IPL 2022: ‘త్వరలోనే టీమిండియాకు ఆడతాడు’.. అసలు ఎవరీ కుల్దీప్‌ సేన్‌?!

11 Apr, 2022 13:20 IST|Sakshi
కుల్దీప్‌ సేన్‌(PC: Rajasthan Royals Twitter)

IPL 2022 RR Vs LSG: గెలుపోటములను తేల్చే ఆఖరి ఓవర్‌లో బంతితో అద్భుతం చేసి రాజస్తాన్‌ రాయల్స్‌ను విజయతీరాలకు చేర్చాడు ఫాస్ట్‌ బౌలర్‌ కుల్దీప్‌ సేన్‌. లక్నో సూపర్‌జెయింట్స్‌ గెలుపునకు 15 పరుగులు అవసరమైన సమయంలో బ్యాటింగ్‌ ఆల్‌రౌండర్‌ మార్కస్‌ స్టొయినిస్‌ను తన వైవిధ్యమైన బంతులతో ఉక్కిరిబిక్కిరి చేశాడు. తద్వారా, అతడిని కట్టడి చేసి లక్నో ఓటమిని శాసించాడు. 

ఈ క్రమంలో కుల్దీప్‌ సేన్‌పై ప్రశంసలు కురుస్తున్నాయి. ఎంట్రీలోనే అదరగొట్టిన ఈ యువ క్రికెటర్‌ ఆట తీరును కెప్టెన్‌ సంజూ శాంసన్‌ కొనియాడాడు. అతడి ప్రతిభ అమోఘమని, త్వరలోనే టీమిండియాకు ఆడతాడంటూ వ్యాఖ్యానించాడు. ఇక రాజస్తాన్‌ హెడ్‌కోచ్ కుమార సంగక్కర సైతం కుల్దీప్‌ టాలెంట్‌కు ఫిదా అయ్యాడు. ఈ నేపథ్యంలో ఐపీఎల్‌-2022 సీజన్‌లో అయుష్‌ బదోని, వైభవ్‌ ఆరోరా, తిలక్‌ వర్మ, సాయి సుదర్శన్‌ వంటి యువ ఆటగాళ్లతో పాటు మరో ఆణిముత్యం దొరికిందంటూ క్రికెట్‌ ప్రేమికులు కామెంట్లు చేస్తున్నాడు. 

ఇంతకీ ఎవరీ కుల్దీప్‌ సేన్‌?!
మధ్యప్రదేశ్‌లోని రేవా జిల్లాలో గల హరిహాపూర్‌ కుల్దీప్‌ స్వస్థలం. అతడి తండ్రి రాంపాల్‌ సేన్‌ స్థానికంగా చిన్నపాటి సెలూన్‌ నడుపుతున్నారు. కుల్దీప్‌ సేన్‌కు నలుగురు తోబుట్టువులు. క్రికెట్‌పై చిన్ననాటి నుంచే ఆసక్తి పెంచుకున్న అతడు.. ఎనిమిదేళ్ల వయసు నుంచే ఆడటం మొదలుపెట్టాడు.

స్థానిక అకాడమీ అతడి ఫీజును మాఫీ చేసిందంటే ఆట పట్ల కుల్దీప్‌నకు ఉన్న అంకితభావం, ప్రేమ ఎంతటిదో అర్థం చేసుకోవచ్చు. 2018లో ఈ మీడియం పేసర్‌ రంజీ ట్రోఫీలో అరంగేట్రం చేశాడు. ఇందులో భాగంగా పంజాబ్‌తో ఆడిన మ్యాచ్‌లో ఐదు వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. ఇప్పటి వరకు మొత్తంగా 16 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌లు ఆడిన కుల్దీప్‌ సేన్‌.. 44 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.

ఇక సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీలో భాగంగా ముంబైతో టీ20 మ్యాచ్‌లో పొట్టి ఫార్మాట్‌లో కుల్దీప్‌ అడుగుపెట్టాడు. ఆ మ్యాచ్‌లో 3 ఓవర్లు బౌలింగ్‌ చేసి 22 పరుగులు ఇచ్చి ఒక వికెట్‌ పడగొట్టాడు. ఈ ఫార్మాట్‌లో 12 వికెట్లు పడగొట్టిన కుల్దీప్‌ సేన్‌ను ఐపీఎల్‌ మెగా వేలం-2022లో భాగంగా రాజస్తాన్‌ రాయల్స్‌ కొనుగోలు చేసింది.

రూ. 20 లక్షలు వెచ్చించి అతడిని సొంతం చేసుకుంది. ఆడిన తొలి మ్యాచ్‌లోనే 4 ఓవర్లు బౌలింగ్‌ చేసే అవకాశం దక్కించుకున్న కుల్దీప్‌ సేన్‌35 పరుగులు ఇచ్చి ఒక వికెట్‌ పడగొట్టాడు. దీపక్‌ హుడాను అవుట్‌ చేయడంతో పాటు ఆఖరి ఓవర్లో పొదుపుగా బౌలింగ్‌ చేసి అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు. 

చదవండి: IPL 2022: కుల్దీప్‌.. కుల్దీప్‌.. అదరగొట్టారుగా! ఇద్దరూ సూపర్‌!

మరిన్ని వార్తలు