IPL 2022 SRH Vs LSG: ఐపీఎల్ క‌ప్ కావాలా? లేదంటే ఆరెంజ్ క్యాప్ కావాలా?

5 Apr, 2022 09:41 IST|Sakshi
ల‌క్నో సూప‌ర్‌జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్‌(PC: IPL/BCCI)

IPL 2022 SRH Vs LSG- KL Rahul: కేఎల్ రాహుల్‌.. ఐపీఎల్‌లో బ్యాట‌ర్‌గా ఈ టీమిండియా వైస్ కెప్టెన్‌కు ఉన్న‌ రికార్డు గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. అయితే, కెప్టెన్‌గా మాత్రం అత‌డు ఆక‌ట్టుకోలేక‌పోయాడు. ఐపీఎల్‌-2021 సీజ‌న్ వ‌ర‌కు పంజాబ్ కింగ్స్ కు సార‌థ్యం వ‌హించిన రాహుల్‌.. తాజా సీజ‌న్ లో కొత్త జ‌ట్టు ల‌క్నో సూప‌ర్‌జెయింట్స్  ప‌గ్గాలు చేప‌ట్టాడు. 

ఇక రాహుల్ కెప్టెన్సీలో ఆరంభ మ్యాచ్‌లో మ‌రో కొత్త జ‌ట్టు గుజ‌రాత్ టైటాన్స్ తో త‌ల‌ప‌డ్డ  ల‌క్నో ఓట‌మి పాలైన విష‌యం తెలిసిందే. అయితే, ఆ త‌ర్వాత చెన్నై సూప‌ర్ కింగ్స్ పై విజ‌యం సాధించి స‌త్తా చాటింది. అదే విధంగా సోమ‌వారం నాటి మ్యాచ్‌లో సన్ రైజ‌ర్స్  రెండో గెలుపు న‌మోదు చేసింది.  ఇక ఈ మూడు మ్యాచ్‌ల‌లో క‌లిపి రాహుల్ సాధించిన ప‌రుగులు 108. అత్య‌ధిక స్కోరు 68.

మొద‌టి మ్యాచ్‌లో డ‌కౌట్‌. రెండో మ్యాచ్‌లో 26 బంతులు ఎదుర్కొని 2 ఫోర్లు, మూడు సిక్స‌ర్ల సాయంతో 40 ప‌రుగులు చేశాడు రాహుల్. స్ట్రైక్ రేటు 153.85. అయితే, హైద‌రాబాద్‌తో మ్యాచ్‌లో మాత్రం ఈ స్ట్రైక్ రేటు కొన‌సాగించ‌లేక‌పోయాడు. 50 బంతుల్లో 68 ప‌రుగులు సాధించాడు. ఇందులో ఆరు ఫోర్లు, ఒక సిక్స‌ర్ ఉన్నాయి. రాహుల్ ప్ర‌ద‌ర్శ‌న ఫ‌ర్వాలేద‌పించినా అత‌డి అభిమానులు మాత్రం అంత‌గా సంతప్తి చెంద‌డం లేదు.

దీప‌క్ హుడా (33 బంతుల్లో 51 ప‌రుగులు)ఆట తీరుతో పోలుస్తూ .. అత‌డిని ట్రోల్ చేస్తున్నారు.  19వ ఓవ‌ర్ వ‌ర‌కు క్రీజులో ఉండి కూడా దూకుడుగా ఆడ‌లేక‌పోయాడ‌ని, త‌మ అంచనాలు అందుకోలేదంటూ కామెంట్లు చేస్తున్నారు. హోల్డ‌ర్‌, దీప‌క్‌, బ‌దోని ఉన్నా రిస్క్ తీసుకోలేక‌పోయాడని విమ‌ర్శిస్తున్నారు. ఆవేశ్, హోల్డ‌ర్ రాణించి ఉండ‌క‌పోతే ఫ‌లితం వేరేలా ఉండేద‌ని ట్రోల్ చేస్తున్నారు. "నువ్వు ఐపీఎల్ క‌ప్ కోసం ఆడుతున్నావా లేదంటే ఆరెంజ్ క్యాప్ కోస‌మా.. స్టైల్ మార్చు బాసూ.." అంటూ సోష‌ల్ మీడియా వేదిక‌గా విజ్ఞ‌ప్తి చేస్తున్నారు.  

అయితే, మ‌రికొంత మంది మాత్రం రాహుల్ ఆచితూచి ఆడాడు కాబ‌ట్టే లక్నో మంచి స్కోరు చేయ‌గ‌లిగిందని, అటు పిమ్మ‌ట‌ ఆవేశ్ ఖాన్ (4/24), హోల్డర్‌ (3/34) చెల‌రేగ‌డంతో విజ‌యం సాధించింద‌ని, అత‌డికి మ‌ద్ద‌తు తెలుపుతున్నారు. కాగా ఐపీఎల్ 2020 సీజన్లో 14 మ్యాచ్‌ల‌లో క‌లిపి 670 ప‌రుగులు చేసిన కేఎల్ రాహుల్ ఆరెంజ్ క్యాప్ గెల్చ‌కున్న సంగ‌తి తెలిసిందే. స‌గ‌టు 55.83. స్ట్రైక్ రేటు 129.34.

>
మరిన్ని వార్తలు