IPL 2022: ఐదేసిన హ‌స‌రంగ‌.. సీజ‌న్ అత్యుత్త‌మ గ‌ణాంకాలు న‌మోదు

8 May, 2022 20:46 IST|Sakshi
photo courtesy: IPL

ఐపీఎల్ 2022 సీజ‌న్‌లో భాగంగా ఇవాళ (మే 8) సన్‌రైజర్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 67 పరుగుల తేడాతో ఘ‌న విజ‌యం సాధించింది.  ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ నిర్ధేశించిన 193 పరుగల లక్ష్యాన్ని ఛేదించేందుకు బ‌రిలోకి దిగిన స‌న్‌రైజ‌ర్స్‌.. హసరంగ 5 వికెట్లతో చెల‌రేగ‌డంతో 19.2 ఓవర్లలో 125 పరుగులు మాత్ర‌మే చేసి ఆలౌటైంది. 

ఈ మ్యాచ్‌లో 4 ఓవ‌ర్లు బౌల్ చేసిన హ‌స‌రంగ‌.. కేవ‌లం 18 ప‌రుగుల మాత్ర‌మే ఇచ్చి 5 వికెట్లు ప‌డగొట్టి ప్ర‌స్తుత‌ సీజ‌న్లో అత్యుత్త‌మ గ‌ణాంకాలు న‌మోదు చేశాడు. హ‌స‌రంగ‌కు ముందు ఈ రికార్డు స‌న్‌రైజ‌ర్స్ పేస‌ర్ ఉమ్రాన్ మాలిక్ పేరిట ఉంది. గుజ‌రాత్ టైటాన్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో ఉమ్రాన్ 4 ఓవ‌ర్ల‌లో 25 ప‌రుగులు ఇచ్చి 5 వికెట్లు ప‌డ‌గొట్టాడు. 

స‌న్‌రైజ‌ర్స్ ఇన్నింగ్స్‌లో రాహుల్ త్రిపాఠి (58), మార్క్ర‌మ్ (21), పూరన్ (19)లు మాత్ర‌మే రెండంకెల స్కోర్ చేయ‌గా, మిగతా ఆటగాళ్లంతా సింగిల్ డిజిట్ స్కోర్‌కే పరిమితమయ్యారు. క్రీజ్‌లో కుదురుకున్న మార్క్ర‌మ్‌, పూరన్ వికెట్ల‌తో పాటు సుచిత్‌, శ‌శాంక్ సింగ్‌, ఉమ్రాన్ మాలిక్‌ల‌ను ఔట్ చేసిన హసరంగ ఆర్సీబీ విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఆర్సీబీ బౌల‌ర్ల‌లో హేజిల్‌వుడ్ 2, మ్యాక్స్‌వెల్, హర్షల్ పటేల్ త‌లో వికెట్ ప‌డ‌గొట్టారు. 5 వికెట్ల‌తో స‌న్‌రైజ‌ర్స్ ప‌త‌నాన్ని శాసించిన హ‌స‌రంగ‌కు ప్లేయ‌ర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు ల‌భించింది. 

కాగా, ఈ సీజ‌న్‌లో సన్ రైజర్స్ కు ఇది వరుసగా నాలుగో ఓట‌మి. ఆ జ‌ట్టు ఇప్పటివరకు ఆడిన 11 మ్యాచ్‌ల్లో 6 మ్యాచ్‌ల్లో ఓట‌మిపాలై ప్లే ఆఫ్స్‌ ఆశలను దాదాపుగా వ‌దులుకుంది. మ‌రోవైపు ఆర్సీబీ ఇప్ప‌టివ‌ర‌కు ఆడిన 12 మ్యాచ్‌ల్లో 7 విజ‌యాల‌తో ప్లే ఆఫ్స్ దిశ‌గా దూసుకెళ్తుంది. 
చ‌ద‌వండి: IPL 2022: స్ట్రైక్‌ రేటు 375.. డీకేతో అట్లుంటది మరి! పట్టరాని సంతోషంలో కోహ్లి!

మరిన్ని వార్తలు