లే ఆఫ్స్‌ రేసులో నిలిచే అవకాశం రైజర్స్‌కు ఉంటుంది.

చదవండి👉🏾IPL 2022- MI Vs SRH: అతడి వల్లే ఇదంతా.. సన్‌రైజర్స్‌ మిగిలిన రెండు మ్యాచ్‌లు గెలవడం కష్టమే! ఎందుకంటే..

మరిన్ని వార్తలు