IPL 2022: పాంటింగ్‌ సిఫార్సు.. కీలక పాత్రలో ఆస్ట్రేలియా మాజీ ఆల్‌రౌండర్‌

23 Feb, 2022 08:50 IST|Sakshi

ఆస్ట్రేలియా మాజీ ఆల్‌రౌండర్‌ షేన్‌ వాట్సన్‌ ఐపీఎల్‌లో మరోసారి మెరవనున్నాడు. ఈసారి ఆటగాడిగా కాకుండా అసిస్టెంట్‌ కోచ్‌ పాత్రలో కనిపించనున్నాడు. రెండుసార్లు ఐపీఎల్‌ టైటిల్‌ గెలిచిన జట్లలో సభ్యుడిగా ఉన్న వాట్సన్‌ ఢిల్లీ క్యాపిటల్స్‌కు అసిస్టెంట్‌ కోచ్‌గా వ్యవహరించే అవకాశం లభించింది. ఢిల్లీ క్యాపిటల్స్‌ ప్రధాన కోచ్‌ రికీ పాంటింగ్‌ స్వయంగా వాట్సన్‌ను సిఫార్సు చేయడంతో ఢిల్లీ క్యాపిటల్స్‌ అందుకు అంగీకరించినట్లు తెలుస్తోంది. త్వరలోనే సదరు ఫ్రాంచైజీ దీనికి సంబంధించి వివరాలు వెల్లడించనుంది.

కాగా ఆస్ట్రేలియన్‌ ఆల్‌రౌండర్‌గా తిరుగులేని గుర్తింపు పొందిన షేన్‌ వాట్సన్‌ ఐపీఎల్‌లోనూ తన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. 2008లో రాజస్తాన్‌ రాయల్స్‌ మొయిడెన్‌ ఐపీఎల్‌ టైటిల్‌ను గెలవడంలో వాట్సన్‌ కీలకపాత్ర పోషించాడు. ఆ తర్వాత సీఎస్‌కేకు వెళ్లిన వాట్సన్‌ 2018లో ఐపీఎల్‌ ఫైనల్లో సూపర్‌ ఇన్నింగ్స్‌ ఆడి జట్టుకు మూడో ఐపీఎల్‌ టైటిల్‌ అందించాడు. వయసు మీద పడడంతో 2020 సీజన్‌ నుంచి వాట్సన్‌ ఐపీఎల్‌కు దూరమయ్యాడు. తాజాగా అసిస్టెంట్‌ కోచ్‌ పాత్రలో వాట్సన్‌ ఐపీఎల్‌లో మరోసారి కనిపించనుండడం ఆసక్తిగా మారింది. కాగా ఈ ఏడాది ఐపీఎల్‌ సీజన్‌ను మార్చి 26 నుంచి ప్రారంభించేందుకు బీసీసీఐ కసరత్తులు జరుపుతుంది. ఇక టీమిండియా మాజీ క్రికెటర్‌ అజిత్‌ అగార్కర్‌ కూడా ఢిల్లీ క్యాపిటల్స్‌కు అసిస్టెంచ్‌ కోచ్‌గా వ్యవహరించనున్నాడు. ఇప్పటికే ఢిల్లీ ఫ్రాంచైజీ అగార్కర్‌కు సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. 

చదవండి: IPL 2022: ఐపీఎల్‌ ఫ్రాంచైజీలకు బిగ్‌ షాక్‌.. ఆస్ట్రేలియా ఆటగాళ్లు దూరం!

PSL 2022: మూడు సిక్సర్లతో మ్యాచ్‌ స్వరూపాన్ని మార్చేశాడు.. ఫలితం సూపర్‌ ఓవర్‌

మరిన్ని వార్తలు