IPL 2022 SRH Vs RR: మరీ ఇంత దారుణమా.. అందరూ ఫోర్లు, సిక్స్‌లు ఇచ్చారు.. ఛీ.. మీరు మారరు ఇక!

30 Mar, 2022 07:20 IST|Sakshi

తొలి మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ ఓటమి

ట్రోల్‌ చేస్తున్న ఫ్యాన్స్‌

కొత్త సీజన్‌ను హైదరాబాద్‌ సన్‌రైజర్స్‌ ఓటమి తో మొదలు పెట్టింది. ముందుగా బౌలింగ్‌ వైఫల్యంతో భారీగా పరుగులిచ్చిన జట్టు, ఆ తర్వాత పేలవ బ్యాటింగ్‌తో ఓటమిని ఆహ్వానించింది. 211 పరుగుల ఛేదనలో 9 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన తర్వాత  హైదరాబాద్‌ కోలుకోలేకపోయింది. హైదరాబాద్‌ను ప్రసిధ్, చహల్‌ దెబ్బ తీశారు. చివర్లో మార్క్‌రమ్, సుందర్‌ ప్రయత్నం వృథాగానే ముగిసింది.

పుణే: ఐపీఎల్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ బోణీ చేసింది. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్‌ 61 పరుగుల తేడాతో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌పై ఘన విజయం సాధించింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన రాజస్తాన్‌ రాయల్స్‌ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. సంజూ సామ్సన్‌ (27 బంతుల్లో 55; 3 ఫోర్లు, 5 సిక్స్‌లు) అర్ధ సెంచరీ సాధించాడు.

దేవదత్‌ పడిక్కల్‌ (29 బంతుల్లో 41; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), జోస్‌ బట్లర్‌ (28 బంతుల్లో 35; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు), హెట్‌మైర్‌ (13 బంతుల్లో 32; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) రాణించారు. అనంతరం సన్‌రైజర్స్‌ 20 ఓవర్లలో 7 వికెట్లకు 149 పరుగులు చేసి ఓడింది. మార్క్‌రమ్‌ (41 బంతుల్లో 57 నాటౌట్‌; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), వాషింగ్టన్‌ సుందర్‌ (14 బంతుల్లో 40; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు.  

కీలక భాగస్వామ్యం... 
రాజస్తాన్‌ టాప్‌–5 బ్యాటర్లంతా ఒకరితో ఒకరు పోటీ పడి పరుగులు సాధించడంతో భారీ స్కోరు సాధ్యమైంది. హైదరాబాద్‌ తరఫున ఆరుగురు బౌలింగ్‌ చేయగా, అందరూ కనీసం ఫోర్‌ గానీ, సిక్స్‌ గానీ ఇచ్చారు.  

సుందర్‌ మెరుపులు...
భారీ ఛేదనను దూకుడుగా ప్రారంభించాల్సిన రైజర్స్‌ పవర్‌ప్లేలోనే కుప్పకూలింది.  చివర్లో సుందర్‌ మెరుపులు ఆకట్టుకున్నాయి.  బౌలింగ్‌లో 5 భారీ సిక్స్‌లు సహా 3 ఓవర్లలో 47 పరుగులు సమర్పించుకున్న అతను కూల్టర్‌ నైల్‌ వేసిన ఇన్నింగ్స్‌ 17వ ఓవర్లో చెలరేగిపోయాడు. ఈ ఓవర్లో సుందర్‌ వరుసగా 6, 4, 4, 2, 4, 4 తో మొత్తం 24 పరుగులు రాబట్టడం విశేషం.

మీరు మారరా ఇక!
ఇక గత సీజన్‌లో పేలవ ప్రదర్శనతో విమర్శలు మూటగట్టుకున్న సన్‌రైజర్స్‌ ఈ సీజన్‌ తొలి మ్యాచ్‌లో ఇలా ఓటమిపాలవ్వడాన్ని అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. సోషల్‌ మీడియా వేదికగా మీమ్స్‌ షేర్‌ చేస్తూ ఆగ్రహాన్ని వెళ్లగక్కుతున్నారు. ముఖ్యంగా సన్‌రైజర్స్‌ను గతంలో చాంపియన్‌గా నిలిపిన డేవిడ్‌ వార్నర్‌ పట్ల ఫ్రాంఛైజీ వ్యవహరించిన తీరును ఈ సందర్భంగా ఎండగడుతున్నారు.

‘‘మరీ ఇంత దారుణంగా ఓడిపోవడమా? అనామక ఆటగాళ్లను కూడా హీరోలు చేయగలరు మన ఎస్‌ఆర్‌హెచ్‌ బౌలర్స్‌. టాస్‌ గెలిచి కూడా ఓడిపోతారు. ఒకప్పుడు మనకు మంచి బౌలర్లు ఉన్నారన్న పేరుండేది. ఇప్పుడు బౌలర్లు అంతే బ్యాటర్లు కూడా అంతే! ఛీ.. మీరు మారరు ఇక’’అంటూ దారుణంగా ట్రోల్‌ చేస్తున్నారు.

చదవండి: Nicholas Pooran: కోట్లు పెట్టి కొన్నాం.. డకౌట్‌ అయితే ఎలా?

మరిన్ని వార్తలు