Shreyas Iyer: ఢిల్లీ జట్టును వీడనున్న మాజీ కెప్టెన్‌.. ఆ పాత్రపై ఆసక్తి!

29 Oct, 2021 14:03 IST|Sakshi

Shreyas Iyer likely to leave Delhi Capitals to get leadership role in IPL 2022: టీమిండియా ఆటగాడు శ్రేయస్‌ అయ్యర్‌కు సంబంధించిన ఆసక్తికర వార్త వెలుగులోకి వచ్చింది. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న అయ్యర్‌... త్వరలోనే ఆ జట్టును వీడనన్నట్లు తెలుస్తోంది. వచ్చే సీజన్‌లో అతడు ఢిల్లీ జెర్సీలో కనిపించకపోవచ్చనే సంకేతాలు వస్తున్నాయి. కాగా 2018లో భారత మాజీ ఓపెనర్‌ గౌతం గంభీర్‌ అర్ధంతరంగా ఢిల్లీ క్యాపిటల్స్‌ సారథ్య బాధ్యతల నుంచి తప్పుకోగా.. శ్రేయస్‌ అయ్యర్‌ అతడి స్థానాన్ని భర్తీ చేశాడు.

ఈ క్రమంలో ఐపీఎల్‌-2020 సీజన్‌లో ఢిల్లీని ఫైనల్‌కు చేర్చి కెప్టెన్‌గా తానేమిటో నిరూపించుకున్నాడు. అయితే, ఇంగ్లండ్‌తో స్వదేశంలో జరిగిన వన్డే సిరీస్‌ సందర్భంగా శ్రేయస్‌ అయ్యర్ గాయపడిన తర్వాత పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి‌. ఇంగ్లండ్‌తో సిరీస్‌తో పాటు ఐపీఎల్‌-2021 మొదటి దశకు కూడా అతడు దూరమయ్యాడు.

ఈ నేపథ్యంలో టీమిండియా యువ ఆటగాడు రిషభ్‌ పంత్‌కు ఢిల్లీ ఫ్రాంఛైజీ సారథ్య బాధ్యతలు అప్పజెప్పింది. యూఏఈ అంచెకు శ్రేయస్‌ అందుబాటులోకి వచ్చినా పంత్‌నే కెప్టెన్‌గా కొనసాగించింది. ఈ క్రమంలో మేనేజ్‌మెంట్‌ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ పంత్‌... ఢిల్లీని ఈ ఏడాది టేబుల్‌ టాపర్‌గా నిలబెట్టాడు. కానీ.. ఫైనల్‌కు మాత్రం చేర్చలేకపోయాడు. 

మరోవైపు.. శ్రేయస్‌ అయ్యర్‌ మాత్రం బ్యాటర్‌గా మెరుగ్గానే రాణించాడు. ఐపీఎల్‌-2021 రెండో దశలో భాగంగా 8 మ్యాచ్‌లలో 8 ఇన్నింగ్స్‌ ఆడిన అతడు 175 పరుగులు చేశాడు. ఇదిలా ఉంటే.. ఐపీఎల్‌-2022లో రెండు కొత్త జట్లు లక్నో, అహ్మదాబాద్‌ వచ్చి చేరనున్నాయి. ఈ క్రమంలో ఢిల్లీకి కెప్టెన్‌ అయ్యే అవకాశాలు కనిపించడం లేదు కాబట్టి... జట్టును వీడాలని అయ్యర్‌ భావిస్తున్నాడట. కొత్త జట్లు లేదంటే.. సారథి కోసం చూస్తున్న సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు వంటి ఏదో ఒక జట్టుకు కెప్టెన్‌ అయ్యే అవకాశాలను పరిశీలిస్తున్నాడట. 

మరిన్ని వార్తలు