'సాధారణ ఆటగాడిలా ఫీలవ్వు'.. కోహ్లికి మాజీ క్రికెటర్‌ సలహా

17 Apr, 2022 16:43 IST|Sakshi
Courtesy: IPL Twitter

పాకిస్తాన్‌ మాజీ ఆటగాడు షోయబ్‌ అక్తర్‌ ఆర్‌సీబీ స్టార్‌ బ్యాట్స్‌మన్‌ కోహ్లికి తన ఆటతీరును మార్చుకోవాలంటూ సలహా ఇచ్చాడు. ఐపీఎల్‌ 2022లో కోహ్లి తొలి రెండు మ్యాచ్‌ల్లో 40 ప్లస్‌ స్కోర్లు చేశాడు. ఆ తర్వాత వరుసగా ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో తక్కువ రన్స్‌కే వెనుదిరిగాడు. ఇందులో రెండు రనౌట్లు తన స్వయంకృతపరాథమే. సీఎస్‌కేతో మ్యాచ్‌లో థర్డ్‌ అంపైర్‌ తప్పిదంతో కోహ్లి ఎల్బీగా వెనుదిరగాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలోనే కోహ్లి ఆటతీరుపై అక్తర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 

''బాగా ఆడకపోతే కోహ్లి అయినా సరే టైమ్‌ వస్తే జట్టు నుంచి పక్కకు తప్పుకోవాల్సిందే. ఇప్పుడున్న పరిస్థితుల్లో స్టార్‌ హోదా పనికిరాదు. ఎందుకంటే ఆ జట్టులో యువ ఆటగాళ్లు ఎందరో ఉన్నారు. కోహ్లి రాణించని రోజున అతన్ని డ్రాప్‌ చేసే అవకాశాలు ఉంటాయి. కోహ్లి బుర్రలో నాకు తెలిసి ఒక 10వేల ఆలోచనలు తిరుగుతున్నట్లుగా అనిపిస్తోంది. అతను మంచి వ్యక్తి.. అంతకుమించి గొప్ప క్రికెటర్‌. కానీ ఈ మధ్యన అతని ఫోకస్ సరిగా ఉండడం లేదు.

కోహ్లి ఇప్పుడు ఫోకస్‌ కోల్పోకూడదు. ఇప్పటికే బాగా ఆడడం లేదని కోహ్లివైపు క్రికెట్‌ ఫ్యాన్స్‌  వేలెత్తి చూపిస్తున్నారు. దీన్నిబట్టి చూస్తే అతను ప్రమాదంలో ఉన్నట్లే. అందుకే ఒక విషయం చెబుతున్నా.. కోహ్లి అన్ని విషయాలు పక్కనబెట్టి ఒక సాధారణ ప్లేయర్‌గా ఫీలవ్వు.. బ్యాట్‌తో పరుగులు చేసి చూపించు. నువ్వు ఫామ్‌లోకి వస్తే ఆపడం ఎవరి తరం కాదు'' అంటూ అక్తర్‌ పేర్కొన్నాడు.  

చదవండి: ఐపీఎల్‌ 2022 సీజన్‌ కోహ్లికి కలిసిరావడం లేదా!

మరిన్ని వార్తలు