IPL 2022: రూ.100 కోట్లతో సునీల్‌ నరైన్‌ సరికొత్త రికార్డు

15 Dec, 2021 13:10 IST|Sakshi

కోల్‌కతా నైట్‌రైడర్స్‌(కేకేఆర్‌) ఆటగాడు.. విండీస్‌ మిస్టరీ స్పిన్నర్‌ సునీల్‌ నరైన్‌ ఐపీఎల్‌లో కొత్త రికార్డు సాధించాడు. ఐపీఎల్‌ చరిత్రలో విదేశీ ప్లేయర్‌గా రూ.100 కోట్ల మార్క్‌ను అందుకున్న రెండో ఆటగాడిగా నిలిచాడు. 2012లో కేకేఆర్‌ ద్వారా ఐపీఎల్‌ అరంగేట్రం చేసిన సునీల్‌ నరైన్‌ వరుసగా 10వ ఏడాది కేకేఆర్‌ తరపున ఐపీఎల్‌ 2022 సీజన్‌లో ప్రాతినిధ్యం వహించనున్నాడు.

చదవండి: ధోని తర్వాత సీఎస్‌కేకు కెప్టెన్‌ అయ్యేది ఆ ఆటగాడే!

మెగావేలానికి ముందు ఫ్రాంచైజీలు రిటైన్‌ జాబితాను ప్రకటించాయి. కేకేఆర్‌ ఫ్రాంచైజీ సునీల్‌ నరైన్‌(రూ.6 కోట్లు)తో పాటు ఆల్‌రౌండర్‌ ఆండ్రీ రసెల్‌(రూ.12 కోట్లు), వరుణ్‌ చక్రవర్తి(రూ. 8 కోట్లు), వెంకటేశ్‌ అయ్యర్‌(రూ. 8 కోట్లు) తమ వద్దనే ఉంచుకుంది. కాగా కేకేఆర్‌ రిటైన్‌ జాబితాను ప్రకటించక ముందు సునీల్‌ నరైన్‌ ఐపీఎల్‌ ద్వారా తాను ఆడిన 10 సీజన్లు కలిపి రూ.95.6 కోట్లు సంపాదించాడు. తాజాగా  కేకేఆర్‌ నరైన్‌ను రూ. 6 కోట్లుకు రిటైన్‌ చేసుకోవడంతో అతని సంపాదన విలువ రూ. 100 కోట్లు దాటింది. ఇక కేకేఆర్‌ తరపున సునీల్‌ నరైన్‌  134 మ్యాచ్‌ల్లో 958 పరుగులు చేయడంతో పాటు బౌలింగ్‌లో 143 వికెట్లు తీశాడు.

ఇంతకమందు దక్షిణాఫ్రికా స్టార్‌ బ్యాట్స్‌మన్‌ ఏబీ డివిలియర్స్‌ మాత్రమే ఐపీఎల్‌లో రూ.100 కోట్లు సంపాదన చూసిన తొలి విదేశీ ప్లేయర్‌గా రికార్డులకెక్కాడు. ఓవరాల్‌గా ఐపీఎల్‌ చరిత్రలో అత్యధిక సంపాదన జాబితాలో నరైన్‌ కంటే ముందు ఐదుగురు మాత్రమే ఉన్నారు. సీఎస్‌కే కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని(రూ.152.8 కోట్లు) తొలి స్థానంలో ఉన్నాడు. ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (రూ.146.6 కోట్లు) రెండోస్థానంలో.. విరాట్‌ కోహ్లి(ఆర్‌సీబీ, రూ. 143.2 కోట్లు), సురేశ్‌ రైనా( సీఎస్‌కే, రూ .110. 7 కోట్లు), ఏబీ డివిలియర్స్‌( ఆర్‌సీబీ, రూ. 102.5 కోట్లు) వరుసగా మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నారు. 

చదవండి:  వెంకటేశ్‌ అయ్యరా మజాకా.. అప్పుడు 20 లక్షలు.. ఇప్పుడు 8 కోట్లు

మరిన్ని వార్తలు