IPL 2022 KKR Elimination: ఐపీఎల్‌-2022.. కేకేఆర్‌ అవుట్‌.. నేనేమీ బాధపడటం లేదు: శ్రేయస్‌

19 May, 2022 10:44 IST|Sakshi
కేకేఆర్‌ కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌(PC: IPL/BCCI)

IPL 2022 KKR Vs LSG: Shreyas Iyer Comments- ‘‘నేను ఏమాత్రం బాధపడటం లేదు. నేను ఆడిన అత్యుత్తమ మ్యాచ్‌లలో ఇది కూడా ఒకటి. మా జట్టు పట్టుదలగా పోరాడిన తీరు అత్యద్భుతం. ముఖ్యంగా రింకూ మమ్మల్ని గెలిపించేందుకు తీవ్రంగా పోరాడాడు. కానీ దురదృష్టవశాత్తూ అలా జరుగలేదు. తను చాలా నిరాశకు లోనయ్యాడు’’ అంటూ కోల్‌కతా నైట్‌రైడర్స్‌ కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ ఉద్వేగానికి గురయ్యాడు. 

రింకూ సింగ్‌ గెలుపుతో ముగించి హీరోగా నిలుస్తాడని భావించానని, ఏదేమైనా తన అద్భుత ఇన్నింగ్స్‌ తనను ఆకట్టుకుందని తెలిపాడు. కీలక మ్యాచ్‌లో తమ జట్టు ఆట తీరు పట్ల సంతృప్తిగానే ఉన్నట్లు పేర్కొన్నాడు. కాగా ఐపీఎల్‌-2022 ప్లే ఆఫ్స్‌ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో కేకేఆర్‌ ఓటమి పాలైన సంగతి తెలిసిందే. 

ఆఖరి వరకు నరాలు తెగే ఉత్కంఠను పెంచిన ఈ మ్యాచ్‌లో లక్నో సూపర్‌ జెయింట్స్‌ చేతిలో శ్రేయస్‌ సేన 2 పరుగుల తేడాతో పరాజయం చెందింది. దీంతో ప్లే ఆఫ్స్‌ రేసు నుంచి నిష్క్రమించింది. ఈ నేపథ్యంలో ఓటమిపై స్పందించిన కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌.. ‘‘చావో రేవో తేల్చుకోవాల్సిన పరిస్థితిలో పవర్‌ప్లేలోనే రెండు వికెట్లు కోల్పోయిన దశలోనూ.. ఆఖరి వరకు మేము పోరాడిన తీరు ప్రత్యర్థి జట్టును ఒత్తిడిలోకి నెట్టింది.

నిజానికి ఈ సీజన్‌ను మేము ఘనంగా ఆరంభించాం. కానీ వరుసగా ఐదు మ్యాచ్‌లు ఓడటం.. గాయాల బెడద కారణంగా బ్యాటింగ్‌ ఆర్డర్‌ మార్చడం తీవ్ర ప్రభావం చూపాయి’’ అంటూ జట్టు వైఫల్యాలకు గల కారణాలపై కీలక వ్యాఖ్యలు చేశాడు. అదే విధంగా.. ‘‘ఈ సీజన్‌తో రింకూ లాంటి గొప్ప ఆటగాడు మాకు దొరికాడు. డ్రెస్సింగ్‌ రూమ్‌లో సానుకూల వాతావరణం ఉండేది.

ముఖ్యంగా కోచ్‌ మెకల్లమ్‌.. ఎలాంటి పరిస్థితుల్లోనైనా మాకు అండగా నిలిచేవారు. ఆయనకు మేమంతా సమానమే. ఒకరు ఎక్కువ.. ఒకరు తక్కువ భావన అస్సలు ఉండదు. ఏ సమయంలో నైనా మాకు కావాల్సిన సహాయం చేయడానికి, సూచనలు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారు’’ అని సహచర ఆటగాళ్లు, కోచ్‌తో తన అనుబంధం గురించి చెప్పుకొచ్చాడు.

కాగా ఐపీఎల్‌-2022లో కేకేఆర్‌ 14 మ్యాచ్‌లలో కేవలం ఆరింట గెలిచి 12 పాయింట్లు సాధించింది. తద్వారా ఆరో స్థానానికి పరిమితమైంది. తొలిసారిగా కేకేఆర్‌ పగ్గాలు చేపట్టిన శ్రేయస్‌ అయ్యర్‌కు నిరాశను మిగిల్చింది.

చదవండి👉🏾LSG VS KKR: డికాక్‌, రాహుల్‌ విధ్వంసం ధాటికి బద్దలైన రికార్డులు ఇవే..!

Poll
Loading...
మరిన్ని వార్తలు