Tilak Varma: తిలక్‌ గురించి రోహిత్‌ చెప్పింది కరెక్ట్‌.. అయితే: టీమిండియా దిగ్గజం వ్యాఖ్యలు

17 May, 2022 18:36 IST|Sakshi
తిలక్‌ వర్మ( PC: IPL Twitter)

ముంబై ఇండియన్స్‌ యువ సంచలనం, తెలుగు తేజం తిలక్‌ వర్మపై టీమిండియా దిగ్గజం సునిల్‌ గావస్కర్‌ ప్రశంసల జల్లు కురిపించారు. తిలక్‌ అద్భుతమైన ఆట తీరు కనబరుస్తున్నాడని, సరైన మార్గంలో పయనిస్తున్నాడని కొనియాడారు. అయితే, ఫిట్‌నెస్‌ కాపాడుకోవాలని సూచించారు. అప్పుడే ఆటంకాలు లేకుండా కెరీర్‌ కొనసాగించవచ్చని అభిప్రాయపడ్డారు.

కాగా ఐపీఎల్‌ మెగా వేలం-2022లో 1.7 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. అంచనాలకు మించి రాణించిన ఈ హైదరాబాదీ బ్యాటర్‌ ఆడిన 12 మ్యాచ్‌లలో 368 పరుగులు సాధించాడు. అత్యధిక స్కోరు 61. స్టార్‌ ఆటగాళ్లు విఫలమవుతున్న వేళ బ్యాట్‌ ఝులిపించి తన సత్తా చాటుకున్నాడు. 

ఈ నేపథ్యంలో ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ సహా పలువురు క్రికెటర్లు తిలక్‌ వర్మను ప్రశంసిస్తున్నారు. ఇప్పుడు ఇక సునిల్‌ గావస్కర్‌ సైతం ఈ జాబితాలో చేరారు. ఈ మేరకు ఆయన జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘తిలక్‌ వర్మకు టీమిండియాలో అన్ని ఫార్మాట్లకు తగిన ఆటగాడిగా వెలుగొందగల నైపుణ్యం ఉందని రోహిత్‌ శర్మ అన్నాడు. అది నిజమే!

అయితే, ఇకపై మరింత ఎక్కువగా కష్టపడుతూ.. ఫిట్‌నెస్‌ మెరుగుపరచుకుంటూ.. టెక్నిక్‌కు మెరుగులు దిద్దుకుంటూ తిలక్‌ ముందుకు సాగాలి. అప్పుడే రోహిత్‌ మాటలకు అర్థం ఉందని అతడు నిరూపించగలుగుతాడు. నిజానికి తిలక్‌ వర్మ టెక్నిక్‌ పరంగా సరైన దారిలో ఉన్నాడు. ఫ్రంట్‌ ఫుట్‌ షాట్లు ఆడేటపుడు అతడి బ్యాట్‌ ప్యాడ్‌కు దగ్గరగా ఉంటుంది. చక్కగా డిఫెన్స్‌ చేసుకుంటాడు. తన బేసిక్స్‌ అన్నీ కరెక్ట్‌గా ఉన్నాయి.

అయితే, తన ప్రతిభను వృథా చేసుకోకుండా ఇదే పద్ధతిలో ముందుకు సాగితే భవిష్యత్తు బాగుంటుంది’’ అని పేర్కొన్నారు. కాగా ఐదుసార్లు చాంపియన్‌ అయిన ముంబై ఇండియన్స్‌ ఐపీఎల్‌-2022లో మాత్రం దారుణ ప్రదర్శనతో విమర్శలు మూటగట్టుకుంది. ఇప్పటి వరకు ఆడిన పన్నెండు మ్యాచ్‌లలో కేవలం మూడే గెలిచి పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది.  

చదవండి👉🏾IPL 2022 Playoffs: మనం కచ్చితంగా ప్లే ఆఫ్స్‌నకు వెళ్తాం... కోల్‌కతాలో..

Poll
Loading...
మరిన్ని వార్తలు