IPL 2022 SRH vs RCB: బెంగళూరు బోల్తా.. ఎస్‌ఆర్‌హెచ్‌కు వరుసగా ఐదో విజయం

24 Apr, 2022 05:24 IST|Sakshi
Courtesy: IPL Twitter

68 పరుగులకే ఆలౌటైన ఆర్‌సీబీ

చెలరేగిన సన్‌రైజర్స్‌ బౌలర్లు

9 వికెట్లతో హైదరాబాద్‌ గెలుపు

ఐదేళ్ల క్రితం 2017 ఏప్రిల్‌ 23న రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ) ఐపీఎల్‌ చరిత్రలో అత్యల్ప స్కోరు (49)ను నమోదు చేసింది. ఇప్పుడు సరిగ్గా అదే రోజు దాదాపు అదే ప్రదర్శనను కనబరుస్తూ తమ రెండో అత్యల్ప స్కోరు సాధించింది. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ బౌలర్లు ఒకరితో మరొకరు పోటీ పడి ఆర్‌సీబీని 68 పరుగులకే కుప్పకూల్చారు. ఒక్క బ్యాటర్‌ కూడా పట్టుదలగా నిలవలేకపోగా, ముగ్గురు డకౌటయ్యారు. ఆ తర్వాత సునాయాస లక్ష్యాన్ని సన్‌రైజర్స్‌ ఆడుతూ పాడుతూ ఛేదించి లీగ్‌లో తమ స్థానాన్ని మరింత పటిష్ట పర్చుకుంది.

ముంబై: ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జోరు కొనసాగుతోంది. అద్భుత ప్రదర్శనతో సత్తా చాటిన హైదరాబాద్‌ లీగ్‌లో వరుసగా ఐదో విజయాన్ని అందుకుంది. శనివారం జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్‌ 9 వికెట్ల తేడాతో బెంగళూరు రాయల్‌ చాలెంజర్స్‌పై ఘన విజయం సాధించింది. వరుసగా ఏడో మ్యాచ్‌లోనూ టాస్‌ గెలిచిన విలియమ్సన్‌ ఫీల్డింగ్‌ ఎంచుకున్నాడు. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు 16.1 ఓవర్లలో 68 పరుగులకే ఆలౌటైంది. ]

సుయాశ్‌ (15), మ్యాక్స్‌వెల్‌ (12) మాత్రమే రెండంకెల స్కోరు చేయగలిగారు. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ మార్కో జాన్సెన్‌ (3/25), నటరాజన్‌ (3/10) ఆర్‌సీబీని దెబ్బ కొట్టారు. అనంతరం హైదరాబాద్‌ 8 ఓవర్లలో వికెట్‌ నష్టానికి 72 పరుగులు చేసి గెలిచింది. అభిషేక్‌ శర్మ (28 బంతుల్లో 47; 8 ఫోర్లు, 1 సిక్స్‌) ధాటిగా ఆడటం తో మరో 12 ఓవర్లు మిగిలి ఉండగానే గెలిచిన సన్‌రైజర్స్‌ భారీగా రన్‌రేట్‌ను మెరుగుపర్చుకుంది.  

టపటపా...
తొలి ఓవర్లో 5 పరుగులు చేసిన బెంగళూరు పతనం రెండో ఓవర్‌ నుంచి మొదలైంది. ఈ ఓవర్‌ వేసిన జాన్సెన్‌ రెండో బంతికి డుప్లెసిస్‌ (5) స్టంప్స్‌ ఎగరగొట్టగా, తర్వాతి బంతికే విరాట్‌ కోహ్లి (0) వెనుదిరిగాడు. కోహ్లి వరుసగా రెండో మ్యాచ్‌లోనూ ‘గోల్డెన్‌ డక్‌’ నమోదు చేయడం విశేషం. అదే ఓవర్‌ చివరి బంతికి అనూజ్‌ రావత్‌ (0) కూడా అవుటయ్యాడు. పవర్‌ప్లే ముగిసేసరికి మ్యాక్స్‌వెల్‌ (12) కూడా పెవిలియన్‌ చేరగా, స్కోరు 25/4 వద్ద నిలిచింది.

సుయాశ్, ఈ సీజన్‌లో జట్టు తరఫున కీలక ఇన్నింగ్స్‌లు ఆడిన కార్తీక్‌ (0), షహబాజ్‌ (7) కూడా 7 బంతుల వ్యవధిలో అవుట్‌ కావడంతో బెంగళూరు కోలుకునే అవకాశం లేకపోయింది. ఒకదశలో ఆర్‌సీబీ ‘49’ అయినా దాటగలదా అనిపించింది. మరో 23 బంతులు మిగిలి ఉండగానే జట్టు ఇన్నింగ్స్‌ ముగిసింది. అనంతరం సన్‌రైజర్స్‌ ఏమాత్రం ఆలస్యం చేయకుండా చకచకా మ్యాచ్‌ను ముగించింది. ఛేదనలో అభిషేక్‌ దూసుకెళ్లాడు. సిరాజ్‌ ఓవర్లో వరుసగా 6, 4 కొట్టిన అతను, హాజల్‌వుడ్‌ ఓవర్లో 4 ఫోర్లు బాది సత్తా చాటాడు.

స్కోరు వివరాలు
రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు ఇన్నింగ్స్‌: డుప్లెసిస్‌ (బి) జాన్సెన్‌ 5; రావత్‌ (సి) మార్క్‌రమ్‌ (బి) జాన్సెన్‌ 0; కోహ్లి (సి) మార్క్‌రమ్‌ (బి) జాన్సెన్‌ 0; మ్యాక్స్‌వెల్‌ (సి) విలియమ్సన్‌ (బి) నటరాజన్‌ 12; సుయాశ్‌ (స్టంప్డ్‌) పూరన్‌ (బి) సుచిత్‌ 15; షహబాజ్‌ (సి) పూరన్‌ (బి) ఉమ్రాన్‌ 7; దినేశ్‌ కార్తీక్‌ (సి) పూరన్‌ (బి) సుచిత్‌ 0; హర్షల్‌ (బి) నటరాజన్‌ 4; హసరంగ (బి) నటరాజన్‌ 8; హాజల్‌వుడ్‌ (నాటౌట్‌) 3; సిరాజ్‌ (సి) విలియమ్సన్‌ (బి) భువనేశ్వర్‌ 2; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (16.1 ఓవర్లలో ఆలౌట్‌) 68.
వికెట్ల పతనం: 1–5, 2–5, 3–8, 4–20, 5–47, 6–47, 7–49, 8–55, 9–65, 10–68.
బౌలింగ్‌: భువనేశ్వర్‌ 2.1–0–8–1, జాన్సెన్‌ 4–0–25–3, నటరాజన్‌ 3–0–10–3, సుచిత్‌ 3–0–12–2, ఉమ్రాన్‌ 4–0–13–1.  

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఇన్నింగ్స్‌: అభిషేక్‌ (సి) రావత్‌ (బి) హర్షల్‌ 47; విలియమ్సన్‌ (నాటౌట్‌) 16; రాహుల్‌ త్రిపాఠి (నాటౌట్‌) 7; ఎక్స్‌ట్రాలు 2; మొత్తం (8 ఓవర్లలో వికెట్‌ నష్టానికి) 72. వికెట్ల పతనం: 1–64. 
బౌలింగ్‌:
సిరాజ్‌ 2–0–15–0, హాజల్‌వుడ్‌ 3–0–31–0, హర్షల్‌ పటేల్‌ 2–0–18–1, హసరంగ 1–0–7–0.

మరిన్ని వార్తలు