IPL 2022 SRH Vs PBKS: సన్‌రైజర్స్‌తో తలపడనున్న పంజాబ్‌.. ఆరెంజ్‌ ఆర్మీ కెప్టెన్‌ ఎవరంటే..!

22 May, 2022 13:19 IST|Sakshi
Photo Courtesy: IPL

ఐపీఎల్ 2022 సీజన్‌ చిట్టచివరి లీగ్‌ మ్యాచ్‌లో ఇవాళ (మే 22) సన్‌రైజర్స్‌, పంజాబ్‌ కింగ్స్‌ జట్లు తలపడనున్నాయి. ముంబైలోని వాంఖడే వేదికగా  రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్‌ ప్రారంభంకానుంది. సన్‌రైజర్స్‌, పంజాబ్‌ ఇదివరకే ప్లే ఆఫ్స్‌ రేసు నుంచి నిష్క్రమించడంతో ఈ మ్యాచ్‌ నామమాత్రంగా జరుగనుంది. ఈ సీజన్‌ ఫైనల్‌ ఫోర్‌కు గుజరాత్‌, రాజస్థాన్‌, లక్నో, ఆర్సీబీ జట్లు చేరుకోగా మిగతా జట్లు (ఢిల్లీ, కేకేఆర్‌, పంజాబ్‌, సన్‌రైజర్స్‌, సీఎస్‌కే, ముంబై) లీగ్‌ నుంచి నిష్క్రమించాయి.

సన్‌రైజర్స్‌- పంజాబ్‌ జట్లకు నేటి మ్యాచ్‌ నామమాత్రం కావడంతో భారీ ప్రయోగాలు చేసే అవకాశం ఉంది. రెగ్యులర్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ గైర్హాజరీలో ఆరెంజ్‌ ఆర్మీని భువనేశ్వర్‌ కుమార్‌ ముందుండి నడిపించే అవకాశం ఉంది. సన్‌రైజర్స్‌..  గత మ్యాచ్‌లో ముంబైని ఖంగుతినిపించిన జట్టులో నుంచి నటరాజన్‌, మార్క్రమ్‌, వాషింగ్టన్‌ సుందర్‌లకు విశ్రాంతినిచ్చి అబ్దుల్‌ సమద్‌, రొమారియో షెపర్డ్‌, గ్లెన్‌ ఫిలిప్స్‌, కార్తీక్‌ త్యాగిలకు అవకాశం కల్పించే ఛాన్స్‌ ఉంది. 

మరోవైపు పంజాబ్‌.. తమ చివరి మ్యాచ్‌లో ఢిల్లీ చేతిలో ఓడిన జట్టు నుంచి హర్ప్రీత్‌ బ్రార్‌, రిషి ధవన్‌, భానుక రాజపక్సలను తప్పించి బెన్నీ హోవెల్‌, ఇషాన్‌ పోరెల్‌, వైభవ్‌ అరోరా తుది జట్టులో ఆడించే ఛాన్స్‌ ఉంది. 

పంజాబ్‌కు షాకిచ్చిన సన్‌రైజర్స్‌..
ఇదే సీజన్‌లో ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌.. పంజాబ్‌కు భారీ షాకిచ్చింది. ఈ మ్యాచ్‌లో ఉమ్రాన్‌ మాలిక్‌ (4/28), భువనేశ్వర్‌ (3/22) రెచ్చిపోయి పంజాబ్‌ నడ్డి విరిచారు. తొలుత బ్యాటింగ్‌ చేసిన పంజాబ్‌ వీరిద్దరి ధాటికి 151 పరుగులకు చాపచుట్టేయగా.. ఛేదనలో త్రిపాఠి (34), అభిషేక్‌ శర్మ (31), మార్క్రమ్‌ (41 నాటౌట్‌), పూరన్‌ (35 నాటౌట్‌) తలో చేయి వేసి సన్‌రైజర్స్‌ను గెలిపించారు. 

క్వాలిఫయర్స్‌, ఎలిమినేటర్‌ మ్యాచ్‌లు ఇలా..
ఈడెన్‌ గార్డెన్‌ వేదికగా మే 24న జరిగే తొలి క్వాలిఫయర్‌లో గుజరాత్‌-రాజస్థాన్‌ జట్లు తలపడనుండగా, ఇదే వేదికగా మే 25న జరిగే ఎలిమినేటర్‌లో లక్నో-ఆర్సీబీ జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. అనంతరం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా మే 27న రెండో క్వాలిఫయర్‌ (క్వాలిఫయర్‌ 1లో ఓడిన జట్టు వర్సెస్‌ ఎలిమినేటర్‌ విన్నర్‌).. ఇదే వేదికగా మే 29న ఫైనల్‌ (క్వాలిఫయర్‌ 1 విన్నర్‌ వర్సెస్‌ క్వాలిఫయర్‌ 2 విన్నర్‌) మ్యాచ్‌ జరుగనుంది. 

తుది జట్లు (అంచనా)..
సన్‌రైజర్స్ హైదరాబాద్: అభిషేక్ శర్మ, ప్రియం గార్గ్, రాహుల్ త్రిపాఠి, గ్లెన్‌ ఫిలిప్స్‌, నికొలస్ పూరన్ (వికెట్ కీపర్), రొమారియో షెపర్డ్‌, అబ్దుల్‌ సమద్‌, భువనేశ్వర్ కుమార్ (కెప్టెన్‌), ఫజల్ హక్ ఫారూఖి, ఉమ్రాన్ మాలిక్, కార్తీక్‌ త్యాగి.

పంజాబ్ కింగ్స్: జానీ బెయిర్‌స్టో, శిఖర్ ధవన్, మయాంక్ అగర్వాల్ (కెప్టెన్), లియామ్ లివింగ్‌స్టొన్, బెన్నీ హోవెల్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), ఇషాన్‌ పోరెల్‌, వైభవ్‌ అరోరా, కగిసొ రబాడ, రాహుల్ చాహర్, అర్ష్‌దీప్ సింగ్.
చదవండి: ఐపీఎల్‌లో తొలి భారత బౌలర్‌గా బుమ్రా అరుదైన ఫీట్‌

మరిన్ని వార్తలు