IPL 2022: గతేడాది హీరోలు జీరోలవుతున్నారా.. ఏమైంది వీళ్లకు?!

6 Apr, 2022 20:18 IST|Sakshi
Courtesy: IPL Twitter

ఐపీఎల్ పేరుకు క్యాష్‌ రిచ్‌ లీగ్‌ అయినా.. ఎంతో మంది ప్రతిభావంతమైన ఆటగాళ్లను వెలుగులోకి తెచ్చింది. ఐపీఎల్‌ 2021 సీజన్‌లో రుతురాజ్‌ గైక్వాడ్‌, వెంకటేశ్‌ అయ్యర్‌, పృథ్వీ షా, యశస్వి జైశ్వాల్‌, నితీష్‌ రాణాలు తమ జట్ల తరపున చాలా బాగా రాణించారు.  అందుకే వీరిని మెగావేలంలో రిలీజ్‌ చేయకుండా తమతోనే అట్టిపెట్టుకుంది.

మరి గతేడాది హీరోలుగా నిలిచిన వీళ్లు ఈసారి మాత్రం జీరోలుగా మిగిలిపోనున్నారా.. ఎందుకంటే ఇంతవరకు మనం ఆశించిన ఆటతీరు పైన చెప్పుకున్న ఐదుగురిలో ఒక్కసారి కూడా కనబడలేదు. ఒకవేళ​ లీగ్‌ ఇప్పుడే కదా ప్రారంభమైంది అనుకున్నా.. మరి రాబోయే మ్యాచ్‌ల్లోనైనా మెరుస్తారా అంటే అది చెప్పలేని పరిస్థితి. మరి వీళ్ల గురించి ఒకసారి తెలుసుకుందాం.
-సాక్షి, వెబ్‌డెస్క్‌

రుతురాజ్‌ గైక్వాడ్‌(సీఎస్‌కే)


Courtesy: IPL Twitter

ఐపీఎల్‌ 2021 సీజన్‌లో రుతురాజ్‌ గైక్వాడ్‌ ఆరెంజ్‌ క్యాప్‌ హోల్డర్‌. గత సీజన్‌లో విజేతగా నిలిచిన సీఎస్‌కే వెనుక రుతురాజ్‌ పాత్ర మరువలేనిది. 16 మ్యాచ్‌లాడిన రుతురాజ్‌ 635 పరుగులు సాధించి సీజన్‌లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా పేరు పొందాడు. ఈ సీజన్‌లో మాత్రం ఇప్పటివరకు పూర్తిగా నిరాశపరిచాడు. సీఎస్‌కే ఆడిన మూడు మ్యాచ్‌లు కలిపి రుతురాజ్‌ రెండు పరుగులు మాత్రమే చేశాడు. లక్నో సూపర్‌ జెయింట్స్‌తో మ్యాచ్‌లో రుతురాజ్‌ గోల్డెన్‌ డక్‌ అయ్యాడు.

25 ఏళ్ల రుతురాజ్‌ సరిగ్గా రాణించకపోవడంతో సీఎస్‌కే తొలి ఆరు ఓవర్లలో భారీ స్కోరు చేయడంలో విఫలమవుతుంది. ఇదే రుతురాజ్‌ గత సీజన్‌లో పవర్‌ ప్లేలో చెలరేగి ఆడడంతో సీఎస్‌కే ప్రతీ మ్యాచ్‌లోనూ మంచి స్కోరు లభించింది. అయితే రుతురాజ్‌ ఐపీఎల్‌ ప్రారంభానికి ముందు వరుసగా గాయాల బారీన పడ్డాడు. టీమిండియా ఆడిన పలు సిరీస్‌లు ఎంపికైనప్పటికి గాయాలతో దూరం కావడమో లేక బెంచ్‌కే పరిమితం అయ్యేవాడు. మరి రాబోయే మ్యాచ్‌ల్లోనైనా రుతురాజ్‌ రాణించాలని ఆశిద్దాం

వెంకటేశ్‌ అయ్యర్‌(కేకేఆర్‌)


Courtesy: IPL Twitter
గతేడాది ఐపీఎల్‌ సీజన్‌లో వెంకటేశ్‌ అయ్యర్‌ పెను సంచలనం.  సీజన్‌ ఆరంభంలో పెద్దగా రాణించని అయ్యర్‌.. రెండో అంచె పోటీల్లో కేకేఆర్‌కు వెన్నుముకగా మారాడు 10 మ్యాచ్‌ల్లో 370 పరుగులు చేయడంతో పాటు బౌలింగ్‌లోనూ ఆకట్టుకున్నాడు. ఈ ప్రదర్శనతో టీమిండియాలోకి ఎంపికైన వెంకటేశ్‌ అయ్యర్‌ వెస్టిండీస్‌, శ్రీలంకతో జరిగిన సిరీస్‌ల్లో మోస్తరుగా రాణించాడు. అయితే ఐపీఎల్‌లో మరోసారి కీలకం అవుతాడనుకుంటే పూర్తిగా నిరాశపరుస్తున్నాడు. ఇప్పటివరకు కేకేఆర్‌ ఆడిన మూడు మ్యాచ్‌ల్లో ఓపెనర్‌గా వచ్చిన వెంకటేశ్‌ అయ్యర్‌ వరుసగా 16,10,3 పరుగులు చేశాడు. 

