IPL 2022- Sourav Ganguly: ఈ ఏడాది ఐపీఎల్‌ నిర్వహణ అక్కడే.. లీగ్‌ మ్యాచ్‌లేమో: గంగూలీ

3 Feb, 2022 13:17 IST|Sakshi

ఐపీఎల్‌-2022 నిర్వహణ ఎక్కడ అన్న సందేహాలకు భారత క్రికెట్‌ నియంత్రణ మండలి అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ తెరదించారు. టోర్నీ మొత్తం భారత్‌లోనే నిర్వహించనున్నట్లు స్పష్టం చేశారు. అయితే, కోవిడ్‌ వ్యాప్తి, కేసుల పెరుగుదల అంశంపై ఈ విషయం ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు. కాగా క్యాష్‌ రిచ్‌ లీగ్‌ మెగా వేలానికి బీసీసీఐ సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే.

బెంగళూరులో ఫిబ్రవరి 12, 13 తేదీల్లో ఆక్షన్‌ నిర్వహించనున్నారు. ఇక భారత్‌లో కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఐపీఎల్‌-2022ను యూఏఈ లేదంటే దక్షిణాఫ్రికా, శ్రీలంక తదితర దేశాల్లో నిర్వహిస్తారంటూ ఊహాగానాలు వినిపిస్తున్న విషయం విదితమే.  ఈ క్రమంలో స్పోర్ట్స్‌ స్టార్‌తో మాట్లాడిన గంగూలీ... ‘‘ఈ ఏడాది ఐపీఎల్‌ భారత్‌లోనే నిర్వహిస్తాం. అయితే, కరోనా విజృంభణ తారస్థాయికి చేరనంత వరకే!

వేదికల విషయానికొస్తే.... మహారాష్ట్రలోని ముంబై, పుణెలో మ్యాచ్‌లు నిర్వహించాలనే యోచనలో ఉన్నాం. నాకౌట్‌ దశకు త్వరలోనే వేదికను ఖరారు చేస్తాం’’ అని పేర్కొన్నారు. ఒకవేళ కరోనా కేసులు పెరిగితే మాత్రం భారత్‌ నుంచి వేదికను మార్చే అవకాశం ఉందని పరోక్షంగా వెల్లడించారు.

కాగా ముంబైలోని వాంఖడే, డీవై పాటిల్‌, సీసీఐతో పాటు పుణెలోని స్టేడియంలో ఐపీఎల్‌ లీగ్‌ మ్యాచ్‌లు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఇక అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ప్లే ఆఫ్‌ మ్యాచ్‌లను నిర్వహించేందుకు బీసీసీఐ సిద్ధమవుతోందని జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఇదిలా ఉండగా కొత్తగా రెండు జట్లు లక్నో, అహ్మదాబాద్‌ రాకతో ఐపీఎల్‌ 2022 సీజన్‌లో 74 లీగ్‌ మ్యాచ్‌లు జరుగనున్న సంగతి తెలిసిందే. 

చదవండి: IPL 2022 Mega Auction: వేలంలో అత‌డికి ఏకంగా రూ.11 కోట్లు.. అయ్య‌ర్‌కి మ‌రీ ఇంత త‌క్కువా!

మరిన్ని వార్తలు