‘అమ్మ చెప్పింది.. శ్రేయస్‌ అయ్యర్‌ నన్ను పెళ్లి చేసుకుంటావా?’

19 Apr, 2022 09:28 IST|Sakshi
కేకేఆర్‌ కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌(PC: IPL/BCCI)

IPL 2022 RR Vs KKR- శ్రేయస్‌ అయ్యర్‌.. టీమిండియా మిడిలార్డర్‌ బ్యాటర్‌గా... కోల్‌కతా నైట్‌రైడర్స్‌ కెప్టెన్‌గా.. భారత యువ ఆటగాళ్లలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నాడు. రోజురోజుకూ ఆట తీరును మెరుగుపరచుకుంటూ ఒక్కో మెట్టు ఎక్కుతున్నాడు. ఇటు బ్యాటర్‌గా.. అటు సారథిగా తనదైన శైలిలో దూసుకుపోతున్నాడు. ఇక అద్భుతమైన షాట్లతో పాటు స్టైలిష్‌ లుక్‌తో ఆకట్టుకునే 27 ఏళ్ల ఈ యువ క్రికెటర్‌కు ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఎక్కువే. 


PC: KKR Twitter

అందునా లేడీ ఫ్యాన్స్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక పై ఫొటోలో కనిపించే అమ్మాయి మాత్రం అందరిలాంటి అభిమాని కాదు. ఆమెకు శ్రేయస్‌ అంటే మాటల్లో చెప్పలేనంత ఇష్టం. అంతేనా.. వీలైతే అతడిని తన జీవిత భాగస్వామిగా పొందాలన్న ఆరాటం. అందుకే తనకు శ్రేయస్‌ మీద ఉన్న ప్రేమను బహిరంగంగానే ప్రకటించింది ఈ అమ్మాయి. ‘‘అబ్బాయిని వెతుక్కోమని మా అమ్మ చెప్పింది. మరి నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా శ్రేయస్‌ అయ్యర్‌?’’ అన్న అక్షరాలు రాసి ఉన్న ప్లకార్డుతో ఆమె.. అయ్యర్‌కు పెళ్లి ప్రపోజల్‌ పెట్టింది.

రాజస్తాన్‌ రాయల్స్‌తో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ మ్యాచ్‌ సందర్భంగా ఈవిధంగా అయ్యర్‌ పట్ల తన మనసులోని భావాలను ఆమె బయటపెట్టింది. ఇందుకు సంబంధించిన ఫొటోను కేకేఆర్‌ తమ అధికారిక ట్విటర్‌లో షేర్‌ చేసింది. ఈ క్రమంలో.. ‘అయ్యర్‌ భాయ్‌ నో చెప్తాడు. ఎందుకంటే తన దృష్టి మొత్తం ఇప్పుడు ఆట మీదే ఉంది. అయినా నువ్వు ఎవరమ్మా? భలేగా ప్రపోజ్‌ చేశావు!’’ అంటూ శ్రేయస్‌ ఫ్యాన్స్‌ సరదాగా కామెంట్లు చేస్తున్నారు. 

ఇక మ్యాచ్‌ విషయానికొస్తే.. ఆఖరి వరకు నువ్వా నేనా అన్నట్లుగా ఉత్కంఠగా సాగిన పోరులో కేకేఆర్‌పై రాజస్తాన్‌దే పైచేయి సాధించింది. చహల్‌ మాయాజాలంతో ఏడు పరుగుల తేడాతో శ్రేయస్‌ అయ్యర్‌ బృందానికి ఓటమి తప్పలేదు.

రాజస్తాన్‌ రాయల్స్‌ వర్సెస్‌ కోల్‌కతా నైట్‌రైడర్స్‌ మ్యాచ్‌ స్కోర్లు:
రాజస్తాన్‌- 217/5 (20)
కోల్‌కతా- 210 (19.4)

చదవండి: IPL 2022: ‘నాలుగు’ పరుగెత్తారు...! మీరు సూపర్‌!

మరిన్ని వార్తలు