KL Rahul-Sanjay Manjrekar: 'కోచ్‌గా ఉండుంటే కేఎల్‌ రాహుల్‌ను కచ్చితంగా తిట్టేవాడిని'

26 May, 2022 19:15 IST|Sakshi
PC: IPL Twitter

ఐపీఎల్‌ 2022 సీజన్‌లో కొత్తగా ఎంట్రీ ఇచ్చిన లక్నో సూపర్‌ జెయింట్స్‌ తమ తొలి సీజన్‌లోనే అదరగొట్టే ప్రదర్శన నమోదు చేసింది. కేఎల్‌ రాహుల్‌ కెప్టెన్సీలోని జట్టు లీగ్‌ దశలో మంచి విజయాలు అందుకొని ఓవరాల్‌గా 14 మ్యాచ్‌ల్లో 9 విజయాలు.. ఐదు పరాజయాలతో మూడో స్థానంలో నిలిచి ప్లేఆఫ్స్‌కు చేరుకుంది. కీలకమైన ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో ఒత్తిడిని అదిగమించలేక.. ఆర్సీబీ చేతిలో కేఎల్‌ రాహుల్‌ సేన ఓటమి చవిచూసి ఇంటిబాట పట్టింది.

కీలకమైన ఎలిమినేటర్‌ మ్యాచ్‌లోనూ సహచరులు విఫలమైనప్పటికి తాను మాత్రం 79 పరుగుల కీలక ఇన్నింగ్స్‌తో మెరిశాడు. అంతేకాదు వరుసగా నాలుగు సీజన్ల పాటు 600 పైచిలుకు పరుగులు సాధించిన తొలి బ్యాటర్‌గా లక్నో కెప్టెన్‌ చరిత్ర సృ‍ష్టించాడు. ఇలా అటు కెప్టెన్‌గా.. ఇటు బ్యాటర్‌గా సూపర్‌ సక్సెస్‌ అయిన కేఎల్‌ రాహుల్‌పై ప్రశంసల జల్లు కురుస్తున్న వేళ టీమిండియా మాజీ క్రికెటర్‌ సంజయ్‌ మంజ్రేకర్‌ మాత్రం కేఎల్‌ రాహుల్‌ ఆటతీరును విమర్శించడం ఆసక్తి కలిగించింది.

''కీలకమైన ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో కేఎల్‌ రాహుల్‌ ప్రదర్శన మెచ్చుకోదగినదే. కానీ ఓపెనర్‌గా వచ్చిన అతను.. చివరిదాకా నిలబడినప్పటికి బ్యాటింగ్‌లో వేగం తగ్గినట్లు అనిపించింది. హాజిల్‌వుడ్‌ బౌలింగ్‌ళో మంచి బౌండరీలు బాదిన రాహుల్‌ ఆఖర్లో అదే టెంపోను కంటిన్యూ చేయలేకపోయాడు. చివరి దాకా నిలబడాలనేది మంచిదే.. కానీ అదే సమయంలో వేగంగా ఆడడం కూడా ముఖ్యమే. 

కానీ నిన్నటి మ్యాచ్‌లో రాహుల్‌లో అది లోపించింది. తొలి పవర్‌ ప్లే ముగిసేసరికి 17 బంతుల్లో 26 పరుగులు చేశాడు. ఆ తర్వాత లక్నో విజయానికి ఏడు ఓవర్లలో 99 పరుగులు అవసరమైన దశలోనూ రాహుల్‌ 42 బంతుల్లో 48 పరుగులతో ఆడుతున్నాడు. ఆ తర్వాతే బ్యాట్‌ ఝులిపించిన రాహుల్‌ మిగతా 16 బంతుల్లో 31 పరుగులు చేశాడు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అలా కాకుండా మొదటి నుంచి రాహుల్‌ కాస్త దూకుడు ప్రదర్శించి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేది. ఒకవేళ నేను రాహుల్‌కు కోచ్‌గా ఉంటే మాత్రం అతని ఆటతీరుపై కచ్చితంగా తిట్టేవాడిని. అతను కెప్టెన్‌గా ఉన్నప్పటికి నిర్ణయాన్ని రాహుల్‌ చేతుల్లో నుంచి నేను తీసుకునేవాడిని. అయితే ఎంఎస్‌ ధోని, విరాట్‌ కోహ్లి లాగా రాహుల్‌ కెప్టెన్సీకి అంతగా సూట్‌ కాలేడు. టెంపరరీగా అయితే మాత్రం అతను బెస్ట్‌ అని చెప్పొచ్చు.'' అని చెప్పుకొచ్చాడు.

చదవండి: IPL 2022 Eliminator Match: లక్నో, ఆర్‌సీబీ ఎలిమినేటర్‌ మ్యాచ్‌.. ఈడెన్‌ గార్డెన్‌ స్టేడియంలో ఐదుగురు అరెస్ట్‌

లక్నో చేసిన తప్పులు ఇవే.. అందుకే ఓడిపోయింది! ఒకవేళ అలా కాకపోయి ఉంటే!

మరిన్ని వార్తలు