IPL 2022: నాకు నేనే రోల్‌ మోడల్‌.. ప్రపంచంలో అత్యుత్తమ బౌలర్లు వాళ్లే: ఉమ్రాన్‌ మాలిక్‌

20 Apr, 2022 13:21 IST|Sakshi
ఉమ్రాన్‌ మాలిక్‌(PC: IPL/BCCI)

IPL 2022- SRH Umran Malik Comments: ఉమ్రాన్‌ మాలిక్‌.. గత సీజన్‌లో నెట్‌బౌలర్‌గా వచ్చి సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టులో కీలక ఆటగాడిగా ఎదిగాడు. నటరాజన్‌ స్థానంలో జట్టులోకి వచ్చిన అతడు ఏకంగా ఇప్పుడు టీమ్‌లో తన స్థానం సుస్థిరం చేసుకున్నాడు. అరంగేట్ర మ్యాచ్‌లోనే అ‍త్యంత వేగవంతంగా(సుమారు గంటకు 153 కి.మీ.) బంతిని విసిరి చరిత్ర సృష్టించిన ఈ కశ్మీరీ ఫాస్ట్‌ బౌలర్‌.. ఐపీఎల్‌-2022లోనూ అదరగొడుతున్నాడు. 

ఇప్పటి వరకు ఆడిన ఆరు మ్యాచ్‌లలో 9 వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. ఇక గంటకు 145-150 కిమీ వేగంతో బౌలింగ్‌ చేస్తూ నిలకడగా రాణిస్తున్న ఉమ్రాన్‌ మాలిక్‌ త్వరలోనే భారత జట్టులో చోటు దక్కించుకుంటాడంటూ క్రికెట్‌ దిగ్గజాలు ప్రశంసలు కురిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఎన్డీటీవీతో మాట్లాడిన ఉమ్రాన్‌.. టీమిండియాకు ఆడాలన్న తన కల నెరవేరే రోజు త్వరగా రావాలని కోరుకుంటున్నట్లు తెలిపాడు.

ఈ మేరకు అతడు మాట్లాడుతూ.. ‘‘సహజంగానే నేను బంతిని వేగంగా విసురుతాను. నాకు నేనే రోల్‌ మోడల్‌. ఇర్ఫాన్‌ పఠాన్‌ మాకు ట్రెయినింగ్‌ ఇవ్వడానికి వచ్చినపుడు ఆయన నుంచి చాలా నేర్చుకున్నా. బంతిని సరైన చోట వేయడం ఎలాగో తెలుసుకున్నా. దేశం తరఫున ఆడాలన్నది నా కల. బాగా రాణించి జమ్మూ- కశ్మీర్‌ను, దేశ ప్రజలను గర్వపడేలా చేస్తాను’’ అని ఉద్వేగపూరిత వ్యాఖ్యలు చేశాడు. 

ఇక తన గురించి దిగ్గజాలు ట్వీట్‌ చేయడం గురించి ఉమ్రాన్‌ చెబుతూ.. ‘‘వాళ్లంతా నాపై ప్రశంసలు కురిపించడం పట్ల గర్వంగా ఉంది. కచ్చితంగా నాలో ఉన్న ప్రతిభను గుర్తించే దిగ్గజాలు ఈవిధంగా ట్వీట్లు చేస్తున్నారు కదా! అది నాకు ఉత్సాహాన్నిస్తుంది. ప్రస్తుత క్రికెట్‌ ప్రపంచంలో​ జస్‌ప్రీత్‌ బుమ్రా, మహ్మద్‌ షమీ, భువనేశ్వర్‌ కుమార్‌.. ఈ ముగ్గురే అత్యుత్తమ బౌలర్లు’’ అని పేర్కొన్నాడు.

అదే విధంగా.. తాను ఈ స్థాయికి చేరుకోవడం వెనుక తన తల్లిదండ్రుల ప్రోత్సాహం, తన సోదరి మద్దతు ఉందని ఉమ్రాన్‌ చెప్పుకొచ్చాడు. ఇక ఇటీవల పంజాబ్‌ కింగ్స్‌తో మ్యాచ్‌లో ఉమ్రాన్‌ అదరగొట్టిన సంగతి తెలిసిందే. 20వ ఓవర్‌ వేసిన అతడు.. ఆ ఓవర్‌ను మెయిడెన్‌ చేయడం సహా రనౌట్‌తో పాటు మూడు వికెట్లు తీశాడు. ఓవరాల్‌గా తన కెరీర్‌లో బెస్ట్‌ గణాంకాలు (4-1-28-4) నమోదు చేశాడు.
చదవండి: IPL 2022: కోహ్లి కాదు.. ఇప్పుడు డుప్లెసిస్‌ స్టార్‌ అయ్యాడు! కేవలం ఆటగాడినన్న విషయం గ్రహించి..

మరిన్ని వార్తలు