IPL 2022 SRH Vs LSG: అంతా మీరే చేశారు... సీజ‌న్ మొత్తం ఇదే కంటిన్యూ అవుతుంది!

5 Apr, 2022 08:17 IST|Sakshi
PC: IPL/ BCCI

IPL 2022 SRH Vs LSG: ఐపీఎల్‌ మెగా వేలం మొద‌లు సీజన్ ఆరంభ‌మైన‌ప్ప‌టి నుంచి సన్ రైజ‌ర్స్ హైద‌రాబాద్  ఫ్యాన్స్ ఆగ్ర‌హానికి గుర‌వుతూనే ఉంది. తాజా ఎడిష‌న్ ఆరంభ మ్యాచ్‌లో రాజ‌స్తాన్ రాయ‌ల్స్ చేతిలో ఏకంగా 61 ప‌రుగుల తేడాతో ఓట‌మి.. కోట్లు పోసి ఏరికోరి కొన్న వెస్టిండీస్ హిట్ట‌ర్ నికోల‌స్ పూర‌న్ ఆ మ్యాచ్‌లో డ‌కౌట్‌.

ఎయిడెన్ మార్క‌ర‌మ్, వాషింగ్ట‌న్ సుంద‌ర్ త‌ప్ప ఎవ‌రూ పెద్ద‌గా రాణించ‌లేదు. దీంతో.. "ఎవ‌రైనా గెలిచేందుకు స‌మ‌ష్టిగా పోరాడ‌తారు.. కానీ మ‌న వాళ్లు ఓట‌మిని మూట‌గ‌ట్టుకోవ‌డంలో త‌మ వంతు పాత్ర పోషించ‌డంలో పోటీ ప‌డ‌తారు" అంటూ ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్ గుర్రుమ‌న్నారు.

ఇక లక్నో సూపర్‌జెయింట్స్ జ‌రిగిన తాజా మ్యాచ్‌ విష‌యానికొస్తే.. ఆరంభంలో ఆశ‌లు రేపినా చివ‌ర్లో  ప‌రాజ‌యం పాలై మాకిది ష‌రా మామూలే అని నిరూపించారు స‌న్ రైజ‌ర్స్ ఆట‌గాళ్లు. రాహుల్ త్రిపాఠి, నికోల‌స్ పూర‌న్ మిన‌హా ఎవ‌రూ కనీసం 20 ప‌రుగులు కూడా చేయ‌లేక‌పోయారు. ఫ‌లితంగా 12 ప‌రుగుల తేడాతో సీజ‌న్‌లో త‌మ రెండో మ్యాచ్ లోనూ ఓట‌మి పాలై విమ‌ర్శ‌లు మూట‌గ‌ట్టుకుంటోంది. 

ఈ నేప‌థ్యంలో ఎస్ఆర్‌హెచ్ యాజ‌మాన్యంపై అభిమానులు విమ‌ర్శ‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. ముఖ్యంగా జ‌ట్టు సీఈఓ కావ్యా మార‌న్ ను సోష‌ల్ మీడియా వేదిక‌గా ట్రోల్ చేస్తున్నారు. "మొత్తం మీరే చేశారు. ఒక్క సీజన్లో విఫ‌ల‌మైందుకు డేవిడ్ వార్న‌ర్ భాయ్ ను అవ‌మాన‌క‌ర రీతిలో బ‌య‌ట‌కు పంపించారు. ర‌షీద్ ఖాన్ ను రిటైన్ చేసుకోలేదు. బెయిర్ స్టోను వ‌దిలేశారు. జ‌ట్టును నాశనం ప‌ట్టించారు అంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

ఇక మ్యాచ్ సంద‌ర్భంగా కావ్య‌ హావ‌భావాలకు సంబంధించిన ఫొటోలు షేర్ చేస్తూ.. ""ఈ సీజ‌న్ మొత్తం మీ ఎక్స్ ప్రెష‌న్స్ ఇలాగే ఉండ‌బోతున్నాయి. రాసి పెట్టుకోండి. హిట్ట‌ర్లు లేరు. ఎస్ఆర్ హెచ్ లో ఈ ఆట‌గాడిపై మ‌నం ఆధార‌ప‌డ‌గ‌లం అని న‌మ్మ‌కంగా ఒక్క పేరు కూడా చెప్ప‌లేం. ఏం ఆడుతున్నార్రా బాబూ.. స‌న్ రైజ‌ర్స్ కు గ‌డ్డు ప‌రిస్థితులు త‌ప్ప‌వు" అని అభిప్రాయాలు వ్య‌క్తం చేస్తున్నారు. 

చదవండి: Aakash Chopra-Chahal: 100 మీటర్లు దాటితే 8 పరుగులు.. మూడు డాట్ బాల్స్ ఆడితే ఔట్‌..!

మరిన్ని వార్తలు