Shikhar Dhawan: జట్టులో సీనియర్‌ను కదా.. కొంతమంది మరీ ఎక్కువగా ఆలోచిస్తారు.. అందుకే!

26 Apr, 2022 11:26 IST|Sakshi
PC: IPL/BCCI

ఐపీఎల్‌-2022లో భాగంగా చెన్నై సూపర్‌ కింగ్స్‌తో మ్యాచ్‌లో భాగంగా టీమిండియా వెటరన్‌ క్రికెటర్‌, పంజాబ్‌ కింగ్స్‌ ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ అదరగొట్టాడు. మొత్తంగా 59 బంతులు ఎదుర్కొన్న అతడు 9 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 88 పరుగులతో చివరి ద్వారా అజేయంగా నిలిచాడు. తద్వారా పంజాబ్‌ భారీ స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించి జట్టును గెలిపించడంలో తన వంతు సాయం అందించాడు. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచి సత్తా చాటాడు.

ఈ క్రమంలో మ్యాచ్‌ అనంతరం శిఖర్‌ ధావన్‌ తన ఆటతీరు, సహచర ఆటగాళ్లతో తనకున్న అనుబంధం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ మేరకు అతడు మాట్లాడుతూ.. ‘‘నా ఫిట్‌నెస్‌, ఆడే విధానంపై ఎల్లప్పుడూ దృష్టి పెడతాను. నైపుణ్యాలు మెరుగుపరచుకునేందుకు ప్రయత్నిస్తాను. ఫలితాలు వాటంతట అవే వస్తాయి. ఆరంభంలో వికెట్‌ కాస్త అనుకూలించలేదు. 

భారీ షాట్లకు యత్నించాను. కానీ కుదురలేదు. అందుకే పట్టు దొరికేంత వరకు వేచి చూశాను. ఒక్కసారి క్రీజులో నిలదొక్కుకోగానే బౌండరీలు బాదడం మొదలుపెట్టాను. నా ప్రణాళికను అమలు చేశాను. తొలుత బ్యాటింగ్‌ చేయాల్సి వచ్చినపుడు భారీ షాట్లు ఆడుతూ ప్రత్యర్థి జట్టు బౌలర్ల మీద ఒత్తిడి పెంచుతూ పోవాలి. వికెట్లు పడకుండా జాగ్రత్తపడుతూనే స్కోరు పెంచుకోవాలని మేము ముందే అనుకున్నాం’’ అని పేర్కొన్నాడు.

అదే విధంగా.. ‘‘నిజానికి జట్టులో నేనే సీనియర్‌ని కదా(నవ్వులు).. అందుకే సహచర ఆటగాళ్లు, కెప్టెన్‌కు ఫీల్డ్‌లో కూడా సలహాలు.. సూచనలు ఇస్తుంటా. యువ ఆటగాళ్లు ఒక్కోసారి మరీ ఎక్కువగా ఆలోచించి ఒత్తిడికి గురవుతారు. 

అలాంటి సమయంలో వాళ్లతో మాట్లాడి.. సానుకూల దృక్పథం పెంపొందించుకునేలా మార్గనిర్దేశనం చేస్తాను. జీవితంలోని అతి పెద్ద లక్ష్యాలను చేరుకునే క్రమంలో ఎలా ముందుకు సాగాలో చెబుతూ ఉంటాను’’ అని 36 ఏళ్ల గబ్బర్‌ వ్యాఖ్యానించాడు. ఇక పంజాబ్‌ బౌలర్‌ అర్ష్‌దీప్‌ సింగ్‌తో చిట్‌చాట్‌లో భాగంగా వాంఖడే మైదానంలో ఆడటం తనకు ఎప్పుడూ గొప్పగా అనిపిస్తుందని పేర్కొన్నాడు.

అదే విధంగా బాగా బౌలింగ్‌ చేశావంటూ అర్ష్‌దీప్‌ను అభినందించాడు. కాగా ముంబైలోని వాంఖడే మైదానంలో సోమవారం జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్‌ చెన్నైపై 11 పరుగుల తేడాతో గెలిచింది. ఈ మ్యాచ్‌లో అర్ష్‌దీప్‌ సింగ్‌ 23 పరుగులు ఇచ్చి ఒక వికెట్ పడగొట్టగా.. సందీప్‌ శర్మ ఒకటి, రిషి ధావన్‌ రెండు, కగిసో రబడ 2 వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు.

ఐపీఎల్‌ మ్యాచ్‌ 38: పంజాబ్‌ వర్సెస్‌ చెన్నై మ్యాచ్‌ స్కోర్లు
పంజాబ్‌-187/4 (20)
చెన్నై-176/6 (20)

చదవండి👉🏾 Rishi Dhawan: ఫేస్‌గార్డ్‌తో పంజాబ్‌ కింగ్స్‌ ఆల్‌రౌండర్‌.. అసలు కథ ఇదే!

మరిన్ని వార్తలు