SRH Vs LSG: అలా అయితే మేము గెలిచేవాళ్లం.. కానీ: విలియమ్సన్‌

5 Apr, 2022 12:32 IST|Sakshi
సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (PC: IPL/BCCI)

IPL 2022 SRH Vs LSG- Kane Williamson : ‘‘మాకు శుభారంభమే లభించింది. గత మ్యాచ్‌తో పోల్చుకుంటే మా ఆటతీరు మెరుగైంది. మా బౌలర్లు రాణించారు. బంతితో అద్భుతం చేశారు. ఒకవేళ భారీ భాగస్వామ్యా​న్ని విడగొట్టి ఉంటే మేము పటిష్ట స్థితిలోనే ఉండేవాళ్లం. కానీ అలా జరుగలేదు. ఈ క్రెడిట్‌ మొత్తం రాహుల్‌, హుడాకే చెందుతుంది. ఇక మా బ్యాటింగ్‌ విషయానికొస్తే.. నేను ఇంకాస్త మెరుగ్గా ఆడితే బాగుండేది. మేము చివరి వరకు మ్యాచ్‌ను తీసుకువెళ్లగలిగాం. కానీ.. విజయం అందుకోలేకపోయాం.

ఈ పిచ్‌పై 170 సవాలుతో కూడిన టార్గెట్‌.. అయినా మేము మా వంతు ప్రయత్నం చేయాల్సింది. పటిష్ట భాగస్వామ్యాలు నెలకొల్పాల్సింది. మా వ్యూహాలు ఈరోజు ఫలించలేదు. ఏదేమైనా మా బౌలర్లు మాత్రం అద్భుతంగా బౌల్‌ చేశారు’’ అని సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ అన్నాడు. తాము బ్యాట్‌తో రాణించి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డాడు.

కాగా లక్నో సూపర్‌జెయింట్స్‌తో సోమవారం జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ ఓటమి పాలైన సంగతి తెలిసిందే. విలియమ్సన్‌ బృందం 12 పరుగుల తేడాతో లక్నో చేతిలో ఓడి సీజన్‌లో వరుసగా రెండో పరాజయాన్ని నమోదు చేసింది. బౌలర్లు రాణించినా.. బ్యాటర్లలో రాహుల్‌ త్రిపాఠి(44), నికోలస్‌ పూరన్‌(34) మినహా ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు సాధించలేకపోయారు.

ఫలితంగా లక్నో విధించిన 170 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక సన్‌రైజర్స్‌ చతికిలపడింది. మరోవైపు.. కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌(68), దీపక్‌ హుడా(51) అద్భుత ఇన్నింగ్స్ కారణంగా లక్నో వరుసగా రెండో విజయాన్ని అందుకుంది. ఈ నేపథ్యంలో ఓటమిపై స్పందించిన విలియమ్సన్‌ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. ఇక ఈ మ్యాచ్‌లో 16 బంతులు ఎదుర్కొన్న కేన్‌ మామ 16 పరుగులు చేశాడు. ఆవేశ్‌ ఖాన్‌ బౌలింగ్‌లో పెవిలియన్‌ చేరాడు. 

చదవండి: IPL 2022 SRH Vs LSG: అంతా మీరే చేశారు... సీజ‌న్ మొత్తం ఇదే కంటిన్యూ అవుతుంది!
 

మరిన్ని వార్తలు