IPL 2022: సీఎస్‌కే, రవీంద్ర జడేజా మధ్య విబేధాలు.. ఎస్‌ఆర్‌హెచ్‌ బాటలోనేనా!

11 May, 2022 13:52 IST|Sakshi
PC: IPL Twitter

సీఎస్‌కే యాజమాన్యం, ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజాల మధ్య విబేధాలు ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ధోని స్థానంలో జట్టును నడిపించడంలో విఫలమైన జడ్డూపై సీఎస్కే గుర్రుగా ఉన్నట్లు సమాచారం. అందుకు తగ్గట్లే సీఎస్‌కే ఇటీవలే తన ఇన్‌స్టాగ్రామ్‌లో జడేజాను అన్‌ఫాలో చెయ్యడం పలు అనుమానాలకు తావిస్తుంది.

దీనికి తోడూ ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యా్చ్‌కు జడేజాను పక్కనబెట్టడం వెనుక సీఎస్కే ఫ్రాంచైజీ హస్తం ఉన్నట్లు క్రికెట్‌ ఫ్యాన్స్‌ అభిప్రాయపడ్డారు. ఇదే నిజమైతే ఎన్నో ఏళ్లుగా సీఎస్‌కేకు నమ్మదగిన ఆటగాడిగా ఉన్న జడేజాకు ఆ జట్టుతో అనుబంధం ఇదే ఆఖరు కావచ్చొని పలు వర్గాలు పేర్కొన్నాయి.


PC: IPL Twitter
ఇక ఐపీఎల్‌ 2022 సీజన్‌లో సీఎస్‌కే దారుణ ప్రదర్శన చేసింది. గతేడాది చాంపియన్‌గా నిలిచిన సీఎస్కే ఈసారి మాత్రం ఆ స్థాయి ప్రదర్శన చేయలేక చతికిలపడింది. ఇప్పటివరకు 11 మ్యాచ్‌ల్లో 4 ఓటములు, ఏడు పరాజయాలతో పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో సీఎస్కే ప్లే ఆఫ్‌కు చేరడం కష్టమే. అయితే సీఎస్‌కే దారుణ ప్రదర్శనకు కెప్టెన్సీ మార్పు కూడా ఒక కారణం అని చెప్పొచ్చు. ఐపీఎల్‌ 15వ సీజన్‌ ఆరంభానికి ముందే ధోని కెప్టెన్సీ నుంచి పక్కకు తప్పుకున్నాడు.

దీంతో సీఎస్‌కే మేనేజ్‌మెంట్‌ జట్టులో సీనియర్‌గా ఉన్న జడేజాపై నమ్మకముంచి నాయకత్వ బాధ్యతలు అప్పగించింది. జడ్డూ కెప్టెన్సీని సంతోషంగా అంగీకరించినప్పటికి.. నాయకత్వంలో ఘోరంగా విఫలమయ్యాడు. ధోని పెద్దన్న పాత్ర పోషించినప్పటికి సీఎస్‌కేకు వరుసగా పరాజయాలే ఎదురయ్యాయి. దీంతో ఒత్తిడిని తట్టుకోలేక జడేజా కెప్టెన్సీని తిరిగి ధోనికే అప్పగించాడు. అయితే కెప్టెన్‌గా సక్సెస్‌ కాలేకపోయిన జడ్డూ బ్యాటింగ్‌, బౌలింగ్‌లోనూ పెద్దగా మెరవలేదు. టాప్‌ క్లాస్‌ ఆల్‌రౌండర్‌గా పేరు ఉన్న జడేజా నుంచి ఇలాంటి ప్రదర్శనను సీఎస్‌కే కూడా ఊహించలేదు. ధోని చేతికి కెప్టెన్సీ వచ్చిన తర్వాత రెండు మ్యాచ్‌ల్లో ఆడిన జడ్డూ తీవ్రంగా నిరాశపరిచాడు. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌కు జడేజాను పక్కనబెట్టడం ఆసక్తి కలిగించింది. 

ధోని, రైనా తర్వాత నమ్మదగిన ఆటగాడిగా..


PC: IPL Twitter

ఇక ధోని, రైనా తర్వాత సీఎస్కేలో మంచి పేరు జడేజాకే ఉంది. 2012లో తొలిసారి సీఎస్‌కేలో అడుగుపెట్టిన జడేజా.. మధ్యలో గుజరాత్‌ లయన్స్‌(రెండు సీజన్లు సీఎస్కేపై నిషేధం)కు ప్రాతినిధ్యం వహించాడు. ఆ తర్వాత 2016లో రూ. 9.5 కోట్లకు జడేజాను సీఎస్‌కే కొనుగోలు చేసింది. అప్పటినుంచి జడ్డూ సీఎస్‌కేకు ఆడుతూ వస్తున్నాడు. గతేడాది మెగావేలానికి ముందు సీఎస్‌కే ధోని, రుతురాజ్‌ గైక్వాడ్‌తో పాటు రూ.12 కోట్లకు జడేజాపు రిటైన్‌ చేసుకుంది.

