Trent Boult: అడగ్గానే ఇచ్చేశాడు.. వైరల్‌గా మారిన రాజస్తాన్‌ బౌలర్‌ చర్య

28 May, 2022 16:01 IST|Sakshi

ఐపీఎల్‌ 2022 సీజన్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ అద్భుత ఆటతీరుతో ఫైనల్‌ చేరుకుంది. శుక్రవారం ఆర్‌సీబీతో జరిగిన క్వాలిఫయర్‌-2లో రాజస్తాన్‌ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. జాస్‌ బట్లర్‌ మెరుపు సెంచరీతో మ్యాచ్‌ మొత్తం వన్‌సైడ్‌గా మారిపోయింది. మ్యాచ్‌ గెలవడంతో రాజస్తాన్‌ ఆటగాళ్లంతా సంబురాల్లో మునిగిపోయారు. ఈ నేపథ్యంలో రాజస్తాన్‌ పేసర్‌ ట్రెంట్‌ బౌల్ట్ తన చర్యతో అభిమానిని ఆనందంలో ముంచెత్తాడు.

విషయంలోకి వెళితే.. మ్యాచ్‌ ముగిసిన అనంతరం డ్రెస్సింగ్‌ రూమ్‌కు వెళ్తున్న బౌల్ట్‌ను ఒక కుర్రాడు ఆపాడు. మీరంటే నాకు చాలా అభిమానం.. మీ బౌలింగ్‌ అంటే చాలా ఇష్టం.. మీ జెర్సీ నాకు గిఫ్ట్‌గా ఇస్తారా అని అడిగాడు. కుర్రాడి మాటలకు ముచ్చటపడిన బౌల్ట్‌ అక్కడే తన షర్ట్‌ను విప్పేసి పెవిలియన్‌ గ్లాస్‌ నుంచి ఇచ్చే ప్రయత్నం చేశాడు. అయితే వీలు కాకపోవడంతో ఎంట్రీ వద్ద ఉన్న మరో రాజస్తాన్‌ ఆటగాడి వద్దకు జెర్సీ విసిరేసి.. ఆ కుర్రాడికి జెర్సీని అందివ్వు అని చెప్పాడు. 

ఆ తర్వాత కుర్రాడు బౌల్ట్‌ ఇచ్చిన జెర్సీని వేసుకొని తెగ సంతోషపడిపోయాడు. దీనికి సంబంధించిన వీడియోను రాజస్తాన్‌ రాయల్స్‌ ఫ్రాంచైజీ తన ట్విటర్‌లో షేర్‌ చేసింది. ''ఇంత చేశాకా నిన్ను లవ్‌ చేయకుండా ఉలా ఉంటాం బౌల్ట్‌'' అని క్యాప్షన్‌ జత చేసింది. కాగా బౌల్ట్‌ ఈ సీజన్లో రాజస్తాన్‌ రాయల్స్‌ ​తరపున మంచి ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఆరంభంలోనే వికెట్లు తీస్తూ జట్టుకు మంచి బ్రేక్‌ ఇస్తున్నాడు. ఇప్పటివరకు 15 మ్యాచ్‌ల్లో 8.24 ఎకానమీ రేటుతో 15 వికెట్లు తీశాడు. ఇక 2008 తర్వాత మరోసారి ఫైనల్‌ చేరిన రాజస్తాన్‌ రాయల్స్‌ మే29(ఆదివారం) జరగనున్న ఫైనల్లో గుజరాత్‌ టైటాన్స్‌తో తలపడనుంది.

చదవండి: Paul Stirling: ఒక్క ఓవర్‌లో 34 పరుగులు.. అయినా మొహంలో చిరాకే!

Trolls On RCB Fan Girl: 'ఆర్‌సీబీ కప్‌ కొట్టదు.. నువ్వు పెళ్లి చేసుకోవు'

మరిన్ని వార్తలు