Shimron Hetmyer: కీలక సమయంలో స్వదేశానికి రాజస్తాన్‌ రాయల్స్‌ స్టార్‌ ఆటగాడు?

8 May, 2022 10:41 IST|Sakshi
PC: IPL Twitter

రాజస్తాన్‌ రాయల్స్‌ స్టార్‌ ఆటగాడు షిమ్రోన్‌ హెట్‌మైర్‌ జట్టను వీడాడు. వ్యక్తిగత కారణాల రిత్యా హెట్‌మైర్‌ స్వదేశానికి వెళ్లాడని.. వచ్చే వారం జట్టుతో కలుస్తాడని ఆదివారం రాజస్తాన్‌ రాయల్స్‌ జట్టు మేనేజ్‌మెంట్‌ ట్విటర్‌లో తెలిపింది. హెట్‌మైర్‌ భార్య ఇటీవలే పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. పుత్రోత్సాహంతో ఉన్న హెట్‌మైర్‌.. తన బిడ్డను చూడాలని రాయల్స్‌ మేనేజ్‌మెంట్‌కు తెలిపాడు. అందుకు ఫ్రాంచైజీ అనుమతించడంతో హెట్‌మైర్‌ ఆదివారం ఉదయం తన స్వస్థలమైన గయానాకు బయలుదేరాడు.

ఈ సందర్భంగా హెట్‌మైర్‌ వీడియోనూ రాజస్తాన్‌ ట్విటర్‌లో రిలీజ్‌ చేసింది.''జీవితంలో పిల్లలు పుట్టే మధురక్షణం ఒక్కసారే వస్తుంది. ఇప్పుడు నాకు అది కలిగింది. నా బిడ్డను చూడాలనే తాపత్రయంతో ఎమర్జెన్సీ పేరుతో స్వదేశానికి వెళుతున్నా. రాజస్తాన్‌ రాయల్స్‌ డ్రెసింగ్‌ రూమ్‌లో నా జ్ఞాపకాలు ఉంటాయి. నన్ను మిస్‌ అవుతున్నానని అనుకోవద్దు.. తొందరలోనే మళ్లీ కలుస్తా'' అంటూ పేర్కొన్నాడు.

ఈ సీజన్‌లో విండీస్‌ హిట్టర్‌ హెట్‌మైర్‌ అంచనాలకు మించి రాణిస్తున్నాడు. ఇప్పటివరకు హెట్‌మైర్‌ 11 మ్యాచ్‌లాడి 291 పరుగులు సాధించాడు. 59 నాటౌట్‌ అత్యధిక స్కోరుగా ఉంది. లోయర్‌ ఆర్డర్‌లో బ్యాటింగ్‌ వస్తూ మంచి ఫినిషర్‌గా మారాడు. శనివారం పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో హెట్‌మైర్‌ మరోసారి ఫినిషర్‌ పాత్ర పోషించాడు. 190 పరుగుల లక్ష్య చేధనతో బరిలోకి దిగిన రాయల్స్‌ను హెట్‌మైర్‌ తన హిట్టింగ్‌తో గెలిపించాడు. 16 బంతుల్లోనే 31 పరుగులు నాటౌట్‌గా నిలిచి ఆకట్టుకున్నాడు. అంతకముందు జైశ్వాల్‌ 41 బంతుల్లో 68 పరుగులతో కమ్‌బ్యాక్‌ ఇన్నింగ్స్‌ ఆడాడు. ఈ ఇద్దరి రాణింపుతో రాజస్తాన్‌ రాయల్స్‌ సీజన్‌లో ఏడో విజయాన్ని సాధించడమే గాక పాయింట్ల పట్టికలో మూడోస్థానంలో నిలిచి ప్లేఆఫ్‌ రేసుకు మరింత దగ్గరైంది.

ఇక హెట్‌మైర్‌ దూరమవ్వడం జట్టుకు దెబ్బ అని చెప్పొచ్చు. అయితే ఇది తాత్కాలిక దూరం మాత్రమే కావడంతో పెద్దగా నష్టం జరిగే అవకాశం లేదు. రాజస్తాన్‌ రాయల్స్‌ మిగిలిన మూడు మ్యాచ్‌ల్లో ఒకటి గెలిచినా చాలు.. ప్లేఆఫ్స్‌కు క్వాలిఫై అవుతుంది. హెట్‌మైర్‌ వచ్చేసరికి ఒకటి లేదా రెండు మ్యాచ్‌లు మిగిలే అవకాశం ఉంది. నిబంధనల ప్రకారం హెట్‌మైర్‌ తిరిగి వచ్చి మూడురోజుల బయోబబూల్‌ పూర్తి చేసుకొని తీరాల్సిందే. 

చదవండి: Yashasvi Jaiswal: ఆడడం లేదని పక్కనబెట్టారు.. తన విలువేంటో చూపించాడు

మరిన్ని వార్తలు