IPL 2022: కెప్టెన్‌వి అని అహంకారమా? నీకసలు ఆ అర్హతే లేదు! మరీ ఇంత అతి పనికిరాదు!

12 Apr, 2022 09:10 IST|Sakshi
గుజరాత్‌ కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా(PC: IPL/BCCI)

హార్దిక్‌ పాండ్యాపై విరుచుకుపడుతున్న నెటిజన్లు

IPL 2022 SRH Vs GT: గుజరాత్‌ టైటాన్స్‌ కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా తీరుపై నెటిజన్లు మండిపడుతున్నారు. హార్దిక్‌లో నాయకుడి లక్షణాలు లేవని, జట్టు సభ్యుల పట్ల అమర్యాదగా ప్రవర్తించడం సరికాదని విమర్శిస్తున్నారు. అసలు కెప్టెన్సీ చేయడానికి అతడు అర్హుడే కాదంటూ ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. వారి ఆగ్రహావేశాలకు కారణం లేకపోలేదు. ఐపీఎల్‌-2022లో భాగంగా గుజరాత్‌ టైటాన్స్‌ సోమవారం సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో మ్యాచ్‌ ఆడింది.

టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన పాండ్యా బృందం నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. ఈ క్రమంలో లక్ష్య ఛేదనకు దిగిన సన్‌రైజర్స్‌ ఆది నుంచి దూకుడు ప్రదర్శించింది. ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ(42)తో కలిసి కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌(57) హైదరాబాద్‌కు అదిరిపోయే ఆరంభం అందించాడు. ముఖ్యంగా విలియమ్సన్‌ గుజరాత్‌ బౌలర్లకు చుక్కలు చూపించాడు. వన్‌డౌన్‌లో వచ్చిన రాహుల్‌ త్రిపాఠి సైతం విలియమ్సన్‌కు తోడుగా నిలబడ్డాడు.

ఈ క్రమంలో 13వ ఓవర్‌లో స్వయంగా రంగంలోకి దిగిన హార్దిక్‌ పాండ్యాకు చేదు అనుభవం ఎదురైంది. ఓవర్‌ రెండు, మూడో బంతుల్లో విలియమ్సన్‌ వరుస సిక్సర్లు బాదాడు. ఆ తర్వాత సన్‌రైజర్స్‌కు వరుసగా రెండు, ఒక పరుగు వచ్చాయి. ఈ క్రమంలో స్ట్రైక్‌ తీసుకున్న త్రిపాఠి అప్పర్‌ కట్‌ షాట్‌ ఆడాడు. అది కాస్త డీప్‌ థర్డ్‌ మ్యాన్‌ దిశగా బంతి దూసుకుపోయింది.

అయితే, అక్కడే ఉన్న మహ్మద్‌ షమీ క్యాచ్‌ అందుకోవడంలో విఫలమయ్యాడు. అతడు కాస్త ముందుకు వస్తే వికెట్‌ దొరికే అవకాశం ఉండేది. కానీ వెనక్కి జరిగిన షమీ బంతిని అందుకుని బ్యాటర్‌కు ఎక్కువ పరుగులు దొరకకుండా అడ్డుకట్ట వేశాడు. దీంతో క్యాచ్‌ మిస్‌ అయినా, సన్‌రైజర్స్‌కు ఒకే ఒక్క పరుగు వచ్చింది.

అయితే, షమీ క్యాచ్‌ డ్రాప్‌ చేయడంతో హార్దిక్‌ పాండ్యా సహనం కోల్పోయాడు. అతడి మీదకు అరుస్తూ అసహనం ప్రదర్శించాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలో హార్దిక్‌ను ఉద్దేశించి.. ‘‘సన్‌రైజర్స్‌ జట్టులో అభిషేక్‌ శర్మ, రాహుల్‌ త్రిపాఠి వంటి వాళ్లు క్యాచ్‌లు వదిలేశారు. అయినా కేన్‌ విలియమ్సన్‌ సంయమనం పాటించాడు.

కానీ నువ్వు.. టీమిండియాలో సీనియర్‌ అయిన షమీ మీదకు అరుస్తావా? కెప్టెన్‌ అయ్యానని అహంకారమా? తను క్యాచ్‌ పట్టకపోయి ఉండవచ్చు.. పరుగులు సేవ్‌ చేశాడు కదా! అసలు నీకు కెప్టెన్‌గా ఉండే అర్హత లేదు. షమీ భారత జట్టుకు చేసిన సేవ గురించి నీకేం తెలుసు? భావోద్వేగాలు సహజమే.. కానీ మరీ ఇంత అతి పనికిరాదు. ధోనితో పోటీ పడతా అన్నావు కదా! అతడు మిస్టర్‌ కూల్‌ అన్న విషయం గుర్తుపెట్టుకో’’ అంటూ ఘాటు కామెంట్లు చేస్తున్నారు.

అయితే, మరికొంత మంది మాత్రం.. ‘‘​‍కీలక సమయంలో ఇలా క్యాచ్‌లు జారవిడిస్తే.. అక్కడ ఉన్నది సీనియరా, జూనియరా అని చూడరు. జట్టుకు నష్టం జరుగుతుందంటే ఎవరైనా ఇలాగే స్పందిస్తారు. అయితే, హార్దిక్‌ కాస్త ఓపిక పట్టాల్సింది’’ అని అతడికి మద్దతుగా నిలుస్తున్నారు.  ఇక ఈ మ్యాచ్‌లో గుజరాత్‌ 8 వికెట్ల తేడాతో ఓడి తొలి పరాజయం నమోదు చేసింది.

మరిన్ని వార్తలు