Shreyas Iyer: 'ఏం చేయాలో తెలియని స్థితి.. చివరకు సీఈవో జోక్యం'

10 May, 2022 11:18 IST|Sakshi
PC: IPL Twitter

ఐపీఎల్‌ 2022లో సోమవారం ముంబై ఇండియన్స్‌పై కేకేఆర్‌ 52 పరుగుల సూపర్‌ విక్టరీ సాధించింది. తద్వారా తమ ప్లే ఆఫ్‌ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. ఓడితే ప్లే ఆఫ్‌ అవకాశాలు గల్లంతయ్యే ప్రమాదం ఉన్న సమయంలో కేకేఆర్‌ ఫుంజుకొని కీలక విజయాన్ని అందుకుంది. సీజన్‌ ఆరంభంలో మొదటి నాలుగు మ్యాచ్‌ల్లో మూడు విజయాలతో శ్రేయాస్‌ అయ్యర్‌ సేన బలంగా కనిపించింది.

కానీ ఆ తర్వాతే పరిస్థితి పూర్తిగా రివర్స్‌ అయింది. జట్టు ఎంపికలో లోపాలు.. బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ఎవరు రావాలనే దానిపై స్పష్టత లేకపోవడం.. జట్టు సమతుల్యం దెబ్బతినేలా ప్రయోగాలు.. వెరసి ఐదు వరుస పరాజయాలతో పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానానికి పడిపోయింది. రెండుసార్లు చాంపియన్‌ అయిన కేకేఆర్‌ దారుణ ఆటతీరుపై క్రికెట్‌ ఫ్యాన్స్‌ సోషల్‌ మీడియాలో ట్రోల్‌ చేశారు.

సీజన్‌లో 10 మ్యాచ్‌లు ముగిసేసరికి మూడు విజయాలు.. ఏడు ఓటములతో కేకేఆర్‌ ప్లే ఆఫ్‌ రేసు నుంచి నిష్క్రమించినట్లే కనిపించింది. అయితే రాజస్తాన్‌ రాయల్స్‌తో​మ్యాచ్‌లో గెలిచిన కేకేఆర్‌.. ఆ తర్వాత లక్నో సూపర్‌ జెయింట్స్‌తో మ్యాచ్‌లో 75 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని మూటగట్టుకోవడంతో పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. అయితే ముంబైతో మ్యాచ్‌లో అద్బుతంగా పోరాడిన కేకేఆర్‌ విజయం అందుకొని కాస్త ఊరటనిచ్చింది.

ఇక మ్యాచ్‌ విజయం అనంతరం కేకేఆర్‌ కెప్టెన్‌ శ్రేయాస్‌ అయ్యర్‌ మాట్లాడాడు.''కీలక సమయంలో విజయం సాధించడం కాస్త ఊపిరినిచ్చింది. వరుసగా ఐదు పరాజయాలు మమ్మల్ని బాగా కుంగదీశాయి. తుది జట్టు ఎంపిక పెద్ద తలనొప్పిగా మారిపోయింది. ఈ మ్యాచ్‌ ఆడడం లేదంటూ ఆటగాళ్లకు స్వయంగా చెప్పడం బాధ కలిగించేది. కొన్నిసార్లు తుది జట్టు ఎంపికలో జట్టు సీఈవో వెంకీ మైసూర్‌ కూడా ఇన్వాల్వ్‌ అయ్యాడు. జట్టు ఎంపికలో అతనిచ్చిన సలహాలు కూడా మాకు ఉపయోగపడ్డాయి.

ముంబైతో మ్యాచ్‌లో ఐదు మార్పులతో బరిలోకి దిగి మళ్లీ విజయాన్ని సాధించాం. ప్రస్తుతం జట్టుపై ఒక కూర్పు వచ్చింది. ఇకపై మార్పులు ఉండకపోవచ్చు. లక్నోతో జరిగిన గత మ్యాచ్‌లో మేము భారీ తేడాతో ఓడిపోయాం. ఆ తప్పును కప్పిపుచ్చేందుకు ముంబైపై పెద్ద విజయాన్ని సాధించాలనుకున్నాం. వెంకటేశ్‌ అయ్యర్‌ దూకుడు మాకు కలిసొచ్చింది. మంచి స్ట్రైక్‌ రొటేట్‌ చేసిన అతను కీలక సమయంలో రాణించాడు. మా బౌలర్లు కూడా మంచి ప్రదర్శనతో కమ్‌బ్యాక్‌​ ఇచ్చారు.'' అంటూ చెప్పుకొచ్చాడు.

చదవండి: Surya Kumar Yadav: 'ఈ సీజన్‌ మాకు కలిసిరాలేదు'.. సూర్యకుమార్‌ ఎమోషనల్‌ పోస్ట్‌

Rohit Sharma: థర్డ్‌ అంపైర్‌ తప్పుడు నిర్ణయం.. రోహిత్‌ శర్మ ఔట్‌పై వివాదం

Poll
Loading...
మరిన్ని వార్తలు