అయితే ధోని తనకు పెద్ద మొత్తం వద్దని.. జడేజాకు ఎక్కువ మొత్తంలో చెల్లిస్తే బాగుంటుందని తనకు తానుగా చెప్పడంతో సీఎస్‌కే కూడా జడ్డూపై నమ్మకంతో అతనికి ఎక్కువ మొత్తం అందించింది. అయితే తాజా సీజన్‌లో జడేజా తన నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయాడా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి తోడూ చాలా మంది క్రికెట్‌ ఫ్యాన్స్‌ జడేజా- సీఎస్‌కే వైఖరిని.. వార్నర్‌- ఎస్‌ఆర్‌హెచ్‌ ఉదంతంతో పోలుస్తున్నారు. 

ఎస్‌ఆర్‌హెచ్‌ బాటలోనేనా..
గత సీజన్‌లో వార్నర్‌కు ఎస్‌ఆర్‌హెచ్‌ నుంచి ఎలాంటి అవమానాలు జరిగాయో ప్రత్యేకంగా చెప్పవనసరం లేదు. 2016లో వార్నర్‌ కెప్టెన్సీలోనే ఎస్‌ఆర్‌హెచ్‌ టైటిల్‌ విజేతగా నిలిచింది. ఆ తర్వాత కూడా ప్రతీ సీజన్‌లో వార్నర్‌ జట్టును ప్లే ఆఫ్‌ చేర్చాడు.(2018లో తప్ప.. వార్నర్‌పై నిషేధం కారణంగా కేన్‌ విలియమ్సన్‌ కెప్టెన్సీ). అయితే ఇవేవి పట్టించుకోని ఎస్‌ఆర్‌హెచ్‌ గత సీజన్‌లో వార్నర్‌ను ఘోరంగా అవమానించింది.


PC: IPL Twitter
ముందు కెప్టెన్సీ నుంచి తొలగించింది..  ఆ తర్వాత తుది జట్టు నుంచి పక్కకు తప్పించింది.. ఆ తర్వాత మ్యాచ్‌లు ఆడకపోవడంతో డ్రింక్స్‌ బాయ్‌ అవతారంలో వార్నర్‌ను చూసి సొంత అభిమానులే జీర్ణించుకోలేకపోయారు. అ‍ప్పట్లో వార్నర్‌పట్ల ఎస్‌ఆర్‌హెచ్‌ వైఖరిని తీవ్రంగా విమర్శించారు. అదే వార్నర్‌ ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్‌ తరపున ఆడుతూ.. ఎస్‌ఆర్‌హెచ్‌తో మ్యాచ్‌లో 92 పరుగుల నాకౌట్‌ ఇన్నింగ్స్‌ ఆడి తనదైన శైలిలో కౌంటర్‌ ఇచ్చాడు.

తాజా పరిణామాలు కూడా కాస్త అటూ ఇటుగా ఉన్నాయి. అయితే ఇక్కడ జడేజా తనంతట తానే కెప్టెన్‌గా తప్పుకున్నాడు. కానీ సీజన్‌లో జడేజా ఆటగాడిగా పూర్తిగా విఫలమయ్యాడు. అందుకే ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో జడేజాను పక్కనబెట్టారు. మరి ఇది ఒక్క మ్యాచ్‌కే పరిమితమవుతుందా లేక వార్నర్‌ బాటలోనే జడేజాకు అవమానాలు ఎదురవుతాయా అనేది ఇప్పటికే ప్రశ్నగానే ఉంది. మరి రాబోయే రోజుల్లో ఈ ప్రశ్నలన్నింటికి ఒక క్లారిటీ వస్తుంది. ఇక సీఎస్కే తన తర్వాతి మ్యాచ్‌ మే 12న ముంబై ఇండియన్స్‌తో ఆడనుంది.


PC: IPL Twitter

చదవండి: Sri Lanka Economic Crisis: దేశం దుర్భర స్థితికి ప్రభుత్వమే కారణం.. అసహ్యమేస్తోంది : లంక మాజీ క్రికెటర్లు

Mumbai Indians: ప్లేఆఫ్‌ అవకాశాలు ఖేల్‌ఖతం.. ఇంతకుమించి ఏం చేస్తారులే!

మరిన్ని వార్తలు