యశస్వి జైశ్వాల్‌(రాజస్తాన్‌ రాయల్స్‌)


Courtesy: IPL Twitter
గతేడాది రాజస్తాన్‌ రాయల్స్‌ జట్టుగా విఫలమైనప్పటికి యశస్వి జైశ్వాల్‌ మాత్రం సక్సెస్‌ అయ్యాడు. అందివచ్చిన ప్రతీ అవకాశాన్ని ఉపయోగించుకున్న యశస్వి జైశ్వాల్‌ 10 మ్యాచ్‌ల్లో 148 స్ట్రైక్‌రేట్‌తో 249 పరుగులు సాధించాడు. అయితే ఈ సీజన్‌లో మాత్రం జైశ్వాల్‌ అంతగా రాణించలేకపోతున్నాడు. మూడు మ్యాచ్‌లు కలిపి 25 పరుగులు మాత్రమే చేశాడు. అయితే రాజస్తాన్‌ రాయల్స్‌ ఈ సీజన్‌లో అంచనాలకు మించి రాణిస్తుండడం.. బట్లర్‌ లాంటి స్టార్‌ ఆటగాడు ఫామ్‌లో ఉండంతో పెద్దగా కనబడడం లేదు. కానీ యశస్వి జైశ్వాల్‌ ఓపెనర్‌గా తన మార్క్‌ చూపించాల్సిన అవసరం చాలా ఉంది

పృథ్వీ షా(ఢిల్లీ క్యాపిటల్స్‌)


Courtesy: IPL Twitter

2018 అండర్‌-19 ప్రపంచకప్‌ గెలిచిన టీమిండియా యంగ్‌ కెప్టెన్‌గా పృథ్వీ షా అప్పట్లో అందరి దృష్టిని ఆకర్షించాడు. ఈ నేపథ్యంలోనే 2018లో జరిగిన వేలంలో పృథ్వీని ఢిల్లీ క్యాపిటల్స్‌ దక్కించుకుంది. 2021 సీజన్‌లో పృథ్వీ షా ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఘనమైన ఆరంభాలు ఇచ్చాడు. 15 మ్యాచ్‌ల్లో 479 పరుగులు చేసిన పృథ్వీ షా ఢిల్లీ క్యాపిటల్స్‌కు పవర్‌ ప్లేలో భారీ స్కోరు చేయడంలో కీలకపాత్ర పోషించాడు. డేరింగ్‌ అండ్‌ డాషింగ్‌ బ్యాటింగ్‌తో అలరించిన పృథ్వీ ఈసారి మాత్రం అనుకున్నంత స్థాయిలో రాణించలేకపోతున్నాడు. ఆడిన రెండు మ్యాచ్‌ల్లో 38,10 పరుగులు చేసిన పృథ్వీ అనవసరంగా వికెట్‌ పారేసుకుంటున్నాడు. డేవిడ్‌ వార్నర్‌ జట్టులోకి వస్తే పృథ్వీ షా చోటు కోల్పోయే ప్రమాదం కూడా ఉంది.

నితీష్‌ రాణా(కేకేఆర్‌)


Courtesy: IPL Twitter
టీమిండియాలో చోటు దక్కకపోయినా కొన్నేళ్ళుగా నితీష్‌ రాణా ఐపీఎల్‌లో మాత్రం కేకేఆర్‌కు కీలకంగా మారాడు. గత సీజన్‌లో 17 మ్యాచ్‌ల్లో 383 పరుగులు సాధించాడు. కానీ ఈసారి మాత్రం మూడు మ్యాచ్‌ల్లో 21,10,0 పరుగులు చేశాడు. రాణా ఫామ్‌లోకి రావాలని కేకేఆర్‌ బలంగా కోరుకుంటుంది. 

చదవండి: Shikar Dhawan: 'లవ్‌ ప్రపోజ్‌ చేస్తే రిజెక్ట్‌ చేసింది.. కోహినూర్‌ డైమండ్‌ను మిస్సయ్యావు!'

IPL 2022: దుమ్మురేపుతున్న టీమిండియా అన్‌క్యాప్‌డ్‌ ఆటగాళ్లు.. భవిష్యత్తు వీళ్లదే

మరిన్ని వార్తలు