IPL 2022: రాజస్థాన్‌ను ఢీకొట్టనున్న ఢిల్లీ.. యశ్‌ ధుల్‌ అరంగేట్రం..?

11 May, 2022 18:42 IST|Sakshi

ఐపీఎల్‌ 2022 సీజన్‌లో ఇవాళ (మే 11) మరో హై ఓల్టేజీ పోరు జరుగనుంది. విధ్వంసకర వీరులతో నిండిన రాజస్థాన్‌ రాయల్స్‌, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు ముంబైలోని డీవై పాటిల్ స్టేడియం వేదికగా ఇవాళ అమీతుమీ తేల్చుకోనున్నాయి. రాత్రి 7:30 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్‌ ఇరు జట్లకు కీలకంగా మారింది. నేటి మ్యాచ్‌లో రాజస్థాన్‌ గెలిస్తే ప్లే ఆఫ్స్‌ బెర్తును దాదాపుగా ఖరారు చేసుకోనుండగా.. ఈ మ్యాచ్‌ ఢిల్లీ జట్టుకు డు ఆర్‌ డైగా మారింది. రాజస్థాన్‌పై గెలిస్తేనే ఆ జట్టు ప్లే ఆఫ్స్ రేసులో నిలుస్తుంది. 

ప్రస్తుత సీజన్‌లో రాజస్థాన్‌ ఇప్పటివరకు ఆడిన 11 మ్యాచ్‌ల్లో 7 విజయాలతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉండగా.. ఢిల్లీ క్యాపిటల్స్‌ 11 మ్యాచ్‌ల్లో 5 విజయాలతో ఐదో స్థానంలో నిలిచింది. గుజరాత్‌ టైటాన్స్‌ (12 మ్యాచ్‌ల్లో 9 విజయాలు) ఇప్పటికే ప్లే ఆఫ్స్‌ బెర్తును పక్కా చేసుకోగా.. మిగిలిన మూడు స్థానాల కోసం లక్నో (12 మ్యాచ్‌ల్లో 8 విజయాలు), రాజస్థాన్‌, ఆర్సీబీ (12 మ్యాచ్‌ల్లో 7 విజయాలు), ఢిల్లీ జట్ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. 

ఇదే సీజన్‌లో రాజస్థాన్‌-ఢిల్లీ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ చివరి నిమిషం​ వరకు ఉత్కంఠభరితంగా సాగిన విషయం తెలిసిందే. ఆ మ్యాచ్‌లో రాజస్థాన్ జట్టు 2 వికెట్ల నష్టానికి 222 పరుగుల భారీ స్కోర్‌ చేయగా.. ఛేదనలో ఢిల్లీ చివరి వరకు పోరాడి 207 పరుగులు చేయగలిగింది. ఆ మ్యాచ్‌ ఆఖరి ఓవర్‌లో నో బాల్‌ వ్యవహారం తీవ్ర దుమారం రేపింది. నేటి మ్యాచ్‌లో ఢిల్లీ.. రాజస్థాన్‌పై ఎలాగైనా గెలిచి ప్రతీకారం తీర్చుకోవాలని పట్టుదలగా ఉంది. 

ఇక నేటి మ్యాచ్‌లో తుది జట్ల విషయానికొస్తే.. ఢిల్లీ ఆటగాడు పృథ్వీ షా మ్యాచ్‌ సమయానికి జ్వరం​ నుంచి కోలుకోకపోతే అతని స్థానాన్ని భారత అండర్‌ 19 కెప్టెన్‌ యశ్‌ ధుల్‌తో భర్తీ చేసే అవకాశం ఉంది. గత రెండు మ్యాచ్‌ల్లో వార్నర్‌తో కలిసి ఓపెనర్‌గా బరిలోకి దిగిన మన్‌దీప్‌ సింగ్‌.. తనకు లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోకపోవడంతో అతనిపై వేటు తప్పకపోవచ్చు. ఐపీఎల్‌లో యశ్‌ ధుల్‌కు ఇది తొలి మ్యాచ్‌ అయ్యే అవకాశం ఉంది. మరోవైపు రాజస్థాన్‌.. పాక్షికంగా బయోబబుల్‌ను వీడిన షిమ్రోన్‌ హెట్‌మైర్‌ స్థానాన్ని వాన్‌ డెర్‌ డస్సెన్‌తో భర్తీ చేసే అవకాశం ఉంది. 

తుది జట్లు (అంచనా)..
రాజస్థాన్‌ రాయల్స్‌: జోస్‌ బట్లర్‌, యశస్వి జైస్వాల్‌, సంజూ శాంస్‌ (కెప్టెన్‌), దేవ్‌దత్‌ పడిక్కల్‌, రియాన్‌ పరాగ్‌, వాన్‌ డెర్‌ డస్సెన్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌, ట్రెంట్‌ బౌల్ట్‌, ప్రసిద్ధ్‌ కృష్ణ, చహల్‌, కుల్దీప్‌ సేన్‌

ఢిల్లీ క్యాపిటల్స్‌: డేవిడ్‌ వార్నర్‌, యశ్‌ ధుల్‌, మిచెల్‌ మార్ష్‌, రిషబ్‌ పంత్‌ (కెప్టెన్‌), రోవ్‌మన్‌ పావెల్‌, అక్షర్‌ పటేల్‌, రిపల్‌ పటేల్‌, శార్ధూల్‌ ఠాకూర్‌, కుల్దీప్‌ యాదవ్‌, ఖలీల్‌ అహ్మద్‌, అన్రిచ్‌ నోర్జే
చదవండి: ప్లేఆఫ్‌ అవకాశాలు ఖేల్‌ఖతం.. ఇంతకుమించి ఏం చేస్తారులే!

మరిన్ని వార్తలు